పశ్చిమాసియా ప్రాంతం దశాబ్దాలుగా ప్రపంచ భౌగోళిక-రాజకీయాలకు ముఖ్య వేదికలలో ఒకటిగా నిలుస్తున్నది. అగ్రరాజ్యాలను అమితంగా ఆకర్షించే విస్తారమైన చమురు నిల్వలు; అంతర్జాతీయ వాణిజ్యానికి ఆయువుపట్టుగా ఉండే హొర్ముజ్, బాబ్ అల్ మాండెబ్, సూయజ్ వంటి అంతర్జాతీయ జలమార్గాలు ఈ ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాధాన్యతను చేకూరుస్తున్నాయి. దీనికి తోడు మక్కా, మదీనా, కర్బలా, మషాద్, జెరూసలేం వంటి సున్నితమైన మతవిశ్వాస కేంద్రాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. వీటన్నింటి కారణంగా, పశ్చిమాసియా నిరంతరం విభిన్న శక్తుల వ్యూహప్రతివ్యూహాలకు కార్యరంగంగా మారుతున్నది.
1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం నేపథ్యంలో ఇరాన్-అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ ఉద్రిక్తతలను కొంతవరకు తగ్గించే లక్ష్యంతో, ఆ రెండు దేశాల మధ్య 2015లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చారిత్రక అణు ఒప్పందం జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కుదిరింది. అయితే, దాని నుంచి 2018లో అమెరికా ఏకపక్షంగా వైదొలిగిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తన యురేనియం సుసంపన్నతను కేవలం పౌర అవసరాలకే పరిమితం చేయాలని, ప్రతిగా పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలనేది ఈ ఒప్పంద సారాంశం. అమెరికా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, ఇరాన్ మాత్రం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామని పట్టుబట్టింది. తన అణు కార్యక్రమాలను అంతర్జాతీయ ఒత్తిళ్లకు వెరవకుండా చాలావరకు ముందుకు తీసుకెళ్లింది కూడా.
ఈ చర్య-ప్రతిచర్యల పర్యవసానమే ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ప్రత్యక్ష చర్యలని విశ్లేషకులు భావిస్తారు. ఉభయ దేశాల ప్రతిష్టంభన మధ్యలో ఇజ్రాయెల్ ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తున్నది.
ఇరాన్ అణు సామర్థ్య విస్తరణను తన ఉనికికే ముప్పుగా భావిస్తున్న ఇజ్రాయెల్ – నతాంజ్, ఇస్ఫహాన్ వంటి అణు, క్షిపణి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని, ప్రత్యక్ష వైమానిక, డ్రోన్ దాడులు, సైబర్ వ్యూహాలకు పాల్పడింది. బదులుగా, ఇజ్రాయెల్ వ్యూహాత్మక స్థావరాలు, డిమోనా వంటి సున్నిత అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ నేరుగా; అలాగే దాని మద్దతు ఉన్న హమాస్, హెజ్బొల్లా వంటి శక్తుల ద్వారా దాడులకు పాల్పడటం ఇరు పక్షాలలో ఉన్న అభద్రతాభావాన్ని, అపనమ్మకాన్ని సూచిస్తున్నది. వాషింగ్టన్ దౌత్యవిధానాలు, ఆర్థిక ఆంక్షల ద్వారా ఇరాన్‌ను నియంత్రించాలని చూస్తుంటే; ఇజ్రాయెల్ మాత్రం ప్రత్యక్ష కార్యాచరణకే మొగ్గు చూపింది.
ఇటీవలి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ / రోరింగ్ లయన్ దాడుల్లో ఇరాన్ సుప్రీమ్ లీడర్ అలీ ఖమేనీ సహా ఉన్నత నాయకులు లక్ష్యం చేసుకోబడ్డారని నివేదికలు వెలువడ్డాయి. బదులుగా ఇరాన్ తన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ IV ద్వారా ఇజ్రాయెల్ లక్ష్యాలు, బహ్రెయిన్, కతార్, యూఏఈ వంటి అమెరికా ప్రాంతీయ స్థావరాలపై పలుదఫాలుగా మిస్సైల్, డ్రోన్ దాడులు జరిపింది. ఈ ప్రతిదాడులు ఎర్ర సముద్రం నుంచి హొర్ముజ్ వరకు వాణిజ్యానికి అంతరాయం కలిగించి, ప్రాంతీయ ఉద్రిక్తతలను తారాస్థాయికి చేర్చాయి. అయితే ఏప్రిల్‌లో కాల్పుల విరమణ అమలు అయిన తర్వాత, జూన్ 14-15 నాటికి అమెరికా-ఇరాన్ మధ్య ప్రాథమిక అవగాహన కుదిరింది. అబ్రహం ఒప్పందాలు ఆర్థిక, సాంకేతిక, పర్యాటక రంగాలలో సహకారానికి కొంతవరకు తోడ్పడ్డాయి.
దశాబ్దాలుగా వెంటాడుతున్న ప్రధాన భద్రతా, రాజకీయ సమస్యలు ఇంకా యథాతథంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, విభేదాలను మరింత పెంచే సైనిక చర్యల కంటే, ప్రాంతీయ శక్తుల మధ్య సమగ్రమైన దౌత్య సంప్రదింపులు, అన్ని పక్షాల భద్రతా ఆకాంక్షలను గౌరవించే దీర్ఘకాలిక శాంతి ప్రణాళికలు మాత్రమే పశ్చిమాసియాను స్థిరత్వం వైపు నడిపించగలవు. ఇటీవలి అమెరికా-ఇరాన్ ప్రాథమిక అవగాహన వంటి పరిణామాలు ఈ దిశలో మరో ముందడుగుగా చూడవచ్చు. అయితే ఒప్పందం పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అమెరికా, ఇరాన్ వైపు నుంచి ఏకపక్షంగా వెలువడుతున్న వివరాలలో హస్తిమశకాంతరం ఉండటం అనిశ్చితిని, అనుమానాలను పెంచుతున్నది.
అంతేగాక, పరస్పరం అంగీకరించిన షరతుల అమలులో ఉభయపక్షాల చిత్తశుద్ధి, ఒప్పందం పట్ల ఇజ్రాయెల్ దృక్పథం వంటి అంశాలు ఈ దీర్ఘకాలిక అవగాహన భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్‌ను పూర్తి స్థాయిలో సంప్రదించలేదని లేదా ఒప్పంద వివరాలతో ఆ దేశం అసంతృప్తిగా ఉన్నదని తెలుస్తున్నది. భారతీయ స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువలో హఠాత్తుగా కనిపించిన మెరుపులు వాస్తవాల ఆధారంగా ఉన్నాయా, లేదా అత్యుత్సాహంతో కూడుకున్న ఊహాజనిత ఆశావాదం మాత్రమేనా! అనే విషయం ఇంకా సందిగ్ధంగానే ఉన్నది. ఒప్పందం సంతకం అయి, దాని పూర్తి వివరాలు వెలువడిన తర్వాత కాలమే ఈ సంశయాన్ని తీర్చుతుంది.
కృష్ణ బాలాజీ
99490 98406