ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నవి రాజకీయాలైతే.. ఆ రాజకీయాలను శాసించేది మాత్రం ఓటు. అధికార పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా? విపక్ష పార్టీ అధికారంలోకి రావాలా? మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చోవాలా? అనేది నిర్ణయించేది ఆ ఓటరే. ఓటరు తీర్పుపైనే రాజకీయ పార్టీలు, నాయకుల రాత, దేశ భవితవ్యం ఆధారపడి ఉన్నది. ఈ తరుణంలో దేశంలో ఏప్రిల్ 19న మొదలైన సార్వత్రిక ఎన్నికలు నాలుగో దశకు చేరుకున్న విషయం విదితమే. మరి ఈసారి ఓటరు తీర్పు ఎలా ఉండనుంది? ఇండియా కూటమా? ఎన్డీయేనా? లేదా సంకీర్ణమా అనేది ఆసక్తికరంగా మారింది.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఈసారి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? బీజేపీనా, కాంగ్రెస్సా? లేదా ఎన్డీయేనా, ఇండియా కూటమా? అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ రెండు కూటములకు మరో కూటమి తోడైతే తప్ప కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత 17 లోక్‌సభ ఎన్నికలను గమనిస్తే.. 1989 నుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని చరిత్ర చెప్తున్నది.
దేశంలో తామే అధికారంలోకి వస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికిన జాతీయ పార్టీలు నేడు పెద్ద స్థాయి ప్రాంతీయ పార్టీల్లాగా మారిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉండగా కేంద్రీకృత ఆలోచనలతో రాష్ర్టాలకు ఉండే ప్రత్యేకతలను, ప్రాధాన్యతలను విస్మరించడం అందుకు ఒక కారణమైతే.. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంపై గవర్నర్‌గిరి చేయడం, రాష్ట్రపతి పాలన విధించడం మరో కారణం. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు, అసమర్థ పాలన, సాంప్రదాయ పద్ధతులు, చీలికలు, అసమ్మతి, అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ అనునిత్యం సంఘర్షణలో ఉండిపోయింది. ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేలా ఉన్న కాంగ్రెస్ పార్టీ 1984లో వచ్చిన 414 సీట్ల నుంచి 2019 నాటికి 52 సీట్లకు పడిపోయింది.
కాంగ్రెస్ స్థానంలో 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తొలిసారిగా 282 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. 2019లో 303 సీట్లు వచ్చినప్పటికీ, అందులో 41 పార్టీల మద్దతున్న ఎన్డీయే కూటమి ఉందన్న విషయం మర్చిపోవద్దు. అందుకే బీజేపీ ఎక్కడ కూడా తమ పార్టీ సత్తా ఇది అని చెప్పడం లేదు. ‘మోదీ అంటే భవిష్యత్తు’ అనే స్థాయి నుంచి ‘ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ అనే నినాదం ఇచ్చే స్థాయికి ఆ పార్టీ వచ్చింది.
ఈ దశాబ్ద కాలంలో కాంగ్రెస్‌ను మించి మోదీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అవినీతికి వ్యతిరేకం అంటూనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అక్కున చేర్చుకున్నారు. పార్టీలను చీల్చి, నాయకులను ప్రలోభాలకు గురి చేసి వివిధ రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న విపక్ష ప్రభుత్వాలను కూల్చివేశారు. వివాదాస్పద రైతు చట్టాలు, సీఏఏ, ఎన్ఆర్సీ, మణిపూర్ అల్లర్లు, నిరుద్యోగ సమస్యలు, ఇష్టారాజ్యంగా కార్పొరేట్ తాయిలాలు, అందుకు ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్లు, మైనారిటీలపై వివక్షలు, దళితులపై దౌర్జన్యాలు, పెరిగిన ధరలు, తగ్గిన జీతాలు, కష్టతరమైన సామాన్యుల బతుకులు వంటి అంశాల వల్ల మోదీ చరిష్మా మసకబారిపోయింది.
చెప్పుకోవడానికి చేసిందేమీ లేకపోవడంతోనే అయోధ్యలో రామమందిరం, గుజరాత్లో పటేల్ విగ్రహం, అదిగో పాకిస్థాన్, ఇదిగో చైనా అంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. అవినీతి ఆరోపణలు వస్తున్నవారిని పార్టీలో చేర్చుకుంటూనే తిరిగి అవినీతి పేరిట విపక్ష నాయకులపై ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు పెడుతూ కక్ష సాధింపులకు దిగుతుండటంతో ప్రజలు విసిగెత్తిపోయారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని దారిమళ్లించడానికే ఈసారి 400 సీట్లు గెలుస్తాం అని బాకాలుదుతున్నది.
వాస్తవానికి బీజేపీ ఎన్నడూ సొంత బలంతో అధికారంలోకి రాలేదు. ఆ పార్టీకి అంత బలం లేదు కూడా. 2014, 2019లో భారీగా సీట్లు గెల్చుకున్నప్పటికీ దాని వెనుక ఎన్డీయే అనే 41 పార్టీల కూటమి ఉన్నది. ఆ కూటమిలో బీజేపీ ఒక పెద్ద పార్టీ మాత్రమే. 2019లో ఎన్డీయే 353 స్థానాలు సాధించగా.. అందులో బీజేపీ గెలిచినవి 303. కూటమిలోని 41 పార్టీల్లో రెండు జాతీయ పార్టీలు (బీజేపీ, ఎన్సీపీ), 20 ప్రాంతీయ పార్టీలు, 19 గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలు గెలవగా.. ప్రస్తుతం ఆ పార్టీ బలం 290. అంటే రెండోసారి అధికారంలో ఉండగానే వివిధ ఉప ఎన్నికల్లో 13 సీట్లను బీజేపీ కోల్పోయింది. అధికారంలో ఉండి కూడా తన సిట్టింగ్ స్థానాలను కాపాడుకోలేని కమలం పార్టీ మూడోసారి ఒంటరిగా అధికారంలోకి వస్తానని చెప్తుండటం హాస్యాస్పదం.
ఉత్తరాదిలోని సీట్లను నమ్ముకొని, దక్షిణాదిన దండం పెట్టిన బీజేపీ నేడు ఉత్తరభారత్‌లో తగ్గే సీట్లను దక్షిణాది ద్వారా భర్తీ చేసుకోవాలని కలలు కంటున్నది. కానీ, దక్షిణ భారత్‌లో ఉన్న 130 సీట్లలో నుంచి 2019లో బీజేపీ గెలుచుకున్నది కేవలం 29. అందులో కర్ణాటక వాటానే అధికం. ఉత్తరాదిలో బీజేపీ తన సిట్టింగ్ సీట్లలో చాలావాటిని కోల్పోయే అవకాశం ఉంది. ఈ లోటును పూడ్చుకోవాలంటే బీజేపీ దాని మిత్రపక్షాలు అద్భుతమైన సామర్థ్యాన్ని చూపాల్సి ఉంటుంది.
ఇటువంటి పరిస్థితుల్లో అటు ఇండియా కూటమి గాని, ఇటు ఎన్డీయే గాని సంపూర్ణ మెజారిటీ సాధించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను, అంతకుమించి ప్రభుత్వాన్ని మార్చాలనే ప్రజల ఆలోచనను తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ఇక కాంగ్రెస్ పరిస్థితి చెప్పలేం. మరోసారి బీజేపీ కనుక అధికారంలోకి వస్తే.. ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు, రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్లు, సమాఖ్య స్ఫూర్తి ప్రమాదంలో పడతాయనే ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో సామాన్యులు, రైతులు, మహిళలు, కార్మికులు, మైనారిటీలు, యువత, దళితుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. మన దేశంలోని సుమారు 40 కోట్ల మంది దళితులు, 20 కోట్ల మంది మైనారిటీల ఓట్లు ఎటువైపు పడతాయన్నది కూడా చర్చనీయాంశమే.
జాతీయ పార్టీల వల్ల మన దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అందుకే ఓటర్లు సంకీర్ణ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు. ఆ దిశగానే వారి తీర్పు ఉండనున్నది. ఈ క్రమంలో తటస్థ వైఖరిని కలిగి ఉన్న పార్టీల సీట్లే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్నాయి. కేసీఆర్ చెప్పినట్టు అది మూడో ఫ్రంట్ కావొచ్చు, లేదా షరతులతో ఈ రెండు ఫ్రంట్లలో ఏదో ఒక దానికి మద్దతు ఉండొచ్చు.
తుంగ బాలు
99859 30246