‘పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి వ్యక్తికీ ఉపాధి కల్పించడమే నిజమైన స్వరాజ్య లక్ష్యం’ అని చెప్పిన మహాత్మాగాంధీ మాటలను మన దేశ రాజకీయ వ్యవస్థ పూర్తిగా విస్మరించింది. దాదాపు ఎనభై ఏండ్ల స్వతంత్ర భారతదేశాన్ని నిరుద్యోగ సమస్య ఎంతో కాలం నుంచి పట్టి పీడుస్తున్నది. ఈ సమస్య పరిష్కారానికి బాధ్యత వహించాల్సిన రాజకీయ పార్టీలు నిరుద్యోగులను కేవలం రాజకీయ సరుకుగా వాడుకుంటున్నాయి.
ప్రముఖ ఆర్థికవేత్త వై.గాసెట్ వ్యాఖ్యల్లో ‘నిరుద్యోగం.. మరణం కంటే దారుణమైనది, సమాజంలోనే కాదు..కుటుంబంలోనూ నిరాదరణకు గురిచేస్తుంది’ నిరుద్యోగ యువత ఇపుడు ఆత్మనూన్యతా భావనకు లోనవుతున్నది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2026, మే ప్రకారం.. మనదేశ నిరుద్యోగిత రేటు 5.5%. ఇది గ్రామాల్లో 5.1%, పట్టణ ప్రాంతాల్లో 6.4%గా ఉన్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే ప్రముఖ ప్రైవేట్ సంస్థ 2026, మే నాటికి నిరుద్యోగిత రేటు 6.85%గా నిర్ధారించింది. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026 పేరుతో అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక నిరుద్యోగ తీవ్రతను, విస్తుపోయే వాస్తవాలను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం 15-25 ఏండ్ల మధ్య వయసున్న గ్రాడ్యుయేట్లు 40%, 25-29 ఏండ్ల మధ్య వయసున్న గ్రాడ్యుయేట్లు 20% నిరుద్యోగులుగానే ఉంటున్నారు.
1983లో 35.02% గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉంటే, 2023 నాటికి 39.33% పెరిగింది. గ్రాడ్యుయేట్లలో 7% కంటే తక్కువమంది మాత్రమే ఒక సంవత్సరంలోపు శాశ్వత జీతం కలిగిన ఉద్యోగాలను పొందుతున్నారంటే మానవవనరుల హననం ఎంతగా జరుగుతున్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల చెప్పిన తీర్పు నిరుద్యోగ యువతను మరింత అసహాయ స్థితిలోకి నెట్టివేసింది.
10వ తరగతి అర్హత కలిగిన బ్యాంక్ అటెండెంట్ పోస్టుకు గ్రాడ్యుయేట్ చేసిన వ్యక్తి అనర్హుడుగా తీర్పు చెప్పింది. ఉన్నత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు తక్కువ అర్హతతో కూడిన ఉద్యోగాలకు పోటీపడడంతో, ఆయా పరిస్థితుల వలన ఉన్నత విద్య పొందలేనివారి అవకాశాలు దెబ్బతింటాయని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది. ఉన్నత విద్య చదివి, ఉపాధి లేక సమాజం, కుటుంబం నుంచి అవమానాలు, ఆర్థిక ఒత్తిడికి గురవుతున్న నిరుద్యోగ యువతను ఈ తీర్పు అసహనానికి గురిచేసింది. పదేపదే నిరుద్యోగులను అవమానకరంగా బోనులో నిలబెడుతున్న న్యాయవ్యవస్థ రాజ్యాంగపరంగా ఉపాధి పొందే యువతకు, ఉన్నత విద్య చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలను ఏనాడూ నిర్దేశించకపోవడం విచారకరం.
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులను ఇంధనంగా వాడుకున్నది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభావేదికల మీద చెప్పారు. అధికారంలోకి రావడానికి అలవికాని హామీలు ఇచ్చి, నేడు వాటిని అమలు చేయడంలో పాలకపక్షం బోర్లా పడింది. ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో నిరుద్యోగం విలయతాండవం చేసున్నది.
నిరుద్యోగులు అర్ధాకలితో రోడ్లపై అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరిస్తున్నది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఆచరణలో పూర్తిగా విఫలమైంది. ప్రతి జూన్ 2న జ్యాబ్ క్యాలెండర్, దానికి అనుగుణంగా నియామకాలు చేపడుతామని చెప్పిన కాంగ్రెస్ పాలకులు నిరుద్యోగ సమస్యను దారిమళ్లించే ప్రయత్నాల్లో తలమునకలైపోయారు. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు ఉన్నాయని ప్రకటించి, నేడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేవలం 5 వేలు పోస్టులు మాత్రమే నింపుతామని చెప్పడం నిరుద్యోగులను ఆగ్రహావేశాలకు గురిచేస్తున్నది. ఎన్నో సంవత్సరాలు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన నిరుపేద, మధ్యతరగతి యువత ఆశలు ఆవిరి కాకముందే ప్రభుత్వం స్పందించాలి.
పీరియాడిక్ లేబర్ఫోర్స్ సర్వే 2025 ప్రకారం దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు కలిగిన మూడు రాష్ర్టాల సరసన తెలంగాణ ఉన్నది. (తెలంగాణ 5%, పంజాబ్ 5.3%,గోవా 8.3%). ఇండియన్ ఎకనామిక్ సర్వే 2025-2026 నివేదికను విశ్లేషించిన ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ బజాజ్ బ్రోకింగ్ తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.9%గా ఉన్నదని, ఇది దేశ నిరుద్యోగిత రేటు 5.2% కంటే చాలా అధికమని పేర్కొన్నది. దక్షిణభారతంలో అత్యధిక నిరుద్యోగ రేటు కలిగిన రాష్ట్రం తెలంగాణే అని వెల్లడించింది.
ప్రముఖ సోషియాలజిస్టు ఎమిల్ దర్కైమ్ చెప్పినట్టు ‘సమాజం వ్యక్తులకు అర్థవంతమైన పాత్రను కల్పించకపోతే అస్థిరత పెరుగుతుంది’ అనే విషయాన్ని ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకోవాలి. దేశంలో ఒకవైపు పేపర్ లీకేజీలు, మరోవైపు తీవ్రమైన నిరుద్యోగంతో విసిగి వేసారిపోయిన యువత పక్కదారి పట్టకముందే మేల్కోవాలి. సామాజిక రుగ్మతలు పరిష్కరించకుండా ప్రశ్నించే గొంతుకలను లేకుండా చేస్తామనుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది.
– (వ్యాసకర్త: అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
నూకల మధు యాదవ్ 6303343359