2023-24 విద్యా సంవత్సరంలో భాగంగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ బడుల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ‘పఠనోత్సవం’ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పఠనం ద్వారా విద్యార్థులకు పుస్తకాలపై జిజ్ఞాస పెంపొందుతుంది. తద్వారా వారు పోటీ పరీక్షల్లోనూ విజయం సాధిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించింది. జూన్ 12 నుంచి పాఠశాలలను పునః ప్రారంభించింది. అనంతరం పుస్తకాల పంపిణీ కూడా చేసింది. అయితే రాష్ట్రంలోని విద్యార్థినీ విద్యార్థులకు 3వ తరగతిలో రావాల్సిన పుస్తక పఠనం తొమ్మిది, పదవ తరగతి వరకు వచ్చినా రావడం లేదని అనేక స్వచ్ఛంద సంస్థలు చేసిన సర్వేలలో తేటతెల్లమైంది. ఎస్సీఈఆర్టీ నియమించిన జిల్లా, రాష్ట్రస్థాయి జట్టుల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే ‘పఠనోత్సవం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పఠనోత్సవం నిర్వహించడానికి విధి, విధానాలు, ప్రభుత్వ ఉత్తర్వులను ఈ కిందివిధంగా రూపొందించారు.
ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులు ధారాళంగా చదువడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా ఎదగడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే. ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలి. ప్రతిరోజు పుస్తక పఠనం కోసం ఒక పీరియడ్ (లైబ్రరీ) కేటాయించాలి. ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని విద్యార్థులతో పది నిమిషాలు బయటికి చదివిం చాలి. చార్టులపై లేదా నల్లబల్లపై పదాలను రాసి ప్రదర్శించాలి.
వారంలో మూడు రోజులు మాతృభాష, మిగతా మూడు రోజులు ఆంగ్ల భాషలో కథల పుస్తకాలను చదివించాలి. గ్రంథాలయ కమిటీలను ఏర్పాటుచేయాలి. ఈ కమిటీ సభ్యులు విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా పుస్తకాలను ఎంపిక చేసుకొని విద్యార్థులు చదివేలా ప్రోత్సహించాలి. విద్యార్థుల మేధోస్థాయిని బట్టి, వారిని గ్రూపులుగా విభజించాలి. ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా సలహా సూచనలందించాలి. ప్రతిరోజు ప్రార్థన సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులచే పుస్తకాలను చదివించాలి. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రతి శనివారం పఠన పోటీలు నిర్వహించాలి. ప్రతి నెలా జరిగే తల్లిదండ్రుల సమావేశంలోనూ విద్యార్థులచే చదివించాలి. బాగా చదివే పిల్లలను అభినందించాలి. విద్యార్థుల పుట్టినరోజును పురస్కరించుకొని వారికి పుస్తకాలనే బహుమతులుగా ఇవ్వాలి. అన్ని పాఠశాలల్లో జూలై 10 నుంచి జూలై 15 వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలి. ప్రతి ఉపాధ్యాయుని వద్ద తమ తరగతిలో వారి వారి సబ్జెక్టులో ఎంత మంది విద్యార్థులు ధారాళంగా చదువుతారు, ఎంతమంది నెమ్మదిగా చదువుతారు, ఎంతమంది చదువు రానివారున్నారనే వివరాలు ఉండాలి.
మండల విద్యాధికారులు, నోడల్ అధికారులు ‘తొలిమెట్టు’ కార్యక్రమంలో సూచించిన విధంగా పలు పాఠశాలలను సందర్శించినప్పుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలి. మండల, జిల్లాస్థాయిలో తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, ఉపాధ్యాయులతో కోర్ కమిటీని ఏర్పాటుచేసి వారు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా కథలు, గేయాలు, ఆడియో స్టోరీస్ వంటివి పాఠశాలలకు పంపేవిధంగా చూడాలి.
రాష్ట్రస్థాయిలోని ఎస్సీఈఆర్టీ సమగ్ర శిక్షణ అధికారులు వివిధ జిల్లాల్లో మానిటరింగ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తే ‘తొలిమెట్టు’ ద్వారా మనం ఆశించే ఫలితాలను మరింత తొందరగా చేరుకుంటాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, నోడల్ అధికారులు పాల్గొని విజయవంతం చేయాలి. పుస్తక పఠనం ద్వారా విద్యార్థులకు అనేక ప్రయోజనాలున్నాయి. తాము చదివిన విషయాలను అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్నది వివరించేందుకు అవకాశం ఉంటుంది.
బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చింది. చాలామంది కంప్యూటర్, ఇంటర్నెట్, గూగుల్, యూట్యూబ్, వీడియో పాఠాలు, టీవీలలో విద్యా కార్యక్రమాలు చూస్తున్నారు. పుస్తక పఠనం చేయ డం లేదు. పుస్తక పఠనం ద్వారానే భవిష్యత్తులో ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. పుస్తక పఠనం ద్వారా కవులు, కళాకారులు, రచయితలుగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పఠనోత్సవాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు ఉపయోగించుకోవాలి. అక్షర దోషాలు లేకుండా రాయడం, ధారాళంగా చదవడం ఈ 35 రోజుల ప్రణాళికలో చేయించాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్)
డాక్టర్ ఎస్.విజయభాస్కర్ 92908 26988