‘భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతిస్తథా’ అంటే భారత ప్రతిష్ఠకు మూలమైనవి రెండు. ఒకటి సంస్కృతం. రెండోది సంస్కృతి. దేవభాష అయిన సంస్కృత సాహిత్యంలో భారతీయ సంస్కృతి బీజాలు మిళితమై ఉన్నాయి. హిందూ సంస్కృతికి మూలమైన ఆధ్యాత్మిక, తాత్విక చింతనలు, నైతిక జీవనాన్ని, సమాజ శ్రేయస్సును కలిగించే అనేక విషయాలు సంస్కృత గ్రంథాలలో రాసి నిక్షిప్తం చేశారు. అలాంటి సంస్కృత భాషను పరిరక్షిస్తే సంస్కృతినే పరిరక్షించినట్టుగా భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ప్రముఖ సంస్కృత పండితులు, వాఖ్యాన చక్రవర్తి, మహామహోపాధ్యాయ మల్లినాథసూరి పేరిట సంస్కృత విశ్వవిద్యాలయాన్ని మెదక్ జిల్లా కొల్చారంలో ఏర్పాటు చేయడానికి పూనుకోవడం ముదావహం. ఆయన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకేనని మరోసారి నిరూపితమైంది.
ప్రపంచంలో అతి ప్రాచీన భాషలలో ఒక టి సంస్కృతం. ‘జనని సంస్కృతంబు సర్వ భాషలకు’ అని సంస్కృత భాష కీర్తించబడుతున్నది. సంస్కృతానికి అమరవాణి, గీర్వాణిగా కూడా పేరున్నది. కవిత్వం, తర్కం, వ్యాకరణం, తత్వం, గణితం, ఖగోళం వంటి శాస్త్ర సాంకేతిక అంశాలన్నీ సంస్కృత సాహిత్యంలో పొందుపరచబడినవి. నేటి ఆధునిక విజ్ఞానానికి సంస్కృత సాహిత్యం గొప్ప భాండాగారం. అలాంటి సంస్కృత భాష తెలంగాణ నేలలో ఒకప్పుడు ఉజ్వలంగా పరిఢవిల్లింది. ఇక్కడి సంస్కృతిలో అంతర్భాగమైంది.
తెలంగాణ తొలి పాలకులైన శాతవాహనుల నుంచి అసఫ్ జాహీల వరకు రాజులందరూ సంస్కృతాన్ని ఎంతగానో ఆదరించారు. పోషించారు. దీంతో వందలాది మంది కవులు, పండితులు ఈ గడ్డపై నుంచి గొప్ప సంస్కృత రచనలు చేశారు. తెలంగాణలో పుట్టిన సంస్కృత పండితులు, ఘనాపాఠీలు భారతదేశపు
నలుదిశలా విస్తరించారు.
అంతటి ఘనచరిత్ర కలిగిన తెలంగాణ సంస్కృత సాహిత్యానికి పూర్వవైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబడి నిర్వహిస్తున్న రాష్ట్రీ య సంస్కృత విద్యాపీఠం(ప్రస్తుత జాతీయ సంస్కృత యూనివర్సిటీ) ఇక్కడ కూడా ఏర్పా టు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సూచన ల మేరకు అప్పటి పార్లమెంటు సభ్యులు, ప్రస్తు త ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఢిల్లీ వారిని, అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిని కలిసి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ వచ్చిం దే తప్ప సంస్కృత విద్యాపీఠ విభాగాన్ని గానీ, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఏర్పాటు కు ఎలాంటి కార్యాచరణను రూపొందించలేదు. అట్లా ఆరేడు సంవత్సరాలు గడిచిపోవడం చూసి రాష్ట్ర ప్రభుత్వమే చివరకు సొంతంగా సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సిద్ధం కావడం తెలంగాణ ఆత్మగౌరవ కేతనంగా భావించాలి.
మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్కృత భాషాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తూ సంస్కృతానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది. జూనియర్ కాలేజీల్లో సంస్కృత సబ్జెక్టును మార్క్స్ కోసమే ఎంచుకుంటున్నారనే ఉద్దేశం తో 2017లో పూర్తిగా ఎత్తివేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని బోర్డు నిర్ణయాన్ని వెనుకకు తీసుకునేలా చేసింది. కేవలం ఇంటర్ స్థాయిలో ప్రైవేటు కళాశాలల్లో మాత్రమే సంస్కృతం ద్వితీయ భాషగా కొనసాగిస్తూ వస్తున్నారు. దీన్ని గమనించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్కృత భాష ప్రాధాన్యాన్ని, అవసరాలను గుర్తించి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో తప్పనిసరి ద్వితీయ భాషగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
అలాగే సంస్కృత భాషకు జీవం పోయాలనే దృఢ సంకల్పంతో, రాష్ట్రంలో మొత్తం 400 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుంటే వాటిలో 182 కాలేజీల్లో సంస్కృత లెక్చరర్స్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే డిగ్రీ కాలేజీల్లో 23 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసి రాతపరీక్షలకు సిద్ధంగా ఉన్నది. అంతేగాక తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 54 సంస్కృత టీచర్ పోస్టుల నియామకానికి రాత పరీక్షలను కూడా పూర్తి చేసింది.
దేశ వ్యాప్తంగా 19 సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో పదహారు యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో ఉన్నాయి. దీనిలో ఒకటి డీమ్డ్ యూనివర్సిటీ. మూడు సెంట్రల్ యూనివర్సిటీలు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో పని చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీలు ఏవీ కూడా పొద్దున లేస్తే సంస్కృతి సంప్రదాయ పరిరక్షకులుగా చెప్పుకునే వారు స్థాపించినవి కాకపోవడం గమనార్హం. ఇందులో మూడు స్వాతంత్య్రానికి ముందు స్థాపించబడినవి కూడా ఉన్నాయి. గత పదేండ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క సంస్కృత విశ్వవిద్యాలయాన్ని కూడా కేంద్రం స్థాపించకపోవడం చాలా బాధాకరం. ఏటా కేంద్ర బడ్జెట్ సంస్కృతానికి రూ. కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అవి ఎక్కడికి చేరుతున్నాయో ఇప్పటికీ అర్థంకాని ప్రశ్నే. దాదాపు పదేండ్ల నుంచి సంస్కృత భాషకు అన్ని విధాలా సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం తెలంగాణకే గర్వకారణం.
సంస్కృతానికి గొప్ప సేవ చేసిన రాజులలో పారమార భోజరాజు (సా.శ.1000-1055) అగ్రగణ్యులు. వీరు స్వయంగా కవి, పండితులు. వేలాది సంస్కృత తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచేలా చేయడమే కాకుండా, శిథిలావస్థలో ఉన్న వాటిని క్రోడీకరించి తన ఆస్థాన కవులతో తిరిగి రాయించారు. తాను కూడా రాశారు. భోజరాజు లేకుంటే చాలా వరకు సంస్కృత సాహిత్యం ఇవాళ మన ముందు ఉండకపోయేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి భోజరాజుతో సరితూగగల వారు మన ముఖ్యమంత్రి కేసీఆర్.
కేసీఆర్ స్వయంగా కవి. తెలుగు, సంస్కృత భాషలలో మంచి ప్రావీణ్యం కలిగినవారు. వా రికి గల భాషాభిమానమే కవులను, కళాకారులను అక్కున చేర్చుకునేలా చేస్తుంది. భోజరాజు ఏవిధంగానైతే సంస్కృత భాషకు సేవలు చేసి దాని అజరామరం కోసం కృషి చేశారో, అదేవిధంగా తెలంగాణలో సంస్కృత భాష పునరుజ్జీవనానికి, పూర్వవైభవం కోసం ఎనలేని కృషి చేస్తున్న కేసీఆర్ తెలంగాణ భోజరాజు అనడం సముచితంగా ఉంటుంది.
(వ్యాసకర్తలు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సంస్కృత కళాశాల ఉపన్యాసకులు)
– డాక్టర్ ఆవుల మల్లారెడ్డి డాక్టర్ సందెవేని తిరుపతి