‘మన శత్రువులు వేర్వేరు రూపాలను తీసుకొని ఉండవచ్చు, కానీ మనం మారలేదు. మన పోరాటాలు మారలేదు. అదే డీఎంకే’ అని కలైవానర్ అరంగంలో 2024, అక్టోబర్ 5న ఆ పార్టీ ఎంపీ తిరుచ్చి శివ రాసిన ఐదు పుస్తకాలను ఆవిష్కరించిన సందర్భంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సందేశమిచ్చారు. ప్రఖ్యాత వర్ధమాన సినీ నటుడు, ప్రగతిశీల వాది అయిన ప్రకాష్‌రాజ్ కూడా పాల్గొన్న ఆ సమావేశంలోనే చరిత్రను మార్చడానికి, పుకార్లను వ్యాప్తి చేయడానికి, అసత్యాల ఆయువు పెంచడానికి రాజకీయ శత్రువులు నిరంతరం చేసే ప్రయత్నాలను ఓడించడానికి సత్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంచడమే పరిష్కారమని కూడా అన్నారు.
నిజమే, సాంఘిక దురాచారాలు, ఆత్మగౌరవం, తమిళ అస్తిత్వం అంశాలపై ఎటువైపు నుంచి దాడి ఎదురైనా, ఏ శక్తులతో తలపడాల్సిన సందర్భం ఎదురైనా డీఎంకే నిర్మాతలైన అన్నాదురై నుంచి కరుణానిధి వరకు పెరియార్ మార్గాన్ని మదిలో ఉంచుకునే జనాన్ని నడిపించారు. జస్టిస్ పార్టీ, ద్రవిడార్ కళగం అనుభవాల నుంచి తమిళనాడు రాష్ట్ర రాజకీయ అస్తిత్వం కోసం ద్రవిడ మున్నేట్ర కళగం చాలా స్పష్టమైన కార్యాచరణనే సుదీర్ఘకాలం ఆచరణాత్మకంగా నమ్ముకున్నది. దానివల్లనే ఒక ప్రాంతీయ పార్టీ ఏడున్నర దశాబ్దాల పాటు క్రియాశీలకంగా మనుగడ సాగించడమే కాదు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని సంపాదించగలిగింది. అయితే తాజాగా స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ ప్రారంభించిన డీలిమిటేషన్ వ్యతిరేక పోరాటంలో దక్షిణాది రాష్ర్టాల హక్కుల నినాదంతో పాటు ఎన్నికల రాజకీయాల్లో తమిళ ఏజెండాను భావోద్వేగ అంశంగా నిలబెట్టి, రాజకీయ విరోధులను నిలువరించాలనే డీఎంకే సహజమైన ఎత్తుగడ కూడా ఇమిడి ఉన్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
అయితే ఆ పార్టీ ఎత్తుకున్న డీలిమిటేషన్ వ్యతిరేక పోరాటాన్ని, త్రిభాషా విధానానికి నిరసనగా వినిపిస్తున్న వాదనను యూజీసీ ప్రతిపాదనల వెనుక రాష్ర్టాల హక్కుల హననం వైఖరిని తేటతెల్లం చేయడాన్ని సమాఖ్య విధానాన్ని, రాజ్యాంగస్ఫూర్తిని విశ్వసించే వారెవరైనా సమర్థించి తీరవలిసిందే. అయితే, తమిళనాడు ప్రయోజనాలకు, ఆత్మ గౌరవానికి స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం బలమైన విరోధిగా నిలబడిన కాంగ్రెస్ పార్టీని కూడా తాజాగా ప్రతిపాదిస్తున్న పోరాట జట్టులో కలుపుకొని సాగాలనే అంశంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాకుండా ఉండలేవు.
ఆనాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని అన్యాయమైన విధానాల నుంచి ఇండిపెండెంట్ ఇండియాలో సుదీర్ఘకాలం తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న దుఃఖపూరితమైన అనుభవాలకంటే ఎన్నో రెట్ల ఎక్కువ వేదనను తెలంగాణ రాష్ట్రం అనుభవించిందన్నది చరిత్ర చెప్తున్న సత్యం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్లు చెల్లనేరవని న్యాయస్థానాలు తప్పుపట్టడంపైనే పెరియార్ నిప్పుల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇప్పటికైనా మారిందా అంటే వెయ్యి జీవులను మింగిన రాబందు, మళ్లీ అవకాశం కోసం ఆవు మొహం పెట్టుకొని తిరుగుతున్న విధంగానే ఉన్నది. అందుకే మొన్నటికి మొన్న ఇండియా కూటమిలోనే ఉన్న ఢిల్లీ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించేందుకు పావులు కదిపి, బీజేపీ గెలుపునకు సహకరించింది. ఈ కుట్రను స్వయంగా రేవంత్ రెడ్డే బయటపెట్టాడు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేజ్రీవాల్ పార్టీ ఓటమికి వ్యూహాలు పన్నిందే కాంగ్రెస్ పార్టీ అని బీరాలు పలికాడు.
సిరా రాతలు ఆరకమునుపే దేశ రాజ్యాంగా న్ని బ్రాహ్మణ డాక్యుమెంట్‌గా వర్ణించి, ప్రత్యేక ద్రవిడనాడు దేశమే కావాలంటూ వేర్పాటు ఉద్యమాన్ని రగిలించాడు. దాంతో మొదటి ప్రధాని నెహ్రూ రాజీకి వొచ్చేలా, తొలి రాజ్యాంగ సవరణ జరిగేలా చేసి, స్వతంత్ర దేశంతో అడుగులు కలపడంలోనే హక్కుల పట్ల రాజీలేనితనాన్ని తమిళజాతి చూపించగలిగింది. అదే స్ఫూర్తితో 1949లో మొదలైన డీఎంకే, కాంగ్రెస్ పార్టీ అన్యాయమైన రాజకీయాలను ప్రజల్లో ఎండగడుతూ, ఎట్టకేలకు 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారం హస్తగతం చేసుకున్న తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్రలో నిలిచింది.
ఇలా చాలా స్పష్టాతి స్పష్టంగా తొలి నాటనే తమ రాష్ట్ర ఆత్మగౌరవానికి రాజకీయ శత్రువు కాంగ్రెస్ పార్టీనే అనే కీలక అంశాన్ని సైద్ధాంతికంగా ద్రవిడియన్ భావజాలంలో మిళితం చేసి ప్రజలందరి హృదయాల్లో నాటగలిగింది. అయితే, 2014 నాటికే పూర్తిగా తమిళనాట కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా నిర్వీర్యం చేసి, డీఎంకే ఆశ్రిత సంస్థగా లొంగదీసుకోగలిగింది. అయితే డీఎంకే మూల సిద్ధాంతకర్తలైన పెరియార్, అన్నాదురై విశ్వసించిన ప్రజాస్వామ్యం, సామాజిక సమానత్వం, రాష్ర్టాల ఆత్మ గౌరవం తదితర మౌలికమైన రాజ్యాంగ అంశాల పట్ల అధికారంలో ఉన్న రాష్ర్టాలలో ఒక తీరున, విపక్షంలో ఉన్న రాష్ర్టాల్లో మరో తీరున అపరిచితుడు సినిమాలో వలె భిన్న మొహాలతో ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా రాష్ర్టాల హక్కుల సాధన పోరులో కలుపుకొని సాగాలనుకోవడంపై ఏకాభిప్రాయానికి రావడం కష్టం.
కాంగ్రెస్ అనే కలుపు మొక్కను కూటమిలో పెట్టుకొని రాష్ర్టాల హక్కుల ఉద్యమాన్ని ప్రాంతీయ రాజకీయశక్తులు కొనసాగించడం ఏమిటనే ఆందోళన వ్యక్తమౌతున్నది. రాజ్యాంగానికి తూట్లు పొడవడంలో, సమాఖ్య స్ఫూర్తికి కళంకం తేవడంలో, కాంగ్రెసేతర గవర్నమెంట్లను కూలదోయడంలో, అంతెందుకు బడుగు వర్గాలకు అవకాశాలను దూరం చేయడంలో హస్తం పార్టీ అతి పెద్ద పాపాలపుట్టనే కదా? నంబుద్రీపాద్ నుంచి ఎన్టీఆర్ దాకా దక్షిణ భారతదేశంలో కాంగ్రేసేతర ప్రభుత్వాలను కూల్చివేసిందే కాంగ్రెస్ పార్టీ.
డీలిమిటేషన్‌తో పాటు హిందీ భాష, యూజీసీ నిబంధనల వివాదంలో తొలి అడుగు వేసిందే కాంగ్రెస్ పార్టీ కేంద్ర సర్కార్లు. 1937లోనే నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే, మూడేండ్ల పాటు ఉధృతంగా వ్యతిరేక పోరాటం నడిచింది. దానివల్లనే హిందీ, ఇంగ్లీష్‌లను అధికార భాషలుగా గుర్తించారు. మళ్లీ 15 ఏండ్ల తర్వాత హిందీని ఇదే కాంగ్రెస్ పార్టీ సర్కార్ జాతీయ అధికార భాషగా ప్రకటించే ప్రయత్నం చేసింది.
అయితే తమిళనాడు వ్యతిరేకతకు జడిసి 1963 అధికార భాషా చట్టంలో హిందీతో పాటు ఇంగ్లీష్ ను చేర్చారు. అలాగే, 2009, 2011లో రాష్ర్టాల విద్యాహక్కులు హరించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిం ది. పశ్చిమబెంగాల్, తమిళనాడు నిరసించడంవల్లనే వెనక్కి తగ్గారు. ఇలాంటి ధోరణిలో బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. అంతెందుకు రిజర్వేషన్ల కోసమే ప్రత్యేక ద్రవిడనాడు పోరాటం చేసిన తమిళనాడు రాష్ట్ర మేధావులు, నేతలకు.. ప్రత్యేక దేశం గా, అనంతరం ప్రత్యేక రాష్ట్రంగా వర్ధిల్లిన తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా దాడి చేసి, ఐదున్నర దశాబ్దాలు ఎలా అడుగడుగునా వంచించిందో చరిత్ర సాక్షిగా తెలియకుండా ఉండదు. తమిళనాడు కంటే తెలంగాణ, డీఎంకే కంటే బీఆర్ఎస్ ఎన్నో రెట్లు ఎక్కువ నిర్బంధాన్ని, నష్టాన్ని, కష్టాలను కాంగ్రెస్, బీజేపీల వల్ల అనుభవించాయి. ఎంతో వైవిధ్యమైన ఉన్నతమైన చరిత్రనూ, త్యాగాలనూ తెలంగాణ ప్రజలు పండించారు.
కానీ, తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ నుంచి మంత్రివర్గ విస్తరణ వరకు, ప్రతి పైసా ఖర్చుపెట్టడం కోసం 37 సార్లు ఢిల్లీ వెళ్లి, గాంధీల అనుమతి తీసుకునే పరిస్థి తి ఏర్పడింది. ఇది త్యాగాల తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు బలితీసుకోవడం కాదా? ఇలా ఇంకా మారని, మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రాంతీయ రాజకీయ శక్తులను వేటాడుతామని కేజ్రీవాల్ ఉదాహరణతో తేటతెల్లం చేస్తున్న కాంగ్రెస్‌ను కలుపుకొని సాగడం వల్ల ప్రాం తీయ పార్టీలకు, రాష్ర్టాలకు ముప్పే. బీఆర్ఎస్, డీఎంకే తదితర పార్టీల పుట్టుక, సుదీర్ఘ పోరాటం, త్యాగాల వెనుక ప్రాంతీయ ఆకాంక్షలున్నాయి.
కాబట్టి డీఎంకే తాజా పోరాట ఎజెండాలో ఎంత న్యాయమున్నదో, జట్టులో కపట కాంగ్రెస్‌ను కలుపుకొనిపోవడంలో అంతే నష్టమున్నది. పైగా అధికారంలో ఉన్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లాంటి ఢిల్లీ దళారీ పాలకుల నేతృత్వంలో రాష్ర్టాల హక్కుల సాధన పోరు రెండో సమావేశం జరపాలని నిర్ణయించడం ప్రజాస్వామ్యవాదులకు ఎబ్బెట్టుగా అనిపిస్తున్నది. డీఎంకే, బీఆర్ఎస్ తలపెట్టిన పోరాటాన్ని, కాంగ్రెస్ కలుపుమొక్కను తీసేసి కొనసాగించగలిగితే, ఈ జట్టులో అధికారంలో లేకపోయినా సరే మిగతా ప్రాంతీయ పార్టీలు, సంఘాలు, మేధావులను భాగస్వామ్యులుగా మార్చగలిగితే మంచిది.
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్) డాక్టర్ ఆంజనేయ గౌడ్