ఏదైనా ఒక అంతర్జాతీయ వేడుక నిర్వహించాల్సి వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. క్రీడా పోటీలు గానీ, అంతర్జాతీయ సదస్సులు గానీ.. ఏర్పాట్లు ఘనంగా చేసి ప్రతిష్ట ఇనుమడింపజేసేలా కృషిచేస్తాయి. ఈ కోవలోనే మిస్ వరల్డ్ పోటీలు మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఈవెంట్ నిర్వహణకు వచ్చిన అతిథులకు లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
అందాల పోటీలు తెలంగాణలో నిర్వహించడంపై ఆదినుంచీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక్కడ రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన డబ్బు కూడా ఇవ్వకుండా సర్కార్ సతాయిస్తున్నది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం నన్ను కోసుకుతిన్నా పైసల్లేవంటూ.. ఈ మధ్య వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రం దివాలా తీసిందని, అప్పు పుడతలేదంటూ రాష్ట్రం పరువు తీసేలా ప్రవర్తించారు.
ఆయన వ్యవహారశైలితో రాష్ట్ర ప్రతిష్ట మసకబారే పరిస్థితి నెలకొన్నది. కానీ, తద్భిన్నంగా అందాల పోటీలు నిర్వహించేందుకు మాత్రం రేవంత్ జోరుమీదున్నారు. అంతర్జాతీయ ఈవెంట్ విజయవంతంగా నిర్వహించి రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకొస్తామంటూ ప్రకటనలతో సర్కార్ ఊదరగొట్టింది. తాజాగా హైటెక్స్‌లో భారత్ సమ్మిట్ పేరిట పార్టీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కార్.. ప్రజాధనంతో నిర్వహించింది. ప్రభుత్వ డబ్బు రూ.30 కోట్లకు పైగా వెచ్చించడంపై విమర్శలు వచ్చాయి. ఢిల్లీ వెళ్లినప్పుడు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకే ఈ ఈవెంట్ నిర్వహించి రేవంత్ షో చేశారన్న విమర్శలు వచ్చాయి.
అందాల పోటీల నిర్వహణలో ముందుకువెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తేవడానికి బదులుగా, అప్రతిష్ట మూటగట్టుకునే పనులు చేస్తున్నది. ఈ పోటీల నిర్వహణకు సుమారు రూ.54 కోట్లు ఖర్చవుతుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి అంచనా వేశాయి. ఇందులో రూ.27 కోట్లు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, మరో రూ.27 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలని నిర్ణయించాయి. అయితే, ఇందులో ప్రభుత్వం నుంచి రూ.2 కోట్లే వెచ్చిస్తామని, మిగతా రూ.25 కోట్లు స్పాన్సర్ల నుంచి సేకరిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు. అయితే, స్పాన్సర్లు ఎవరూ ముందుకురాలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వేసిన అడుగులు అంతర్జాతీయ స్థాయిలో చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. మిస్ వరల్డ్ కార్యక్రమాల్లో ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా స్పాన్సర్ల కొరతతో కాలయాపన చేసేందుకు అందాల భామలను రాష్ట్రంలో తిప్పుతున్నారు.
ప్రపంచ సుందరీమణులను తెలంగాణలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో పర్యటింపజేయడం ద్వారా అంతర్జాతీయంగా తెలంగాణ పర్యాటకాన్ని పుంజుకునేలా చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలకు ఇప్పటికే చారిత్రక నేపథ్యం ఉన్నది. ఉదాహరణకు రామప్ప దేవాలయం వరల్డ్ హెరిటేజ్ సెంటర్. ప్రత్యేకించి అందాల భామల సందర్శనతో దానికి కొత్తగా వచ్చే ప్రాచుర్యం ఏమున్నది? మరోవైపు పోచంపల్లి చీరలకూ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అంటే ప్రభుత్వం ఒక ప్రచార ఆర్భాటానికి తప్ప, అందాల భామల సందర్శనతో నయాపైసా ఉపయోగం లేదని, పైగా ప్రభుత్వ సొమ్ము వృథా అవుతుందన్నది సుస్పష్టం.
అందాల భామలకు విందు పేరిట సంపన్నులను ఆహ్వానించి, రాష్ట్ర ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని తాజాగా ఏర్పాటుచేసింది. తద్వారా స్పాన్సర్షిప్ తేవాలని ప్రయత్నించింది. అయితే, ఈ కార్యక్రమం ఎంత జుగుప్సాకరంగా సాగిందంటే.. వివిధ దేశాల నుంచి వచ్చిన అందాల భామలను వీఐపీల వద్ద కూర్చోబెట్టారు. స్పాన్సర్ల కోసం వీఐపీలతో సన్నిహితంగా వెళ్లాలని అధికారులు సూచించడం దారుణమైన విషయం.
ఆయా దేశాల్లో అత్యుత్తమంగా రాణించిన విన్నర్లు.. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వస్తే వారితో ఇలాగేనా ప్రవర్తించేది? మిస్ వరల్డ్ పోటీలను ఇంత చిల్లర వ్యవహారంగా మార్చి, క్లబ్ డ్యాన్సర్ల మాదిరిగా ట్రీట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఘోరంగా అవమానించింది.
మిస్ ఇంగ్లండ్ దీనికి అభ్యంతరం చెప్తూ.. సంచలన విషయాలు వెల్లడించింది. తనను అవమానించారని వాపోయింది. ఈ విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయి తే, ఈ ఘటనపై విచారణ పేరిట ప్రభుత్వం ముగ్గురితో కమిటీ వేసింది. కానీ, వీఐపీల వద్ద అందాల భామలను కూర్చోబెట్టడమే ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. అలాంటి ప్రభుత్వమే మళ్లీ కమి టీ వేయడం హాస్యాస్పదం. తప్పును తెలుసుకొని భేషజాలకు పోకుండా, పోటీల నిర్వహణలో ఫెయిలయ్యామని ఒప్పుకొని కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.
20 రోజులుగా ఈ అందాల పోటీల చుట్టూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తిరుగుతున్నారు. ప్రజా సమస్యలను, పాలనను పట్టించుకోకుండా కేవలం ప్రచారానికి, డైవర్షన్ పాలిటిక్స్‌కు రేవంత్ సర్కార్ పరిమితమైంది. రాష్ట్రంలో అన్నదాతలు అరిగోస పడుతున్నరు. అకాల వర్షాల కారణంగా కల్లాల్లో ధాన్యం తడిసిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. వారిని పరామర్శించేందుకు ఏ ఒక్క మంత్రికి గానీ, అధికారికి గానీ తీరిక లేదు. అంతర్జాతీయ కార్యక్రమం పేరు చెప్పి రాష్ట్రంలో సమస్యలను గాలికివదిలేశారు. రాష్ర్టానికి పెట్టుబడులు, ఖ్యాతి తేవడం దేవుడెరుగు.. అపఖ్యాతిపాలు చేస్తుండడంపై ప్రజలు భగ్గుమంటున్నారు.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ 90100 96777