ప్రాచీన భారత చరిత్ర చిక్కుముడి విప్పలేని పొడుపు కథలా చరిత్రకారులను ఊరిస్తున్నది. నిగూఢ రహస్యంగా పరస్పర విరుద్ధ కథనాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ఆర్యులు భారతదేశ మూలవాసులు కారనీ మ్యాక్స్ ముల్లర్ తదితర పాశ్చాత్య చరిత్రకారులు చెప్తుంటారు. మధ్య ఆసియాలోని ఖజకిస్థాన్ ప్రాంతం నుంచి క్రీస్తు పూర్వం 1600 సంవత్సరంలో ఆర్యులు మన దేశానికి వచ్చి సింధూ నాగరికతను ధ్వంసం చేశారని ముల్లర్ వ్యాఖ్యానించారు. మొఘలులు, బ్రిటిష్ వారు కూడా ఆర్యుల మాదిరిగానే వచ్చి భారతీయులకు నాగరికతను నేర్పించారని బ్రిటిష్ సామ్రాజ్యవాద చరిత్రకారులు ప్రచారం చేశారు.
బాలగంగాధర్ తిలక్, శ్రీఅరవిందుడు, అంబేద్కర్ వంటి జాతీయవాదులు సింధూ నాగరికత ఆర్య దురాక్రమణ సిద్ధాంతం తప్పని చెప్పారు. మార్క్సిస్ట్ చరిత్రకారులు ఆర్యుల ఆక్రమణ సిద్ధాంతాన్ని సమర్థించి దాన్ని వర్గ పోరాటాల చరిత్రగా కుదించివేశారు. చరిత్ర అంటే గతంలో ఏం జరిగి ఉంటుందో అని మనం ఊహించుకునేది కాదు. గతంలో వాస్తవంగా ఏం జరిగిందో వైజ్ఞానికంగా నిర్ధారించుకొన్నదే అసలైన చరిత్ర. దానికి అనవసర గొప్పలు, లేని లొసుగులు ఆపాదిస్తూ తమ సైద్ధాంతిక చత్వారాన్ని అంటగట్టడం తప్పు.
ప్రముఖ ఫ్రెంచ్ రచయిత, చరిత్రకారుడు ఫ్రాన్స్వా గోటే రచించిన ‘ఆన్ ఎంటైర్లీ న్యూ హిస్టరీ ఆఫ్ ఇండియా’ గ్రంథంలో నూతన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల ఆధారంగా సింధూ నాగరికతపై స్పష్టత ఇచ్చారు. పారిస్లో జన్మించిన ఫ్రాన్స్వా గోటే ప్రముఖ ఫ్రెంచ్ దినపత్రిక లె ఫిగారో దక్షిణ ఆసియా విలేకరిగా పని చేశారు.
బ్రిటిష్ పురాతత్వ పరిశోధకుడు అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ 1853లో హరప్పా ప్రాంతంలో తవ్వకాలు జరిపి సింధూ నాగరికతను వెలుగులోకి తీసుకొచ్చారు. 1920లో జాన్ మార్షల్ ఈ పరిశోధనలు చేపట్టగా, తర్వాత వాటిని భారతీయ పురాతత్వ పరిశోధకులు బీబీ లాల్ తదితరులు కొనసాగించారు. ఇటీవల సింధూ నది నుంచి గుజరాత్ వరకు ఈ నాగరికతకు చెందిన నూటికి పైగా పురాతన కట్టడాలు, అవశేషాలను కనుగొన్నారు. అమెరికన్ ఆర్కియాలజిస్టు గ్రెగొరీ ఎల్ పాసెల్ సుమారు 2,600 పురాతన హరప్పా ఆవాసాలను, పురాతన నగరాలు, పట్టణాలు, ఆరాధన, వాణిజ్య వస్తువులను వెలికితీశారు. సింధూ నాగరికత పది లక్షల కిలోమీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉండేదని ఒక అంచనా.
ఈ నాగరికత విస్తీర్ణం ప్రాచీన మెసొపొటేమియన్, ఈజిప్టు నాగరికత మొత్తం విస్తీర్ణం కంటే ఎక్కువ. ఫ్రెంచ్ ఆర్కియాలజిస్టు జీన్ ఫ్రాన్స్వా జారిజ్ క్రీస్తు పూర్వం 7,000 కాలానికి చెందిన హరప్పా ఆవాసాలను కనుగొన్నారు. ఈ నాగరికత ప్రదేశ విస్తృతిని దృష్టిలో ఉంచుకొని దీనిని సింధూ సరస్వతి నాగరికతగా పిలవడం సమంజసమని సింధూ నాగరికతపై నిపుణుడైన ప్రముఖ పాకిస్థాన్ ఆర్కియాలజిస్టు ప్రొఫెసర్ అహ్మద్ హసన్ డానీ అభిప్రాయపడ్డారు. ప్రాచీన కాలంలో సరస్వతి, సింధూ నదులు సుమారు 300 కిలోమీటర్ల పొడవున ప్రవహించేవి. సింధూ నాగరికత ప్రస్తుత హర్యానా, రాజస్థాన్ వరకు విస్తరించి ఉన్నది. వేదాలు, ఇతిహాసాలలో సైతం సరస్వతి నది ప్రస్తావన ఉన్నది. నదీ ప్రవాహ గతిని మార్చుకున్న వైనాన్ని వాటిలో వివరించారు. ఆధునిక ఉపగ్రహ చిత్రాలు సైతం సరస్వతి నది పుట్టుక, అంతరించిన విధానాన్ని రుజువు చేశాయని ఫ్రాన్స్వా గోటే అంటారు.
సింధూ సరస్వతి నాగరికతలోని పశుపతి (శివుని) ముద్రికలు, మాతృమూర్తులు, యోని పూజలు, స్వస్తిక, యోగాసనాల ముద్రలు, అగ్నిగుండాల అవశేషాలు పరిశీలిస్తే ఇప్పటికీ మనదేశంలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న హిందూ పూజా విధానాలు గుర్తుకువస్తాయి. ఆనాటి గాజులు ధరించే విధానం, సింధూరం దిద్దుకునే పద్ధతి, చేతులు జోడించి నమస్కరించే విధానం, చదరంగం, వైకుంఠపాళి వంటి ఆటలు ఈ నాటికీ మన దేశంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. హరప్పా, మొహెంజొదారో వాసుల సంస్కృతి, సంప్రదాయాలు ప్రస్తుతం హిందువులు పాటించే సంప్రదాయాల కంటే భిన్నమైనవని చెప్పలేమని మొహెంజొదారో ఆర్కియాలజీ నిపుణుడు మార్షల్ వ్యాఖ్యానించారు.
వేదాలు, ఇతిహాసాలలో ఆర్యుల ఆక్రమణల ప్రస్తావన లేదు. ఆర్యుల ఆక్రమణ సిద్ధాంతం మిథ్య అంటూ అమెరికన్ ఆర్కియాలజీ నిపుణుడు జార్జ్ ఎఫ్ డేల్స్ తీర్మానించారు. మొహెంజొదారో నాగరికత అంత్యదశలో సైతం ఎక్కడా విధ్వంసం, యుద్ధా ల ఆనవాళ్లు లేవు. హరప్పా, మొహెంజొదారోల్లో విస్తృతమైన తవ్వకాలు జరిపినప్పటికీ ఎక్కడా సైనికులు, యుద్ధ సంబంధిత ఆనవాళ్లు కనిపించలేదు.
అందువల్ల ఈ ప్రాంతాల్లో ఆర్యులు దురాక్రమణ చేసి వారి నాగరికతను ధ్వంసం చేశారని చెప్పడానికి రవ్వంత రుజువులు లేవని డేల్స్ స్పష్టం చేశారు. ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ జీన్ మారీ కసల్ ఆర్యుల ఆక్రమణ సిద్ధాంతాన్ని ఖండించారు. ప్రత్యేక ఆర్య జాతి ఉందని చెప్పడానికి తార్కాణాలు లేవని ఆయన చెప్పారు. హరప్పాలో లభించే వస్తువులు, ఆయుధాలకు భిన్నమైనవి ఎక్కడా లభించలేదని స్పష్టం చేశారు.
మొహెంజొదారో తవ్వకాలలో లభించిన అస్థికలపై ప్రముఖ మానవ విజ్ఞాన శాస్త్రవేత్త ఎస్ఆర్ వాలింబ్ జరిపిన జన్యు పరిశోధనల్లో ఆర్య, సింధూ నాగరికుల మధ్య ఎలాంటి జన్యుపరమైన తేడాలు లేవని తేలింది. అలనాటి హరప్పా వాసులు, ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న ప్రజల జన్యు వారసత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నదని స్పష్టమైంది.
ఆనందేశి నాగరాజు
98488 38323