తెలంగాణ ఆవిర్భావం, ఆ తర్వాత రాష్ర్టాభివృద్ధిలో కేసీఆర్ పాత్ర చరిత్రాత్మకమైనది. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు జీవం పోసి, రాష్ర్టాభివృద్ధికి అంకితమై ఆయన పనిచేశారు. గమ్యాన్ని ముద్దాడేవరకు విశ్రమించవద్దని ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పేవారు. అదే పంథాను ఆయన అభివృద్ధిలో చూపించారు. అభివృద్ధికి అడ్డం పడినవారందరితో పోరాడి పదేండ్లలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు.
KCR | 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటికీ అది కాలక్రమేణా కనుమరుగైంది. ఆ తర్వాత తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. చాలామందికి తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రమనే సంగతి కూడా తెల్వకుండాపోయింది. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్లీ పోరుజెండా ఎత్తుకున్నారు. 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఉద్యమానికి కొత్త జవసత్వాలు ఇచ్చారు. ఉద్యమాన్ని కేసీఆర్ శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా నడిపారు. ఏం చేస్తే స్వరాష్ట్రం సాధించవచ్చో క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తెలంగాణ ఆకాంక్షను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. నిరాహార దీక్షలు, సభలు, ర్యాలీలు, పార్లమెంటు లోపల, వెలుపల నిరంతరంగా పోరాటం చేస్తూ ఉద్యమాన్ని సజీవంగా ఉంచారు. అంతేకాదు, ఢిల్లీ పెద్దలకు ఉద్యమ సెగ తాకేలా చేసేందుకు అనేకసార్లు రాజీనామా చేసి, ప్రజాక్షేత్రంలో తన బలాన్ని నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ఒకటి కాదు, రెండు కాదు తెలంగాణ కోసం సామ దాన దండోపాయాలన్నింటినీ వాడారు. ‘నో స్టోన్ లెఫ్ట్ అన్ టర్న్’ అనే సూక్తి ఇందుకు సరిగ్గా సరిపోతుంది.
తెలంగాణ ఏర్పాటుతో ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. ఉద్యమ నాయకుడిగా నిరూపించుకున్న కేసీఆర్.. పాలకుడిగానూ నిరూపించుకున్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోయింది. అయితే, పసికందు తెలంగాణను తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయడమంటే మాటలు కాదు. ఉమ్మడి ఏపీ నుంచి వారసత్వంగా వచ్చిన ఎన్నో కష్టాలు ఒకవైపు వెక్కిరిస్తుండగా.. మరోవైపు తెలంగాణను ఫెయిల్యూర్ రాష్ట్రంగా చేయాలని వ్యతిరేక శక్తులు కుట్రలు మొదలుపెట్టాయి. అందులో మొట్టమొదటిది మనకు రావాల్సిన కరెంటును అడ్డుకోవడం. తెలంగాణను అంధకారంలోకి నెట్టాలని, చీకిటి రాష్ట్రంగా చిత్రీకరించాలని వేసిన కుయుక్తులను కేసీఆర్ పటాపంచలు చేశారు. అతితక్కువ కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల కరెంటు సరఫరా చేశారు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి తెలంగాణలో మిగులు కరెంటు ఉండేలా ప్రణాళికలు రచించారు. స్వరాష్ట్రంగా ఏర్పడకముందు తెలంగాణ ఒక కరువు ప్రాంతం. ఎర్రటి నేలలతో నిండిన తెలంగాణను పచ్చగా చేయాలంటే మన నీళ్లు మన బీళ్లకు మళ్లాలి.
ఉద్యమ నినాదాన్ని నిజం చేసేందుకు వానలు పడాలని ఒకవైపు యజ్ఞాలు చేస్తూనే.. అంతకంటే వేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలను కేసీఆర్ చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల విప్లవం జరిగింది. ప్రపంచం అబ్బురపడేలా పాతాళంలో ఉన్న గంగను మోసుకొచ్చే కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వాటికి అనుబంధంగా నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్లు నిర్మించారు.
తెలంగాణ ఏర్పడకముందు తెలంగాణలో రైతుకు ఎవరూ విలువిచ్చేవారు కాదు. 50 ఎకరాల ఆసాములు కూడా అప్పులోళ్లే. ఊర్ల సేటు పెట్టుబడి పెడితేకాని నారు పోయలేని దుస్థితి. ఎంత పండినా కొనేవాడి కొర్రీలకు బలికావాల్సిందే. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఇలాంటి అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం నడుం బిగించింది.
మిషన్ కాకతీయ ద్వారా వేల చెరువులను పునరుద్ధరించారు. కాళేశ్వరం నీళ్లతో ఆ చెరువులను నింపారు. తద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. బావులు, బోర్ల కింది వ్యవసాయం లాభసాటిగా మారింది. అలా అనతికాలంలోనే తెలంగాణ దేశానికి అమ్మయ్యింది. కేవలం సాగునీరే కాదు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చి జల దారిద్య్రానికి కేసీఆర్ చెక్పెట్టారు. రైతుబంధు ద్వారా ఆర్థిక సాయం చేసి పెట్టుబడుల ఇబ్బందులను తీర్చారు. అకాలమరణం చెందిన రైతుల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా రైతుబీమా ద్వారా ఆదుకున్నారు. రైతులందరికీ 24 గంటల ఉచిత విద్యుత్తు అందించి సాగును బాగు చేశారు. అసలు వ్యవసాయం చేసుడు అవసరమా? అనేకాడి నుంచి రెండెకరాల రైతు కూడా రాజే అనేకాడికి ఎవుసాన్ని కేసీఆర్ వృద్ధి చేశారు. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. ప్రాజెక్టులకు కేంద్రం నిధులివ్వలేదు. అనుమతులను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. వాటన్నింటిని తట్టుకొని రైతాంగాన్ని కంటికి రెప్పలా కాచుకున్నారు. పెట్టుబడి నుంచి పంట కొనుగోలు చేసేదాక రైతులకు ఇసుమంతైనా కష్టం కలగకుండా కేసీఆర్ చూసుకున్నారు. ఉద్యోగాలు చేసేటోళ్లు కూడా కాడిపట్టే విధంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దిన కేసీఆర్ నిజంగా అభినవ మహర్షి.
ఉమ్మడి ఏపీలో సంక్షేమం సంగతి దేవుడెరుగు విద్య, వైద్యం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. అందుకే, కేసీఆర్ అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేశా రు. దళితులు, గిరిజనులు, బీసీలు, ఇతర వర్గాల పిల్లలు చదువుకునేలా ప్రత్యేకంగా గురుకులాలను నెలకొల్పారు. బస్తీ దవాఖానల నుంచి సూపర్ స్పెషాలిటీల వరకు ఏర్పాటుచేసిన కేసీఆర్ వైద్యరంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల సామాజిక భద్రత పెరిగింది. అంతేకాదు, పరిశ్రమల ఉద్యమమే జరిగిందని చెప్పవచ్చు. టీఎస్-ఐపాస్ లాంటి వినూత్న విధానాల వల్ల పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించిన కేసీఆర్ ప్రజానాయకుడిగా పేరొందారు. ఆయన అవలంబించిన విధానాలు రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టా యి. కేసీఆర్ లేకుంటే ఇంత అభివృద్ధి జరిగేది కాదు. అందుకే, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి, తెలంగాణ అభివృద్ధి యజ్ఞాన్ని పునఃప్రారంభిస్తారని ఆశిస్తున్నా.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు)
చాడ సృజన్ రెడ్డి