కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కలుషితాహారం తిని ప్రాణాలు కోల్పోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో గురుకులాల్లో సీటు రావటాన్ని గొప్పగా భావించిన తల్లిదండ్రులు ఇప్పుడు మాత్రం వాటి పేరు ఎత్తితేనే భయపడతున్నారు. రాష్ట్రంలో ఏదో ఒకచోట కలుషితాహారం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురవటం పరిపాటిగా మారింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్య అందించటం వల్ల గురుకులాల విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షా పోటీల్లో విజయం సాధించారు. ఆ స్ఫూర్తిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసింది. బడ్జెట్ కేటాయింపుల్లో మిగతా రాష్ర్టాలు విద్యారంగానికి సగటున 14.8 శాతం నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందులో సగం అంటే 7.6 శాతం మాత్రమే కేటాయించింది. బలమైన జాతిని నిర్మించటానికి నేటి విద్యార్థులే ముఖ్యమన్న విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోయింది. అధికారంలోకి వస్తే ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న రేవంత్ రెడ్డి… ఇప్పటివరకు గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇవ్వటానికే పరిమితమయ్యారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల నియామకాలు పూర్తి చేస్తామన్న ఆయన ఇప్పుడు మాత్రం 30 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ లాంటి వారిని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గల్లీల్లో తిప్పి మరీ ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం నియామకాల మీద నోరు మెదపట్లేదు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న కాంగ్రెస్ మ్యానిఫోస్టోలోని హామీలు కాగితాల మీదే మిగిలిపోయాయి.
తెలంగాణ డిగ్రీ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాల్సిన రూ.5,900 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నాణ్యమైన విద్యను విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. ఈ సంవత్సర కాలంలో చాలా కాలేజీలు మూతపడటం రాష్ట్రంలోని విద్యారంగం దుస్థితికి నిదర్శనం. గత పదేండ్లలో తెలంగాణలో విద్యాసంస్థల సంఖ్య భారీగా పెరగగా.. ఈ ఒక్క ఏడాదిలోనే అనేక ఫార్మా, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. వాటికి రావాల్సిన బకాయిలను విడుదల చేయటంలో రేవంత్ ప్రభుత్వం చేస్తున్న తాత్సారమే దీనికి కారణం.
జాతీయ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్‌లో తెలంగాణ నుంచి ఏ ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం కూడా టాప్- 100లో స్థానం పొందలేకపోయింది. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. ఇక సర్వశిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న సిబ్బంది కూడా సమ్మె బాటపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు మెస్ ఫీజులను విడుదల చేయటానికి కూడా రేవంత్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. సుమారు 13 లక్షల మంది విద్యార్థులు తమకు రావాల్సిన స్కాలర్షిప్ కోసం ఎదురుచూస్తున్నారు. అధికారపేక్షతో అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైన విద్యా శాఖను భ్రష్టుపట్టిస్తున్నది. ఇప్పటి వరకు విద్యా శాఖ మంత్రిని నియమించకుండా ముఖ్యమంత్రి తన దగ్గరే ఆ శాఖను ఉంచుకోవటం సరికాదు. ఇప్పటికైనా సమర్థులకు ఆ శాఖను కేటాయించి విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి.
ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను తిరిగి అమల్లోకి తీసుకువస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పెండింగ్ డీఏలను విడుదల చేయాల్సి ఉన్నా పట్టించుకోవట్లేదు. ఉద్యోగులు 51 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ కోసం ఎదురుచూస్తున్నారు. హెల్త్‌కార్డులు, బీమా సౌకర్యాలు సరిగా అందట్లేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కనికరం చూపించట్లేదు. గత ప్రభుత్వంపై నిరాధర ఆరోపణలు చేసి పదవులు పొందిన నాయకులు ఇప్పుడు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నోరు మెదపట్లేదు. ఇప్పటికైనా తెలంగాణ బుద్ధిజీవులు, విద్యావేత్తలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది.
– (వ్యాసకర్త: తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ మాజీ చైర్మన్)
సర్దార్ రవీందర్‌సింగ్