రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమిస్తుంది. అందుకే తరచూ సీఎంలు, గవర్నర్లకు మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు వారి పరిధిని మించి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్లు, సెర్చ్ కమిటీలను గవర్నర్లే నియమిస్తారని చెప్పడం దారుణం. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వీసీలను సీఎం ప్రతిపాదిస్తే, గవర్నర్ ఆమోదం తెలపడం ఆనవాయితీ.
కానీ, విశ్వవిద్యాలయాల నూతన నిబంధనల ముసాయిదాలో చాన్సలర్లే, వైస్ చాన్సలర్లను నియమించేందుకు అనుమతినిస్తూ కేంద్రం నూతన నిబంధనలు రూపొందించింది. దీనిని బీఆర్ఎస్ సహా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ లేకుండా తామే పెత్తనం చేస్తామనడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆచార్యులుగా కనీసం పదేండ్ల అనుభవం కలిగిన వారిని వీసీలుగా నియమించవచ్చు. అయితే, ఇప్పుడు ఇండస్ట్రీలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీల్లో పదేండ్లకు పైగా అనుభవం కలిగిన వారిని వీసీలుగా నియమించవచ్చని సవరించారు. ఈ సవరణ చాలా తీవ్రమైనది. యూజీసీ చట్టం 1956 స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.
కేంద్రం తనకు లేని అధికారాలను చెలాయించాలని అనుకోవడం అవివేకం. రాష్ర్టం లేదా కేంద్ర విశ్వవిద్యాలయల వీసీల నియామక విధానాలను, అర్హతలను నిర్ధారించేది కేంద్ర లేదా రాష్ర్ట ప్రభుత్వాలేనని సురేష్ పటేకర్ వర్సెస్ ది చాన్స్‌లర్ యూనివర్సిటీ ఆఫ్ మహారాష్ర్ట కేసులో బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. విద్య అనేది ఉమ్మడి జాబితాలోని అంశం. అంటే రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ సమాఖ్య స్పూర్తికి భంగం కలిగిస్తూ కేంద్రం నిర్ణయాలు తీసుకొంటున్నది. 2014కు ముందు సైన్స్ పరిశోధక విద్యార్థులకు బీఎస్ఆర్ (బేసిక్ సైన్స్ రిసెర్చ్) ఫెలోషిప్‌ను యూజీసీ ఇచ్చేది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసింది. అలాగే, ఆర్‌జీఎన్‌ఎఫ్ ఫెలోషిప్లను ఎస్సీ, ఎస్టీలకు రాకుండా చేసిన ఘనత కూడా కేంద్రానిదే.
– పడాల సతీష్, 98498 91673