పుట్టినప్పుడు ప్రతిబిడ్డ అందంగానే ఉంటుంది. ఒక్క మనిషే కాదు, ప్రకృతిలోని ప్రతి జీవి, మొక్క అన్ని లేలేతగా, సుకుమారంగా, అమాయకంగా అందంగానే ఉంటాయి. ఒక్క మనిషి మాత్రమే తమలో ఉన్న తేడాలకు అందం అనే పేరు పెట్టి ఒక భావజాలాన్ని కల్పించుకున్నాడు. మనుషులకే కాక జంతువులకు, పక్షులకు, పుష్పాలకు, ఆకులకు, రంగులకు, భూమికి, ఆకాశానికి కూడా ఈ సౌందర్య భావనను ఆపాదించి కొన్ని అందమైనవని, మరికొన్ని అందవిహీనమైనవని వర్ణిస్తారు.
తొలిదశలో మనిషి అడవుల్లో జీవిస్తూ ఉండేకాలంలో ఆహార సేకరణ, వేట, తొలిదశ ఆహార ఉత్పత్తి కాలంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమాన దేహ దారుఢ్యాన్ని, బలాన్ని కలిగి ఉండేవారు. క్రమంగా స్త్రీ పురుషుల మధ్య పని విభజన జరిగింది. పిల్లలు కనడానికి, పెంచడానికి, గృహ సంబంధ పనులకు మాత్రమే స్త్రీలు పరిమితమయ్యారు. క్రమంగా శరీర ఆకృతిలో కూడా మార్పులు వచ్చాయి. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు, కొన్ని వందల, వేల ఏండ్లు పట్టి ఉండవచ్చు. క్రమంగా దాంపత్య సంస్కృతి వేళ్లూనుకొని ఆస్తిగా, అలంకార వస్తువుగా, వారసులను అందించే వారధిగా, వినోదాన్ని పంచే విలాసినిగా స్త్రీ మారాక, స్త్రీ శరీరం పట్ల, అందం పట్ల ప్రత్యేక ఆసక్తి, శ్రద్ధ ఏర్పడ్డాయి. దాంపత్య వ్యవస్థకు సమాంతరంగా వేశ్యా సంస్కృతి కూడా విస్తరించింది. ఆకర్షణీయంగా, శృంగార దేవతగా, కళాకారిణిగా ఉండటం వేశ్య లక్షణం అయితే, భర్తలను ఆకట్టుకోవడానికి తమ పట్ల వారి ఆకర్షణ తగ్గకుండా ఉండటానికి భార్యల తహతహ. ఎవరికి వాళ్లు అందుబాటులో ఉన్న వాటితో తమను తాము సౌందర్యవతులుగా నిరూపించుకోవడానికి స్త్రీలు ఉబలాటపడటం మొదలైంది. పెట్టుబడిదారీ సంస్కృతి విస్తరించాక, సౌందర్య సాధనాల పరిశ్రమ అత్యంత లాభదాయకమని గ్రహించిన ఉత్పత్తిదారులు స్త్రీలకు సౌందర్యం పట్ల ఉన్న ఆసక్తిని, బలహీనతను ఉపయోగించుకొని కాస్మొటిక్స్‌ను అమ్ముకోవడానికి ప్రకటనలను ప్రయోగించడం ప్రారంభించారు. సినిమా యాక్టర్లను, మోడల్స్‌ను అందుకు వినియోగిస్తున్నారు. అందాల భామలతో ప్రకటనల ద్వారా వేల కోట్ల లాభాలను ఆర్జిస్తున్నారు. అత్యంత చౌక ముడిసరుకుతో తయారయ్యే కాస్మొటిక్స్‌ను వందల రెట్ల ఖరీదుతో అమ్ముకుంటూ కోట్ల కొద్దీ డబ్బును ప్రచారానికి ఖర్చు పెడుతున్నారు. సౌందర్య ఉత్పత్తులైన క్రీములు, పౌడర్లు, మాయిశ్చరైజర్లు, లిప్‌స్టిక్‌లు, లేపనాలు, సెంటులు, అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ దుస్తులు, ఎత్తు పెంచే ఫుడ్ డ్రింకులు, ఆరోగ్యాన్ని పెంచే టానికులు, తల వెంట్రుకల దగ్గర నుంచి కాలిగోటి వరకు ప్రతి అంగాన్ని అందంగా మార్చుతాయని ప్రకటనల ద్వారా ప్రజల మెదళ్లలోకి ఎక్కించి లాభాలను దండుకుంటున్నారు. వీటి ఉపరితల రూపమే నేటి అందాల పోటీలైన మిస్ వరల్డ్ పోటీలు.
అందాల పోటీల సంస్కృతి పెట్టుబడిదారీ దేశాల్లో 20వ శతాబ్దం నుంచి ఉనికిలోకి వచ్చింది. అమెరికా దీనికి మెరుగులు దిద్దింది. 1921లో మొదటిసారిగా అమెరికాలో మొదలై ప్రస్తుతం ఏటా 1.5 లక్షలకు పైగా పోటీలు అనేక స్థాయుల్లో, సందర్భాల్లో జరుగుతున్నాయి. సామ్రాజ్యవాద సంస్కృతి విస్తరణలో భాగంగా ఈ సంప్రదాయం 3వ ప్రపంచ దేశాల్లోనూ విస్తరించింది. మన దేశంలో మిస్ ఇండియా, మిస్ నాని క్వీన్, మిస్ గుంటూరు, మిస్ విశాఖ, మిస్ ఫెమినా, మిస్ కాలేజీ వంటి పేర్లతో నిర్వహించబడుతున్నాయి. ధనిక, ఎగువ మధ్యతరగతి వర్గంలో బాగా ప్రచారంలో ఉన్న ఫెమినా, ఈవ్స్ వీక్లీ వంటి పత్రికలు ఈ పోటీలకు సారథ్యం వహిస్తున్నాయి. ఈ పత్రికల ఎడిటర్లు తాము స్త్రీ విముక్తికి కృషిచేసే అభ్యుదయ వాదులమని, ఫెమినిస్టులమని చాటుకుంటారు. బడా కార్పొరేట్ కంపెనీలు వీటిని స్పాన్సర్ చేస్తాయి. సామ్రాజ్యవాద శక్తులతో చేతులు కలపడం, మూడో ప్రపంచ దేశాల పాలకులు జాతీయత, జాతీయ స్వాతంత్య్రం, ఆర్థిక స్వావలంబనలకు తిలోదకాలిచ్చే క్షీణ సంస్కృతి ప్రపంచమంతా విస్తరిస్తున్నది. జాతీయ విలువల విధ్వంసం, మత్తు పదార్థాలు, మద్యం, మహిళలపై హింస, అశ్లీల సాహిత్యం, అవినీతి, దురాశ, వస్తు వినియోగ వ్యామోహం, విలువల పతనం వంటివి వేగంగా వ్యాప్తిచెందాయి. అందాల పోటీలు అందులో భాగమే. స్థానిక స్థాయి నుంచి దేశీయ, ప్రపంచస్థాయి వరకు అందాల పోటీల పేరుతో స్త్రీల శరీరాలను వ్యాపార సాధనంగా వినియోగించుకునే వినిమయ సంస్కృతి స్త్రీల అలవాట్లలో తీవ్రమైన మార్పులు తెచ్చింది.
కేవలం వస్తువులు తయారుచేయడం వాటిని అమ్ముకోవడమే కాదు, ఆ వస్తువులకు కొనుగోలుదారులను, వినియోగదారులను కూడా అంటే మార్కెట్‌ను కూడా తయారు చేసుకుంటున్నారు. భారత్‌లో 1996లో బెంగళూరులో, 2024లో ముంబైలో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. 1996లో అమితాబచ్చన్ ఏబీసీ కంపెనీ కో హోస్ట్‌గా వ్యవహరించగా, 2024లో కరణ్ జోహార్ అండ్ మేఘనా యంగ్ హోస్టుగా ఉండగా ఈసారి 72వ మిస్ వరల్డ్ పోటీలను ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌తో కలిసి నిర్వహిస్తున్నది. 72వ మిస్ వరల్డ్ పోటీలు మే 7వ తేదీ నుంచి ప్రారంభమై మే 31న గ్రాండ్ ఫినాలేతో ముగుస్తాయి. ఈ పోటీల వల్ల పర్యాటక, చేనేత పరిశ్రమ, సంప్రదాయ ఆహారం, ఆతిథ్యం వంటి రంగాలు అభివృద్ధి చెందుతాయని, మన సంస్కృతి దేశ విదేశాలకు విస్తరిస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. సామ్రాజ్యవాద సంస్కృతిలో టూరిజం అభివృద్ధి అంటే ఇప్పటికే టూరిజం విస్తృతంగా పెరిగిన బ్యాంకాక్, సింగపూర్, థాయిలాండ్ లాంటి పర్యాటక కేంద్రాలు భారీ వ్యభిచార కేంద్రాలుగా మారాయని గుర్తుంచుకోవాలి. అందాల పోటీల మోజులో పడిన యువతులు మోడలింగ్, ప్రకటన రంగంలో మోడల్స్ గాను సినిమా నటులుగాను, టూరిజం పేరుతో ఖరీదైన భారీ వ్యభిచారాన్ని వ్యాపార, రాజకీయ ప్రయోజనాలకు పెట్టుబడిగాను సాధనాలవుతారు. అందాల పోటీల్లో అత్యంత అందమైన యువతిని బ్యూటీ క్వీన్‌గా ఎంపిక చేయడానికి పాటించే ప్రమాణాలు ఏమిటంటే ఎత్తయిన ఎద, సన్నని నడుం, ఎద కన్నా పెద్దదైన తుంటి భాగం, 50 కిలోలకు మించని బరువు, 20 డిగ్రీల భుజం వంపు మొత్తం మీద 34, 24, 35గా ఈ కొలతలను విధిస్తారు.
ఈ కొలతలు కృత్రిమమైనవి, కచ్చితమైనవి, వికృతమైనవి కూడా. ఎన్నికైన అందాల భామ ఒక ఏడాది పాటు నిర్వాహకుల చెప్పుచేతల్లో ఉండాలి. సామాజిక స్పృహ కాని, దోపిడీ వ్యతిరేక వైఖరిగాని, రాజకీయ అభిప్రాయాలు కానీ కలిగి ఉండకూడదు. నిర్వాహకుల మాట జవదాటకూడదు. సౌందర్య దృష్టి మానవ సహజమైనది. సౌందర్య కోణానికి సాంస్కృతిక కోణం తప్పనిసరి. మనుషుల్లో అందం అనేది అనేక సామాజిక సాంస్కృతిక విలువల ఆధారంగా ఉంటుంది. బాహ్య సౌందర్యాన్ని కాకుండా అంతః సౌందర్యమైన మేధస్సును, తెలివితేటలను కూడా సౌందర్యంగానే భావించాలి. సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను నిత్యం వల్లించే మన దేశంలో స్త్రీల నగ్న సౌందర్యాన్ని ప్రదర్శనకు పెట్టడం ఏ విలువల ప్రకారం జరుగుతున్నది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కష్టజీవులకు, అమాయకత్వానికి, పేదరికానికి, పోరాట వారసత్వానికి ప్రతీక. నిరంకుశ నైజాం సర్కార్‌నే తరిమికొట్టి ఆత్మగౌరవాన్ని, జాతి ఔన్నత్యాన్ని కాపాడుకున్న వారసత్వం ఈ నేల బిడ్డలది. ఈ గడ్డపై మహిళల అందాలకు కొలమానాలు పెట్టి సర్కస్‌లో జంతువుల వలె ప్రదర్శించడాన్ని తెలంగాణ మహిళలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. వ్యాపారసంస్థల లాభాల కోసం, కార్పొరేట్ కంపెనీల స్వార్థ ప్రయోజనాల కోసం, ఆడవాళ్లను ఉపయోగించుకునే సంస్కృతికి వ్యతిరేకంగా గొంతు విప్పాల్సిన బాధ్యత ప్రగతిశీల శక్తుల, సంస్థల, వ్యక్తుల, కళాకారుల, సంఘాల, రచయితల, సమస్త ప్రజలపై ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు చైతన్యవంతులు అవుతున్నారు. అందాల పోటీల నీచ సంస్కృతిని ప్రతిఘటిస్తూ వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. దోపిడీ విముక్తిలోనే స్త్రీ విముక్తి ఉందన్నది అక్షర సత్యం. స్త్రీలు మాంసపు ముద్దలు కాదు, వ్యక్తిత్వం ఉన్న మనుషులు. అందాల బొమ్మలు కాదు, ప్రపంచాన్ని పోషిస్తున్న శ్రమ జీవులు. చూడాల్సింది శరీర సౌందర్యం కాదు, శ్రమైక్య సౌందర్యం అని గుర్తెరగాలి. శ్రమ సామర్థ్యాలు, నైపుణ్యాలు, పని ప్రామాణికతలు, గుణాత్మకతలు గుర్తించి ప్రదర్శిస్తే ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఉత్పత్తి శ్రమలో స్త్రీ శక్తిని అనుసంధానించడమవుతుంది. సమష్టి ప్రయోజకత్వంగా శ్రమ సౌందర్యం, పని సంస్కృతి భాసిల్లుతాయి.