తెలుగు సినీ పరిశ్రమ అంటే కేవలం వినోదం కాదు, ప్రజల భాష, సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడంలోనూ తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖంగా నిలిచింది. అయితే, ఇటీవలి కాలంలో తమిళ సినిమాల ప్రభావం, తెలుగు చిత్రాలకు తమిళ టైటిళ్లను పెట్టడం వంటి పరిణామాలు మన సాంస్కృతిక ఆత్మాభిమానాన్ని తగ్గిస్తున్నాయి. ఈ పోకడను సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు, సినిమా పంపిణీ దారులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్న. మన తెలుగు భాషను రక్షించడంలో సినీ పరిశ్రమ ముందుండకపోతే, ముందుండేది ఎవరు?
Telugu | ఇటీవల విడుదలైన తమిళ రీమేక్ సినిమా ‘వేట్టయన్’ను ఏకంగా తమిళ పేరుతోనే తెలుగులో విడుదల చేశారు. ఆ సినిమాను మనవాళ్లు ఏకంగా కోట్ల రూపాయలతో కొని పంపిణీ చేయడం, సినీ పరిశ్రమలోని పెద్దలు ‘వేట్టయన్’ను ప్రమోట్ చేయడం దేనికి సంకేతం? సెన్సార్ బోర్డు అసలేం చేస్తున్నది? తమిళ పేరుతో తెలుగు సినిమాకు ఎలా అనుమతులు ఇచ్చింది? ఒక తెలుగు సినిమా పేరుతో అక్కడ రీమేక్ చేస్తే నానా యాగీ చేసి తమిళ పేరు పెట్టేవరకు తమిళనాడులో సినిమాను విడుదల కానిచ్చేవారు కాదు. అది భాష పట్ల తమిళులకు ఉన్న అభిమానం. మరి మనకేది భాషాభిమానం? తెలుగు భాషపై జరుగుతున్న దాడిని తెలుగు సినిమా పరిశ్రమ ఎందుకు ఖండించడం లేదు?
తెలుగు సినిమాల్లో తమిళ పేర్ల వాడకం, లేదా తమిళ సినిమాల ప్రభావం కేవలం భాషా వైవిధ్యం, సాంస్కృతిక మార్పిడి విషయంలోనే కాదు. ఇది తెలుగుకు ప్రాముఖ్యం ఇవ్వకుండా, మరొక భాషతో నెమ్మదిగా మార్చే ప్రయత్నం ఇది. సినిమా పరిశ్రమ ప్రజా సాంస్కృతికతను, భాష, అభిరుచులను, గుర్తింపును ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుంది. తెలుగు చిత్రాల ద్వారా తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ఇతర భాషలకు అవకాశం ఇవ్వడం వల్ల మన భాష, సాంస్కృతిక గుర్తింపును మనమే తగ్గించుకున్నవాళ్లమవుతాం.
ప్రపంచంలోని ప్రాచీనమైన, అందమైన భాషల్లో తెలుగు ఒకటి. ఈ భాష ఏండ్ల తరబడి సాహిత్య సంపదతో వెలుగొందుతున్నది. మల్లియ రేచన, మల్లికార్జున పండితుడు, పాల్కుర్కి వంటి మహాకవులు మన భాషా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఈ భాష సంప్రదింపులకు మాత్రమే కాదు, కోట్లమంది తెలుగు ప్రజల చరిత్ర, భావోద్వేగాలు, ఆకాంక్షలకు ప్రతీక. సినిమా వంటి మాధ్యమాల ద్వారా భాషకు ప్రాముఖ్యం ఇస్తే, భవిష్యత్ తరాలకు మన భాషా వారసత్వాన్ని అందించవచ్చు. తెలుగు సినిమాలకు తెలుగులోనే పేర్లను వాడితే, మన భాషకు ప్రాముఖ్యాన్ని ఇచ్చినవారమవుతాం.
ఒక నిర్దిష్ట దేశం, ప్రాంతంలోని ప్రజలు మాట్లాడటానికి లేదా రాయడానికి ఉపయోగించే కమ్యూనికేషన్ వ్యవస్థను మనం భాష అంటాం. తెలుగువారమైన మనం తరతరాలుగా భాష, సాంస్కృతికతకు ఉన్న విశిష్టతతో భాషను గౌరవించుకుంటున్నాం. అయితే, తెలుగు సినిమాల్లో తమిళ పేర్లను ఉపయోగించడం, లేదా తమిళ ప్రభావాన్ని పెంచడం వంటి చేష్టలు తెలుగు భాషా గుర్తింపును క్రమంగా తగ్గించే ప్రయత్నమే. రెండు భాషల మధ్య పోటీని పెంచడానికో, లేదా వైరాన్ని పెంచడానికో ఈ వ్యాసం రాయడం లేదు. సినిమా వంటి పాపులర్ మీడియాలో తెలుగు భాష వాడకం తగ్గిపోతే క్రమంగా తెలుగు అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. దర్శకులు, నిర్మాతలు, నటులు కళాకారులు మాత్రమే కాదు, వాళ్లు సంస్కృతికి అంబాసిడర్లు కూడా.
తెలుగులో టైటిళ్లు వాడటం, తెలుగు జీవితానుభవాన్ని ప్రతిబింబించే కథలు చెప్పడం ద్వారా భవిష్యత్ తరాలకు మన భాషా వారసత్వాన్ని అందించవచ్చు. అన్ని భాషలను గౌరవించాలి, కానీ మన మాతృభాషను మనమే వెనక్కి నెట్టి, పరాయి భాషలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. ఈ విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ ముందుండాలి. తెలుగు భాషకు మరింత ప్రాధాన్యం ఇచ్చేవిధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృభాషను గౌరవించకపోతే, ఆ భాషతో పాటు అనేక అనుబంధాలను కూడా కోల్పోతామన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు.
-కాసర్ల నాగేందర్ రెడ్డి
(అధ్యక్షుడు, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా)