సూపర్ టైమ్ అని పెట్టినా, వీకెండ్ కామెంట్ అని పెట్టినా, డిబేట్ అని పెట్టినా, ఏ చర్చ పెట్టినా, ఏ ఛానల్ చూసినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే కథనాలు, విశ్లేషణలే వస్తున్నాయి. అంతేకానీ, మీ పలుకుల్లో కొత్తదనం ఏమీ లేదు. అదే విద్వేషం, అదే దురాక్రమణ కుట్ర. తెలంగాణ అస్తిత్వంపై దాడి, చారిత్రక సాంస్కృతిక వారసత్వంపై విషం చిమ్మడం, ప్రజల ఎజెండాను పక్కదారి పట్టించి వలసాధిపత్య భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం కొత్త కొత్త కథనాలు అల్లడం ఆనవాయితీగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలస ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం మన రాష్ట్రంలో ఉన్న కొన్ని మీడియా సంస్థలు కృత్రిమ కథనాలను తయారుచేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టే వనరుల దోపిడి, జలదోపిడి, రాజకీయ అధికార ఆధిపత్యాన్ని యథేచ్ఛగా కొనసాగించడానికి మీడియాను ఒక సాధనంగా మన పైన ప్రయోగిస్తున్నాయి. తెలంగాణలో స్వీయ రాజకీయ అస్తిత్వం స్థిరపడకూడదనేది వారి కుట్ర. ఉద్యమ కాలంలో ఉద్యమంపై, ఉద్యమ నాయకత్వంపై అసత్య ప్రచారాలతో ఇదే విధమైన ప్రయత్నం చేశారు. మళ్లీ అదే ప్రయత్నం మొదలుపెట్టారు. తెలంగాణ రాజకీయ నాయకులపై నిరాధారమైన తీవ్ర విమర్శలతో మళ్లీ తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేసి తెలంగాణ కంటూ స్వీయ రాజకీయ నాయకత్వం లేకుండా చేయడమే వీరి అంతిమ లక్ష్యం. ఏపీలో ఉన్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఆ ప్రాంత స్వీయ రాజకీయ నాయకత్వం నుంచి ఉద్భవించినవే. అదేవిధంగా తమిళనాడు, మహారాష్ట్రలలో స్వీయ రాజకీయ పార్టీలు తమదైన భూమిక పోషిస్తూ ఆయా ప్రాంతాల, రాష్ర్టాల ప్రయోజనాలు కాపాడుతున్నాయి.
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు స్వీయ రాజకీయ నాయకత్వం అవసరం. కానీ, ఆంధ్ర రాజకీయ నాయకత్వం నిరంతరం తెలంగాణపై అధికారాన్ని, ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం, ఇక్కడున్న రాజకీయ నాయకత్వంపై నిరాధార ఆరోపణలు, నిందలతో వ్యక్తిత్వ హననానికి నిరంతర దుస్సాహసానికి పూనుకున్నాయి. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలపై విపరీతమైన విద్వేష దాడి జరుగుతున్నది.
ఉద్యమకాలంలో మన ప్రయోజనాల కోసం ప్రతిపాదించిన ప్రతి అంశం ఇవ్వాళ నిష్ప్రయోజనం అనే కథనం ప్రతిరోజు మనకు వినిపిస్తున్నారు. మన భావజాలంపై దాడి చేయడానికి కొందరు ఆంధ్ర పక్షపాత మేధావులను తయారుచేసుకొని మన మీద దాడి చేయిస్తున్నారు.
బహుశా వారికి మన ప్రయోజనాలపైనే దాడి చేస్తున్నామనే సోయి ఉందో లేదో అని అనుమానం వస్తుంది. ఈ పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ రాజకీయ నాయకత్వానికి ఉండేది. అప్పటి కాంగ్రెస్, టీడీపీలలో పనిచేసే తెలంగాణ నాయకత్వం సొంత గొంతుక లేక ఆంధ్ర నాయకత్వం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి ఉండేది. ప్రైవేట్‌గా కలిసినప్పుడు ఆ నాయకులు వారి బాధలు ఏకరువు పెట్టుకునేవారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మాట్లాడలేని పరిస్థితికి ఎంతో నొచ్చుకునేవారు. ఇవ్వాళ మళ్లీ పదవుల కోసం, అధికార ప్రాపకం కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎత్తిపోతల తప్ప మరో మార్గం లేదని ఉద్యమ సమయంలో సోదాహరణంగా వివరించిన నాయకులు, మేధావులు ఇవాళ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా స్వప్రయోజనం పొందవచ్చు గానీ, చరిత్రలో మాత్రం తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పే మేధావులంతా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా, ఆంధ్ర లాబీ ప్రయోజనాల కోసమే ప్రచార గొంతుకలుగా మారడం నేటి దుస్థితి. ఎత్తిపోయకుండా తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఎట్లా తీసుకొస్తారనేది చెప్పనే చెప్పరు. ఎందుకంటే ఆంధ్ర లాబీ రాసిచ్చిన స్క్రిప్టులో తెలంగాణ ప్రయోజనాలుండవు. కాబట్టి, ఆ స్క్రిప్ట్ చదివేవారంతా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటం తప్ప మరొక మాట చెప్పలేని పరిస్థితి. పూర్తయిన ఎత్తిపోతల ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోయకుండా కృష్ణా, గోదావరిల్లో కిందికి వదిలేస్తున్నారు. కింద ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రైతులు ఎంత నెత్తినోరు కొట్టుకున్నా నీటిని మాత్రం విడుదల చేయడం లేదు. ప్రభుత్వం ఒకవైపు ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుంటే, అలా పని చేయడం సరైనదంటూ కితాబు ఇవ్వడం కోసం ఈ మీడియా సంస్థలు తమదైన పద్ధతులలో కథనాలను వండి, వార్చి, వడ్డిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి నీళ్లపై ఏపీ పేచీ పెడుతున్నది. తెలంగాణ రాష్ర్టానికి వస్తున్న ఆదాయంపై కూడా కొందరికి అక్కసు ఉన్నది. నిధుల విషయంలో గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి నిధులు సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రాధాన్య అంశాల వారీగా వినియోగించడం వల్ల ఆ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. గత ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే, గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే అప్పులు చేసిందని గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో అప్పులు చేసిన రాష్ర్టాల జాబితాలో తెలంగాణ చాలా రాష్ర్టాల కంటే దిగువన ఉన్నది. కానీ, ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయనన్ని అప్పులు చేసిందని తప్పుడు కథనాలు, విశ్లేషణలు చేస్తున్నారు. అలాగే నియామకాల విషయంలోనూ తప్పుడు లెక్కలు చెప్పి నిరుద్యోగులను తప్పుదోవ పట్టించారు. అందుకే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చిన ప్రభుత్వంపై నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా సీఎం సహా మంత్రు లు నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని అబద్ధాలు చెప్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమనే వాస్తవాన్ని జీర్ణించుకోలేని ఆంధ్ర ప్రయోజనకారులకు తెలంగాణ గట్టి సమాధానం చెప్తుంది. ముంబైలో మీడియా హౌజ్ పెట్టి శివసేన పార్టీని ‘మహారాష్ట్ర మీ జాగీరా’ అని ప్రశ్నించగలరా? చెన్నైలో వీరు నడిపే మీడియా హౌజెస్ నుంచి ‘తమిళనాడు మీ జాగీరా’ అని తమిళ ప్రాంతీయ పార్టీలను ప్రశ్నించే ధైర్యం చేయగలరా? అలా చేసి బతికి బట్టకట్టగలుగుతారా? మరి హైదరాబాద్ గడ్డ మీద మీడియా హౌజెస్ నడుపుతున్న వారికి తెలంగాణ రాజకీయ పార్టీని ప్రశ్నించే ధైర్యం ఎలా వచ్చింది? తెలంగాణ స్వీయ రాజకీయ నాయకత్వం, చైతన్యంపై, ఇంతటి చులకన భావమా? ఇది వలసాధిపత్య అహంకారానికి పరాకాష్ఠ. తమకు వెన్నుదన్నుగా నిలిచే తెలంగాణ వెన్నుపోటు దారులను చూసుకొని ఈ విధంగా పాత్రికేయ విలువలను గాలికి వదిలేసి రెచ్చిపోతున్నారా?
కోర్టులో ఉన్న అంశాలపై తీర్పు చెప్పే కథనాలు తయారుచేయడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి. కమిషన్ విచారణలో ఉన్న అంశాల పట్ల అంతిమ నిర్ణయాలను ఎలా ప్రకటిస్తున్నారు? ఎవరి మెప్పు కోసం, ప్రయోజనం కోసం ఇది జరుగుతున్నది? ఏసీబీ ఆధ్వర్యంలో రహస్యంగా జరిగే విచారణ అంశాల్లో లేని విషయాలు ఏ ఆధారాలతో వార్తలుగా మారుస్తున్నారు? ఏదైనా ప్రత్యేకమైన సమస్యపై వార్త రాయవలసి వస్తే వారి వివరణలను తీసుకోకుండానే ఏకపక్ష కథనాలు రాయడం వెనుక ఉన్న కుట్రలన్నింటిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
తెలంగాణ తన అస్తిత్వాన్ని, ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం నిరంతర చైతన్యంతో ఉంటుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రాంతంలో డిపార్ట్మెంట్ వారీగా క్రమంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నప్పటికీ, అసలు ఉద్యోగ నియామకాలే జరుగలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత ఎన్నికలకు ముందు నుంచి ఇవే మీడియా సంస్థలను వాడుకొని అసత్యాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేశారు. ఈ కథనాలతో అధికార పార్టీని ఓడించగలిగామనే అతి విశ్వాసంతో, స్వీయ తెలంగాణ రాజకీయ పార్టీని, నాయకత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలన్న కుటిల ప్రయత్నాల పర్యవసానమే ఈ మీడియా కథనాలు అనేది తెలంగాణ సామాన్యుల వరకు చేరిపోయింది. ఎన్నికల్లో గెలుపు, ఓటములకు అనేక కారణాలు ఉంటాయి. స్వీయ రాజకీయ నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ కాపాడుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేండ్లలో జరిగిన గణనీయమైన మార్పు, అభివృద్ధి ప్రజల అనుభవాలలో ఉన్నంతకాలం స్వీయ రాజకీయ నాయకత్వంపై ఎటువంటి దుష్ప్రచారం జరిగినా తెలంగాణ సమాజం అల్కగా గుర్తుపడుతుంది, ప్రశ్నిస్తుంది.