ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడం కేవలం వ్యక్తిపై కాదు.. తెలంగాణ ఉద్యమ గౌరవంపై చేసిన దాడి. దీనిని తెలంగాణ సమాజం తీవ్ర ఆవేదనతో సిగ్గుచేటు చర్యగా ఖండిస్తున్నది. తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్య విలువలపై గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్‌పై అక్రమ కేసులు, నోటీసుల పేరుతో జరుగుతున్న చర్యలు కాంగ్రెస్ పాలనలోని అరాచకాన్ని, పాలకుల అసహనాన్ని, రాజకీయ కక్ష సాధింపు చర్యలను స్పష్టంగా బయటపెడుతున్నాయి.
కేసీఆర్‌పై జరుగుతున్న ఈ చర్యలను కేవలం ఒక వ్యక్తిపై దాడిగా చూడటమే కాదు. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రపై, ఆ ఉద్యమంలో భాగస్వాములైన లక్షలాది ప్రజల త్యాగాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా భావించవచ్చు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన రేవంత్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతూ ఉద్యమ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తన పాలనలోని అసమర్థతను, డొల్లతనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప మరొకటి కాదు. పాలనా వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఎదుర్కోలేని పరిస్థితిలో ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు దిగుతున్నదని చాలా స్పష్టంగా అర్థం అవుతున్నది. ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన పాలన, విచారణల పేరుతో రాజకీయ వేటకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. కేసుల పేరుతో ప్రతిపక్షాన్ని వేధించడం పాలకుల బలహీనతకు నిదర్శనం.
తెలంగాణ సాధన ఒక రాజకీయ అవకాశవాదం కాదు. అది ఒక తరం త్యాగాల ఫలితం. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన కేసీఆర్ పేరు చరిత్రలో ఒక వ్యక్తిగా మాత్రమే కాదు, ఒక ఆలోచనగా, ఒక ఉద్యమంగా, సిద్ధాంతంగా నిలిచిపోతుంది. అటువంటి నాయకుడిపై కక్షపూరిత చర్యలకు, వేధింపులకు పాల్పడటం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నదనే భావన, ఆగ్రహం ప్రజల్లో బలంగా నెలకొన్నది.
కేసీఆర్ అనే ప్రజానాయకుడు పదవుల కోసం ఆరాటపడలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన పదవులను కూడా తృణప్రాయంగా విసిరిపారేసిన విషయాన్ని మననం చేసుకోవాలి. టీఆర్ఎస్ స్థాపన నుంచి రాష్ట్ర సాధన వరకు ఆయన చేసిన ప్రయాణం మహత్తర పోరాట ప్రస్థానం. ప్రజల నుంచి పుట్టిన నాయకుడు కావడం వల్లే ఆయన బలం అధికారంలో కాదు, ప్రజల విశ్వాసంలో ఉన్నది. అందుకే కాంగ్రెస్ కక్షసాధింపు రాజకీయాలు ఆయనను బలహీనపరచలేవు. చరిత్రను మరిచిపోవాలని, ఉద్యమాన్ని చిన్నచూపు చూడాలని ఎవరైనా యత్నిస్తే ప్రజాతీర్పు నుంచి తప్పించుకోలేరు. కుట్రలతో పాలన సాగించవచ్చు అని అనుకుంటే భ్రమ. తెలంగాణ ఉద్యమ చరిత్ర, కేసీఆర్ నాయకత్వం ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయిన సత్యాలు. కాంగ్రెస్ పాలకులు చరిత్రను గౌరవించకపోతే ప్రజాగ్రహం తప్పదు.
-కళ్లెం నవీన్‌రెడ్డి
9963691692