వ్యవసాయంలో ఆ విధంగా నాటి తెలంగాణ ముఖ్యమంత్రి దార్శనికత వలన రూపొందిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఆయన నిబద్ధత, ప్రజ్ఞతో ఉపయోగంలోకి వచ్చి, ఆయన కార్యసాధకతను నిరూపించింది. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పంటల ఉత్పత్తి 66 లక్షల టన్నుల ధాన్యమైతే, కాళేశ్వరం నీళ్లు అందాక అది మూడు రెట్లు పెరిగి సుమారు 2.68 లక్షల టన్నులైంది. భారత్లో పండించిన వరిలో సుమారు పన్నెండున్నర శాతం పండించి రాష్ర్టాలన్నింటిలో ప్రథమంగా నిలిచింది తెలంగాణ.
మరి అదే వ్యవసాయంలో ఏపీ వెనుకబడింది ఒకే ఒక్కడి కలల విజన్ వలన! ‘29 గ్రామాల వ్యవసాయం’ ఆగిపోయి, మూడు పంటలు పండించి దేశంలో ఇతర రాష్ర్టాలకే గాక, విదేశాలకూ ఎగుమతి చేయగలిగిన ధాన్యం, కూరగాయలు, పండ్ల పంటల్లో ఏపీ వెనుకబడింది. ఇలా వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గించడం ప్రమాదకరమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ భౌగోళిక లక్షణం చూసినా జిల్లాలన్నీ వరుసగా సముద్రతీరంలో ఉండటంతో వెయ్యి మైళ్లు సముద్రతీరం ఉంటుంది. దీని వల్ల రేవులు నిర్మించి వ్యాపారాలు పెంచుకున్నా కూడా ఒక నష్టం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం సముద్రం కొన్ని సెంటిమీటర్ల భూమిని ఆక్రమిస్తుంది తీరంలో. ఈ భూమి అప్పుడు లవణీకరణ చెందుతుంది. అంటే సముద్రపు నీటిలోని ఉప్పు ఈ భూమిలోకి వచ్చి, అది మొక్కలు పెరగడానికి సహకరించదు.
అలా ప్రతి సంవత్సరం కొంత నేలను తీరంలో నష్టపోయే రాష్ర్టాలు, వారికి వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను ముఖ్యంగా నదీతీరంలోని వ్యవసాయ ప్రాంతాలను పాడు చేసుకోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఇతర అవసరాలకు వాడుకోకూడదు. మరి ప్రపంచంలోనే తాను చాలా విషయాలు కనుక్కున్నానని చెప్పుకొనే ఏపీ ముఖ్యమంత్రికి ఈ చిన్న విషయం తెలియదా? వేల ఎకరాల వ్యవసాయాన్ని ధ్వంసం చేయడానికి ఎలా పూనుకున్నాడు? మూడున్నరేండ్లలో అద్భుతమైన ఎత్తిపోతల కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తే 2014 నుంచి, 2019, ఇప్పుడు రెండేండ్లు అమరావతి ఎత్తిపోతల పథకం (ప్రతి ఆరు నెలలకు వరదనీళ్లు ఎత్తి అవతల పోసుకోవడం) ఇప్పటికీ సాగుతూనే ఉంది. 1953 నుంచి 1956 దాకా, 2014 నుంచి 2025 దాకా ఒక్క విజన్ వల్ల ఏపీ రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండాపోయింది. అటు వ్యవసాయం నాశనమైంది.
ఈ 34 వేల ఎకరాలే కాదు, అమరావతి ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇంకొక 44 వేల ఎకరాల భూమిని రాజధాని అవసరాలకు కావాలని రైతులను ఇప్పుడు అడుగుతున్నాడు. ఈ విజన్లో 14 వేల ఎకరాలు విమానాశ్రయానికి, 30 వేల ఎకరాలు క్వాంటమ్ వ్యాలీకి కేటాయిస్తాడట! పైగా క్వాంటమ్ వ్యాలీని ప్రప్రథమంగా తానే నిర్మిస్తున్నానని చెప్తున్నాడు నారా పెదబాబు. 2024 ఏప్రిల్లోనే కర్ణాటక ప్రభుత్వం దాన్ని ప్రారంభించి లబ్ధి పొందుతున్నది. అయితే, కృత్రిమ మేధస్సు మూలంగా ఐటీ రంగం ఉంటుందా, పోతుందా? అన్నది తెలియడం లేదు. ఇంక ఈ క్వాంటమ్, బాబు గారి మేధస్సు కలిస్తే ఈ 44 వేల ఎకరాల ప్రస్తుత అమరావతి లాగానే రెంటికీ చెడ్డ రేవడి లాగ తయారయ్యే ప్రమాదం ఉంది. ఈ మధ్య మరో 54 వేల ఎకరాలు కూడా అమరావతికి సేకరిస్తామని మూడో భూమి బాంబు పేల్చాడు విజనరీ బాబు! మరి గత పదేళ్లలో ఇంత విజనరీ ఏం చేసినట్టు? ఏ నగరమైనా సరే సరైన స్థలం లేకుండా, సరిపోయినంత ధనం లేకుండా ఒక సామాన్యుడు నిర్మించగలడా? తన విజన్ ప్రకారం లక్ష కోట్ల రాజధానిని కల కనేస్తే సరిపోయిందా? ఇన్ని రాష్ర్టాలున్న దేశంలో ఒక్క రాష్ర్టానికి అంత ధన సహాయం కేంద్ర ప్రభుత్వం చెయ్యగలుగుతుందా? విజన్ అంటే కల కాదు.
దాన్ని నిజం చేసుకోవడానికి సమకూర్చుకోవలసిన ధనం, పూర్తి అవగాహన, కార్యాచరణ ఉన్న ఒక భావనాత్మక, సృజనాత్మక శక్తి, లక్ష్యం చేరుకోగలిగిన ప్రజ్ఞ. ఈ 32 వేల ఎకరాల భూమికి, దాన్ని విశాల హృదయంతో, రాజధాని మీద ఆశతో ఇచ్చిన రైతులకు పూర్తి న్యాయం చేయకుండా ఇంకో 44 వేల ఎకరాల వ్యవసాయ భూమి నాశనం చేయడం రాష్ర్టానికి నష్టం కాదా? అయినా ప్రపంచంలోనే అతి పెద్దదైన శంషాబాద్ విమానాశ్రయం 5,500 ఎకరాలైతే, మరి 14 వేల ఎకరాలు విమానాశ్రయానికి ఎందు కు? పైగా, దగ్గరలోనేగన్నవరం విమానాశ్రయం ఉంది కదా! ముందు రాజదాని ఏర్పడి, రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాక కదా… అన్ని వేల దేశ, విదేశీ రాకపోకలు ఉండేది, దానికి కావలసిన వసతులు సమకూర్చేది! నది పక్కన ఉండి, రెండు ఏర్లు పొంగగానే నీళ్ల కింద మునిగే అమరావతిలో ఇప్పుడు ఏముంది, అంత పెద్ద విమానాశ్రయం, క్వాంటమ్ వ్యాలీ కట్టడానికి? ముఖ్యంగా ఈ పథకాలన్నీ నాశనం చేస్తున్నది రాష్ర్టానికి గుండె లాంటి వ్యవసాయ రంగాన్ని. ఆంధ్ర ప్రజలు ఈ విజన్ గురించి ఆలోచించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
-కనకదుర్గ దంటు
89772 43484