బ్రెజిల్లో జూన్ 3వ తేదీన 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంలో వాతావరణ సంక్షోభంపై జరిగిన సెమినార్లో భారత్ తరపున ఎంపీ బైరెడ్డి శబరి అద్భుతంగా ప్రసంగించారు. 1970లో చిప్కో ఉద్యమాన్ని ప్రపంచం ముందుంచి, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ చేస్తున్న కృషిని బ్రిక్స్ దేశాలకు వివరించారు. కానీ, ఆమె ప్రసంగానికి కొన్ని గంటల ముందు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడింది. బహుశా ఈ ఘటన గురించి తెలిసి ఉంటే, ఆమె అలా ప్రసంగించేవారు కాదు.
పర్యావరణం కాలుష్య భరితంగా మారుతున్న ప్రస్తుత కాలంలో వినాశనానికి దారితీస్తున్న అంశాలపై చర్చించుకోవాల్సిన బాధ్యత ఆరోగ్యవంతమైన జీవన మనుగడను కోరుకునేవారిపై ఉన్నది. చట్టాలను రూపొందించే స్థానాల్లోకి పారిశ్రామికవేత్తలు రావడంతో పర్యావరణ చట్టాలు వారికి చుట్టాలుగా మారిపోయాయి. అభివృద్ధి మాటున జరుగుతున్న పర్యావరణ విధ్వంసం గురించి తెలుసుకోకపోతే సకల జీవరాశుల భవిష్యత్తు తరాలను ప్రమాదంలోకి నెట్టినవారవుతాం.
అభివృద్ధికి నోచుకోని,ఆర్థికంగా, విజ్ఞానపరంగా వెనుకబడిన ప్రాంతాలపై కార్పొరేట్ల కన్ను ఎప్పుడూ ఉంటుంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు, ఏపీలోని కర్నూల్ జిల్లాల పరిధిలో ఉన్న తుంగభద్ర, కృష్ణా నదుల తీరం వెంట ఫ్యాక్టరీలను నెలకొల్పుతూ పాలకులే పర్యావరణ పరిరక్షణ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు.
పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకుల అవతారమెత్తడంతో పర్యావరణం మరింత ప్రమాదంలోకి జారుకుంటున్నది. తమ అభిప్రాయాలనే ప్రజాభిప్రాయాలుగా పోలీసుల పహారాలో వారు తీర్మానాలు చేసుకుంటున్నారు. భవిష్యత్తు తరాలకు మేలైన సమాజం కోసం గొంతెత్తే వారిని అభివృద్ధి నిరోధకులుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా పాలకులు చిత్రీకరిస్తున్నారు.
గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కొన్ని నెలలుగా అక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కానీ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అర్ధరాత్రి స్వరాష్ట్ర కలలను చిధ్రం చేస్తూ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకున్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు నిషేధించిన పీఎఫ్వోఏ రసాయనం ఉత్పత్తిని చేపట్టవద్దుంటూ అభిప్రాయాన్ని చేప్పేందుకు వెళ్లిన ప్రజలపై, ప్రజాసంఘాల నాయకులపై కర్నూల్ జిల్లా తుంగభద్ర నది ఒడ్డున రాజకీయ నాయకుడిగా మారిన పారిశ్రామికవేత్త దాడి చేయించారు. పర్యావరణ పరిరక్షణకు కాపలా ఉండాల్సిన నాయకులే కాలుష్య సమాజం కోసం పాకులాడుతుండటం దురదృష్టకరం.
ఫ్యాక్టరీల ఏర్పాటుతో కొంత మేర ఆస్తి నష్టం జరిగినా.. నీరు, వ్యవసాయ భూమి లభ్యత తగ్గినా పర్వాలేదు. కానీ, తమ మనుగడే ప్రమాదంలో పడితే, భవిష్యత్తు తరాల ఉనికే ప్రశ్నార్థకంగా మారితే ప్రజలు కచ్చితంగా ఆందోళనలు చేస్తారు, చేయాలి కూడా. గద్వాల జిల్లా, కర్నూల్ జిల్లాల్లో ఏర్పాటుచేసే లేదా విస్తరించే ఫ్యాక్టరీల మూలంగా ఆ ప్రాంతాలకే నష్టం జరుగుతుందని అనుకోవడం పొరపాటే. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల వాయు కాలుష్యంతో పాటు నేల, నీటి కాలుష్యం జరుగుతుంది. శ్వాసకోశ, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా పంటల దిగుబడి తగ్గిపోతుంది. నాణ్యత దెబ్బతింటుంది.
పాలమూరు గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వనరు. రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తే పాలమూరు జిల్లా మళ్లీ వలసలమయం అవుతుంది. కర్నూల్ జిల్లా నది ఒడ్డున విస్తరించాలని చూస్తున్న ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే రసాయనాల మూలంగా పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని నిపుణులు ఇప్పటికే ధ్రువీకరించారు.
పీటీఎఫ్ఈ ఉత్పత్తిలో వాడే పీఎఫ్ఏఎస్(పర్- పాలీఫ్లోరోఅల్కైల్) రసాయనాలు పర్యావరణాన్ని కాలుష్యం చేస్తాయి. పీఎఫ్వోఏ వంటి హానికరమైన పదార్థాలను ఇవి విడుదల చేస్తాయి. పీఎఫ్వోఏ వాతావరణంలో సులభంగా కలిసిపోతుంది. అంతేకాదు, వాతావరణం నుంచి అంత త్వరగా తొలగిపోదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ ఈ రసాయనాన్ని క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది. ఫ్యాక్టరీ యాజమాని ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో పర్యావరణ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగే ఆస్కారం ఉంటుంది.
వరదలు వచ్చినప్పుడు రసాయన వ్యర్థాలు నదిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే కర్నూల్ జిల్లాతోపాటు జోగులాంబ జిల్లాలోని అలంపూర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని కొల్లాపూర్ ప్రాంతాలు భవిష్యత్తు లో క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాలుగా మారుతాయి. ఈ ఫ్యాక్టరీ వల్ల తెలంగాణలోని నదీ తీర ప్రాంతాలకే ఎక్కువ నష్టం జరుగుతుంది.
పీఎఫ్వోఏ రసాయనం మూలంగా సంభవించే ఆరోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యాన్ని గుర్తించిన చాలా దేశాలు దీన్ని నిషేధించాయి. 2014లో అమెరికా, 2020లో యురోపియన్ యూనియన్ దీన్ని పూర్తిగా నిషేధించాయి. కానీ, మన దేశంలో, మన రాష్ట్ర సరిహద్దులోని తుంగభద్ర తీరం వెంబడి మాత్రం ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా రసాయనాల ఉత్పత్తికి పూనుకున్నారు. మే 14న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడి ప్రజాసంఘాల నాయకులపై దాడి జరిగింది. దీంతో కర్నూల్ జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన బాటపట్టారు. కానీ, తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు.
అమయాక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్య కారక రసాయనాలపై విచారణ చేపట్టాలి. అంతేకాదు గద్వాల జిల్లాలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఇథనాల్ ఫ్యాక్టరీ మూలంగా కలిగే నష్టాలపై రైతులు, ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
(వ్యాసకర్త: జర్నలిస్టు)
-సీపీ నాయుడు
85199 91515