ఉమ్మడి పాలకులు కృష్ణానదిలో నీటి వాటా తెలంగాణకు దక్కకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, కడుతామని చెప్పి ముందుకు పోయినట్లు మభ్యపెట్టారు. దక్షిణ తెలంగాణ ప్రజలను దక్షిణం వైపు పడుకోబెట్టారు. పాలమూరు గడ్డకు కన్నీళ్లు పంచిన కాంగ్రెస్, టీడీపీ నాయకుల మోచేతి నీళ్లు తాగిన ఆంధ్ర ప్రాంత నేతలు కృష్ణానది నీటి వాటాలో కూడా ఈ నేలకు సరైన వాటా దక్కకుండా చేశారు. ఇక నీటి వాటాల్లో వారి చేతివాటం ఎలా ఉన్నదో చూడండి.
1969లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-I విచారణ అనంతరం, 1976లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కృష్ణా జలాల వాటా కేటాయించింది. ఆ సమయంలో తెలంగాణఆంధ్ర ప్రాంతాల మధ్య ప్రత్యేకంగా వాటాలను నిర్ణయించక చుక్క నీరు కూడా కేటాయించకుండా అన్యాయం చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఎలాగూ విడిపోయే పరిస్థితి ఉన్నదని ముందుగానే గమనించిన ఆంధ్ర పాలకులు..ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల ప్రకారం నీటి వాటాలు ఇవ్వాలని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందే కేంద్రానికి లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు (66%), తెలంగాణకు 299 టీఎంసీలు (34%) చాలు అన్నారు. 58 ఏండ్లు గోస పెట్టిందే కాకుండా వెళ్తూవెళ్తూ మనకు కన్నీళ్లు నింపి, వారి ప్రాంత ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుకొనిపోయారు. ఆ పాపమే 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలను 66:34 అనే నిష్పత్తిలో వాడుకోవాలని నిర్ణయించారు. 2015 జూన్ 18, 19 తేదీల్లో జరిగిన అంతర్రాష్ట్ర జల వివాదాల మీటింగ్‌లో ట్రైబ్యునల్-II మరో ఏడాదిలోగా వస్తుందని, అప్పటివరకు పాత వాటా ప్రకారమే నీళ్లు వాడుకోవాలని నిర్ణయించారు. అపుడు జరిగింది తాత్కాలిక అరేంజ్మెంట్గా కుదిరిన ఒప్పందంగా చిత్రీకరించటానికి అప్పటి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు. అయితే, ఆనాడు జరిగిన మీటింగ్ మినిట్స్‌ను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు బయటపెట్టి, వారి కుట్రలకు ఫుల్స్టాప్ పెట్టారు.
2015 నుంచి 2023 వరకు కేంద్రాన్ని, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ 50:50 నీటి వాటా కోసం 70 పైచిలుకు ఉత్తరాలు రాశారు. అయినా ఈ నేలకు అన్యాయం చేస్తూ ఏడాదిపాటు విధించిన తాత్కాలిక అరేంజ్మెంట్ వాటానే ఈ 34:66 నిష్పత్తి పేరిట గత 11 ఏండ్లుగా కొనసాగిస్తూ అన్యాయం చేస్తున్నారు.
కేంద్రంలోని మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌తో కలిపి ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ మాత్రం కృష్ణా నీటిని ఒడిసిపట్టి పెండింగ్ ప్రాజెక్టులు, రన్నింగ్ ప్రాజెక్టులు పూర్తిచేశారు. ముందుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మెదలుపెట్టి మన హక్కులు ఎప్పటికైనా వచ్చేలా కృష్ణా వాటర్ ట్రైబ్యునల్‌కు 32 లెక్కలు రాసి సెక్షన్ 3 సాధించిన ఘనుడు కేసీఆర్.
ఇపుడు మన రాష్ట్ర నీటి హక్కుల కోసం మాట్లాడే బాధ్యత, నీటి వాటా కచ్చితంగా వచ్చే అవకాశాన్ని కల్పించి అటు కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తూ, పెండింగ్ ప్రాజెక్టులను చకచకా పూర్తిచేసిన నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కృష్ణా నీళ్లతో పాలమూరు నేలను ఎలా తడిపారో..ఎన్ని ఎకరాలకు కొత్తగా నీటిని అందించారో ఆ లెక్కలే సాక్ష్యంగా నిలుస్తాయి. ఆర్.విద్యాసాగర్‌రావు దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం 3,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు 2014 కంటే ముందున్న ప్రభుత్వాలు ఏమాత్రం నీళ్లు అందించలేకపోయాయి. కానీ బీఆర్ఎస్ పాలనలో 38,250 ఎకరాలకు నీళ్లు అందాయి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 1984 నుంచి 2014 వరకు 13 వేల ఎకరాలు నీరు అందించగా, కేసీఆర్ హయాంలో రూ.2,600 కోట్లు ఖర్చు చేసి 3,07,000 ఎకరాలకు నీళ్లు అందించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా 2014కు ముందు 2 వేల ఎకరాలు నీరందించగా, బీఆర్ఎస్ పాలనలో 1,42,000 వేల ఎకరాలకు నీళ్లు అందించారు.
భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 2014కి ముందు 12 వేల ఎకరాలకు నీళ్లివ్వగా, కేసీఆర్ వచ్చాక 1,58,000 వేల ఎకరాలకు నీళ్లు అందాయి. తుమ్మిల లిఫ్ట్ ద్వారా బీఆర్ఎస్ పాలనలో 55 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కోదండరాంసాగర్, ఇతర పెద్ద, చిన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ద్వారా మొత్తం 10 లక్షల ఎకరాల పైచిలుకు సాగునీళ్లు అందించారు. మిషన్ కాకతీయ డ్యాష్‌బోర్డ్ ప్రకారం.. దక్షిణ తెలంగాణలో సుమారు 19 వేల చెరువులను పునరుద్ధరించారు. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ యావత్తు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించిన అపర భగీరథుడు కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో నీళ్లు కూడా అందివ్వలేదని పసలేని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ను రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన తగిన బుద్ధి చెప్తారు.
నిజాలు ప్రచారం చేయకుంటే అబద్ధాలే రాజ్యమేలుతాయి. ‘రాసుకున్నోనిదే రామాయణం..చెప్పుకున్నోనిదే చరిత్ర’ అవుతుంది. ఆంధ్ర నాయకుల కుట్రలు నమ్మకూడదు. వారి కాళ్ల దగ్గర కాపు కాసే నేతలను మన దగ్గరికే రానివ్వొద్దు. కపట కాంగ్రెస్‌ను పొలిమేరల వరకు తరిమికొట్టి, మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి, మన రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుందాం.. బంగారు తెలంగాణ బాటలో, కేసీఆర్ అడుగులో అడుగు వేసి పయనిద్దాం.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకుడు)
రాంమూర్తి పోలపల్లి 9307749999