లచ్చుమమ్మ సిరిమల్లె చెట్టు భుజాలదాకా పాకి
జనాలకు పందిరి నీడ పట్టిన
గుమ్మడి పువ్వు నేలరాలింది
కన్నీటిని కత్తి పదును చేసి,
గాయిదోల్లచేతుల్లో
గండ్రగొడ్డలైన పాట
పోరాటంలో జనం వెంబడి నీడై
కొండల్లో కోనల్లో గీతమై,ఆయుధమై
అల్లుకున్న పాట
పొద్దుకు గొంగడి చుట్టి
నడిచే కాలానికి గజ్జె కట్టి
చిదిమిన గొంతుకు ధైర్యాన్నిచ్చి
రాజ్యం మీద పోరు చేసిన పాట
ఊపిరి ఉమ్మెత్త మొగ్గమీద వాలిన
తుమ్మెద గానం
విప్పిన పెదవుల్లోంచి శబ్దం
విచ్చుకున్న అడవి సీతాకోక
రెక్కల సవ్వడై
దేశమంతా తిరిగిన స్వర స్వర్ణం
రుధిరంలోంచి ఎగిసిన సంద్రపు కేక
తెలంగాణ చెట్టుకు గూడల్లిన పావురం ఈ పాట
మట్టిలోకి రాలిపోయింది పల్లవి
విత్తనమై కొత్త చరణాలతో మళ్లీ మొలకెత్తాలని..
-వేముగంటి మురళి
96765 98465