తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితారాణా నాయకత్వంలో సుమారు 40 మంది సభ్యులతో కూడిన బృందం ఇటీవల ఫిన్లాండ్కు అధ్యయన పర్యటన కోసం వెళ్లింది. ఈ బృందంలో 12 మంది అధికారులు, 28 మంది టీచర్లు పాల్గొన్నారు. ఫిన్లాండ్ విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి, తెలంగాణలో విద్యా సంస్కరణలకు ఉపయోగపడే సూచనలు ఇవ్వడమే తమ ఉద్దేశమని అధికారులు చెప్పుకొన్నారు. అయితే, ఈ పర్యటన నివేదికను పరిశీలించినప్పుడు, కొత్త దారులను చూపిందా? తెలిసిన విషయాలనే మళ్లీ చెప్పిందా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది.
ఫిన్లాండ్కు వెళ్లిన తెలంగాణ విద్యాశాఖ అధికారుల బృందం అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో ఒకేషనల్ విద్యను మరింత సులభంగా, మాడ్యూల్ల రూపంలో, ఉద్యోగాలతో అనుసంధానం చేయాలని పేర్కొన్నది. క్రెడిట్ ట్రాన్స్ఫర్ వ్యవస్థలు, ఉన్నత విద్యను, పరిశ్రమలతో అనుసంధానించేలా బోధన ఉండాలని తెలిపింది. ఒకేషనల్ విద్య పట్ల అపోహలను తొలగించాలని ప్రతిపాదిస్తుంది. ఇక లోతుగా పరిశీలిస్తే ఇవి కొత్తవేమీ కావు, వ్యవస్థను పూర్తిగా మార్చే విషయాలు కూడా కావు. దీంతో ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ విజయానికి కారణాలేంటో తెలుసుకొనేలా అధ్యయనం జరగలేదని అర్థమవుతున్నది.
తెలంగాణ విద్యా విధానం-2026లోనూ ఇలాంటి సూచనలనే ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగ నైపుణ్యాలు, శిక్షణలు, పరిశ్రమల అనుసంధానం వంటి అంశాలను పేర్కొన్నది. సమగ్ర అభివృద్ధి, విద్యార్థి కేంద్రిత అభ్యసనం, ఒకేషనల్ విద్యను బలపరచడం వంటి అంశాలను పొందుపర్చింది. అంటే, ఇప్పటికే రాష్ట్ర విద్యా విధానంలో ఉన్న అంశాలనే ఫిన్లాండ్ అధ్యయన నివేదికలో పేర్కొనడం ఏంటో అంతుపట్టడంలేదు. మరి ఫిన్లాండ్ పర్యటన ద్వారా కొత్తగా ఒరిగిందేమిటి?
ఒకేషనల్ విద్య ఒక లోతైన సామాజిక, సాంస్కృతిక, సంస్థాగత అంశం. దీన్ని ఇంజినీరింగ్ లేదా ఇతర అకడమిక్ కోర్సులతో పోలిస్తే తక్కువదిగా భావిస్తారు. చారిత్రక అసమానతలు, ఉద్యోగ మార్కెట్ నిర్మాణం, విద్యను వస్తువుగా చూడడం వంటి కారణాల వల్ల ఈ భావన ఏర్పడింది. ఈ లోపాలను ఎలా సరిదిద్దాలో, సమస్యలను ఎలా పరిష్కరించాలో అధికారులు ఫిన్లాండ్ నివేదికలో పేర్కొనలేదు. ఫిన్లాండ్లో వృత్తి విద్యకు గౌరవం ఉండటానికి కారణం కేవలం మాడ్యూల్ కోర్సులు, క్రెడిట్ వ్యవస్థలు కాదు. అక్కడ కోర్సులపై విశ్వాసం, మిగతా అకడమిక్ విషయాలతో సమానత్వ భావన, బలమైన ప్రభుత్వ పెట్టుబడి ఆధారంగా ఒక బలమైన వ్యవస్థ ఉన్నది. ఉపాధ్యాయులు అత్యున్నత శిక్షణ పొందినవారు కావడం, వారికి స్వతంత్రత ఉండటం కూడా ప్రధాన కారణాలు. ఫిన్లాండ్లో ప్రైవేటీకరణ చాలా తక్కువ, విద్యా సంస్థలు పోటీ పడకుండా కలిసి పనిచేస్తాయి. విద్యను వ్యాపారంగా కాకుండా, ప్రజా హక్కుగా పరిగణిస్తారు. కానీ ఫిన్లాండ్ అధ్యయన బృందం తమ నివేదికలో ఈ ముఖ్యమైన అంశాలను చర్చించలేదు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ చర్చను మరింత క్లిష్టం చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, జీపీఎఫ్ వంటి బకాయిలు చెల్లించడంలోనూ ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నది. ఇలాంటి సమయంలో సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చుతో విదేశీ పర్యటన చేయడం ప్రశ్నించాల్సిన విషయమే. ఆ పర్యటన ఫలితాలు ఇప్పటికే తెలిసిన విషయాలను మళ్లీ చెప్పడమే అయితే, ఆ ఖర్చును సమర్థించడం కష్టం. దీనివల్ల ప్రభుత్వం నిజమైన సంస్కరణలను కాకుండా, కేవలం ప్రచార చర్యలనే చేపడుతున్నదా? అనే ఒక పెద్ద సందేహం వస్తున్నది. ఇలాంటి విదేశీ పర్యటనలు మీడియా దృష్టిని ఆకర్షిస్తాయి. చురుకైన పాలనను ప్రభుత్వాలు అందిస్తున్నాయనే ఆర్భాటపు ప్రచారాన్ని కలిగిస్తాయి. ఫిన్లాండ్ పర్యటన మరిన్ని ప్రశ్నలను లేవనెత్తింది కానీ, స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదు.