బెంగళూరు, మే 16 : తీవ్రమైన లాబీయింగ్, అంతర్గత ఒత్తిళ్ల మధ్య కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్ మల్లగుల్లాలు పడిన నేపథ్యంలో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో గత కొంతకాలంగా మరుగున పడిన అధికార మార్పు సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. నిరుడు చివర్లో ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంపై కాంగ్రెస్ నాయకత్వం తన దృష్టిని కేంద్రీకరించడంతో తాత్కాలికంగా పక్కనపెట్టిన కర్ణాటక కాంగ్రెస్‌లోని నాయకత్వ పోరు మరోసారి అంతర్గత చర్చల్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
నాయకత్వ మార్పు జరగవచ్చనే ఊహాగానాలు జోరుగా సాగడంతో పార్టీ రాష్ట్ర విభాగంలో రాజకీయ అనిశ్చితి తలెత్తింది. ఆ సమయంలో దీనిపై కచ్చితమైన పరిష్కారం తీసుకోకుండా కాంగ్రెస్ అధిష్ఠానం సంక్షోభాన్ని నిలువరించగలిగింది. ఇప్పుడు కేరళ సమస్య దాదాపు పరిష్కారం కావడంతో పార్టీలో దృష్టి తిరిగి కర్ణాటక వైపు మళ్లింది. రాష్ట్రంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య రాజకీయ పోరు మరోసారి తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో సిద్ధరామయ్య పరిపాలన, శాసనసభా పక్షంపై తన పట్టును మరింత బలపరుచుకుంటే నాయకత్వ మార్పుపై శివకుమార్ ఆశలు బలహీనపడే చాన్స్ ఉంది. మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న లాబీయింగ్ తీవ్రం కావడం పార్టీ అధిష్ఠానంపై మరింత ఒత్తిడిని పెంచుతున్నది.
కర్ణాటక పీసీసీ కార్యాలయం బయట, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శివకుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ వెలసిన పోస్టర్లు కొత్త ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి. కొన్ని పోస్టర్లలో ఆయనను కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. మైసూరులో శివకుమార్ మద్దతుదారులు ఆయనను తదుపరి ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ పుట్టినరోజు కేక్‌ను కూడా కట్ చేశారు.