హైదరాబాద్, మే 16 (నమస్తేతెలంగాణ): కేంద్రం జూన్ 25 నుంచి చేపట్టనున్న సర్‌పై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సీరియస్‌గా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దు.. దొంగ ఓట్లు ఉండవద్దని స్పష్టం చేశారు. ఈ విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లేదంటే అసలుకే మోసం వస్తుందని చెప్పారు. శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సనత్‌నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కేటీఆర్ హాజరై సర్ ప్రక్రియపై దిశా నిర్దేశం చేశారు.
సర్‌లో భాగంగా ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ అనుకూలుర ఓట్లను బీజేపీ, కాంగ్రెస్ తొలగించే ప్రమాదమున్నదన్నారు. హైదరాబాద్‌లో ఈ అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు చేపట్టనున్న సర్ ప్రక్రియ నేపథ్యంలో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని కోరారు. ‘ఒక్కో బూత్‌లో సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల ఓట్లు, మూడు వందల నుంచి మూడు వందల యాభై ఇండ్లు ఉంటాయని చెప్పారు. బీఎల్ఏలు ప్రతిరోజూ పది నుంచి పదిహేను ఇండ్లను సందర్శించి ఓటర్ల వివరాలను సేకరించాలన్నారు.
తలసానిని చూసి నేర్చుకోవాలి
ఈ సమావేశంలో కేటీఆర్ తలసానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎలాంటి కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తిచేయడంలో దిట్ట అని చెప్పారు. గతంలో తొమ్మిదిన్నరేండ్లు ఆయనతో కలిసి పనిచేశానని, కానీ ఏనాడు ప్రజా సమస్యలు తప్ప.. వ్యక్తిగత వ్యవహారాలు తన దృష్టికి తీసుకురాలేదని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు. ఆయనను చూసి మనమందరం ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఛీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే రమేశ్, నాయకులు తలసాని సాయి కిరణ్, మాజీ కార్పొరేటర్లు స్వరూప, వెంకటేశ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, హన్మంతారావు, అరుణ, శేషకుమారి తదితరులు పాల్గొన్నారు.
నమస్తే అమ్మా.. బాగున్నవా!
సమావేశం మధ్యలో మహిళకు కేటీఆర్ ఫోన్.. ఈ సమావేశంలో తలసాని ఫోన్ ద్వారా ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఓ మహిళతో మాట్లాడారు. ‘నమస్తే అమ్మా బాగున్నవా..ఏం పేరు తల్లి..’అంటూ ఆత్మీయంగా పలుకరించారు. సమస్యను అడిగి తెలుసుకొన్నారు. తలసాని సార్ సత్వరమే పరిష్కరించారని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళతో జరిగిన సంభాషణ ఇలా..

కేటీఆర్: నమస్తే ఆమ్మా బాగున్నావా? ఏం పేరు తల్లి..
మహిళ: సార్ నమస్తే నా పేరు శ్రావణి సార్..
మీరు ఎక్కడ ఉంటారమ్మా..
నేను ఎస్ఆర్నగర్లో ఉంటానన్నా..
ఇంట్లో ఎవరెవరూ ఉంటారు..
నేను, నా భర్త, అత్తయ్య, చిన్న బాబు..
చిన్నబాబు వయస్సేంతా?
అన్నా ఇది నిజమేనా..మీరు కేటీఆరేనా? (సంతోషంతో )
అవునమ్మా నేను కేటీఆర్‌నే..పబ్లిక్ మీటింగ్‌లో ఉండి మాట్లాడుతున్నా..
అవునా..అన్నా..నేను మీకు పెద్ద ఫ్యాన్‌ను అన్నా..
మీ మాటలు ఎంతో ఇష్టం..
థాంక్యూ తల్లీ..శీనన్న(తలసాని శ్రీనివాస్)కు ఎందుకు ఫోన్ చేసినవ్?
చాలారోజుల నుంచి వాటర్ సమస్య ఉన్నదన్నా?
ఎన్ని రోజుల నుంచి..
చాలా రోజుల నుంచి..ఎవరికీ ఫోన్ చేసినా సమస్య పరిష్కారం కావడంలేదు..
శీనన్నకు ఫోన్ చేసిన..
శీనన్న ఫోన్ నంబర్ ఎవరిచ్చారు?
గుగూల్లో సెర్చ్ చేస్తే దొరికింది..
వారెవ్వా..శీనన్న ఫోన్ ఎత్తిండా? ఏం జేసిండు..
ఒకటే రింగ్‌కు..నీళ్లు రావడంలేదని చెప్పిన..గంటన్నరలో నా ఇంటి ముందు ట్యాంకర్ ఉన్నది..
పనిచేసే నాయకులు ఉంటే అట్లా ఉంటది..శ్రావణి..