ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు… పాలకులు సేవలు. ప్రభుత్వ పెద్దలు ప్రజలకు జవాబుదారీ. కానీ గద్దెనెక్కగానే రాజులుగా, మంత్రులుగా, నియంతలుగా వ్యవహరిస్తూ అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారికి సమాధానాలు చెప్పకుండా, ఏకపక్ష వైఖరి అనుసరిస్తున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పడం సంగతి పక్కనపెడితే, ప్రజాసమస్యలపై గళమెత్తిన వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. కేసుల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజల గొంతు నొక్కేందుకు ఇప్పుడున్న చట్టాలు చాలవన్నట్టు కొత్తగా మరికొన్ని నిబంధనల కత్తులు నూరుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రజాసమస్యలు, ప్రభుత్వాల వైఫల్యాల గురించి సామాజిక మధ్యమాల వేదికగానే పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు తీవ్రం చేస్తున్నాయి. ఇటీవల ఈ ట్రెండ్ ఎక్కువయింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చాలా పోస్టులు హఠాత్తుగా మాయమవుతున్నాయి. ఖాతాలు గల్లంతవుతున్నాయి. ఇదంతటికీ కారణం ఢిల్లీ పెద్దలు దొడ్డిదారిన అమలు చేస్తున్న ఆంక్షల ఫలితమే.
I may not agree with what you say, but I will defend to the death your right to say it అని వాల్టేర్ అనే గొప్ప రచయిత చెప్పారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి, భావప్రకటన స్వేచ్ఛకు, ఆ స్వేచ్ఛకు ఇచ్చే గౌరవానికి స్ఫూర్తిదాయక వాక్యమిది. కానీ నేటి పాలకులు ప్రశ్నలను వినే ఓపిక లేక, సమాధానం చెప్పేంత సహనం లేక నేను చేసిందే శాసనం.. వేసిందే ఆసనం.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విశాల భావాలు, మానవతా విలువలు లేని విధానాలు ఎవరి కోసం? ప్రజల కేంద్రంగా సాగని పాలన ఎందుకోసం?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల డిజిటల్ రూల్స్‌ను కఠినతరం చేసింది. కొత్త నిబంధనలు అభ్యంతరకరంగా ఉన్నాయి. భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల తరఫున గొంతెత్తే పాత్రికేయులు, వార్తా సంస్థలు, రచయితలు, కార్టూనిస్టులు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే నెటిజన్లను లక్ష్యంగా చేసుకొని కేంద్రం కఠిన నిబంధనలు రూపొందించిందని హక్కుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీశాఖ పెద్దఎత్తున సోషల్‌మీడియా అకౌంట్లను తొలగిస్తున్నది. కనీసం ఎలాంటి వివరణ అడగకుండా ‘లీగల్ డిమాండ్స్’ పేరుతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ ఎవరైనా పోస్టులు పెడితే వాటిని బ్లాక్ చేస్తున్నది. ఈ పోస్టులలో చాలా వరకు కామన్ పాయింట్ ఏంటంటే మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కేంద్ర పెద్దలు విమర్శను సహించడంలేదని. ప్రత్యేకంగా కొందరు జర్నలిస్ట్‌లు, సామాజిక ఉద్యమకారులు, వార్తా సంస్థలను లక్ష్యంగా చేసుకొని కేంద్రం ఆంక్షల అస్త్రం ప్రయోగిస్తున్నది. హాస్య, వ్యంగ్యపూరిత పోస్టులను, కార్టూన్లను తొలగించడం పరిపాటిగా మారింది.
ఇటీవల చాలా పాపులర్ అయిన కమెడియన్ పుల్కిత్ మణి. విదేశాల అధ్యక్షులు, ప్రధానులు, ప్రతినిధులతో మోదీ పలకరింపు, ముచ్చట ఎలా ఉంటుందో చూపుతూ ఓ వీడియో చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్రం ఉలిక్కిపడింది. పుల్కిత్ మణి అకౌంట్‌ను తొలగించింది. అప్పటికే ఆ రీల్‌ను చాలా మంది డౌన్లోడ్, సేవ్ చేసుకున్నారు. తమ ఖాతాల్లో షేర్ చేసుకున్నారు. అంతేకాదు, కేంద్రం తీసుకున్న చర్యతో పుల్కిత్ మరింత పాపులర్ అయ్యాడు. ఆయన పేరుతో మీమ్స్ చేస్తూ మోదీపై మరిన్ని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తూనే ఉన్నారు నెటిజన్లు.
ఇటీవల ఇరాన్ యుద్ధం సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శలు వచ్చాయి. విదేశాంగ విధానంలో మోదీ వైఫల్యం వల్ల మన దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని విపక్షాల నేతలు, ప్రజలు, నెటిజన్లు మండిపడ్డారు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తమైన వ్యంగ్యాస్ర్తాలు, మీమ్స్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్స్ శాఖ తొలగించింది. కేంద్రంలోని పెద్దలు విమర్శలను తట్టుకొనే పరిస్థితిలో లేరనేది దీన్నిబట్టి స్పష్టమవుతున్నది.
కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని సరైన దిశలో చర్యలు చేపట్టాలి. కానీ ప్రజలు నిలదీసినప్పుడు సమాధానాలు చెప్పాల్సిన పాలకులు, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు చట్టాల్లో సరికొత్త డిజిటల్ నిబంధనలను ప్రవేశపెట్టారు. ఇవి వాక్ స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛపై ఉచ్చు బిగించే అవకాశం ఉన్నది. ఇటీవల కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం-2021 సవరణ నిబంధనలను విడుదల చేసింది. సమాచారానికి సంబంధించిన వ్యవహారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోకి వస్తుంది. కానీ కొత్తగా రక్షణ, హోం, విదేశీ వ్యవహారాలు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖలనూ కేంద్రం రంగంలోకి దింపింది. కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా కంటెంట్ కేంద్రానికి అభ్యంతరకరంగా అనిపిస్తే వెంటనే తొలగించే వెసులుబాటు ఉంటుంది. అభ్యంతరకర కంటెం ట్ పేరుతో నచ్చని పోస్టులను కేంద్రం తొలగిస్తున్నది. అకౌంట్లను క్లోజ్ చేస్తున్నది. అంటే, అది ప్రజల భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ప్రజాస్వామిక హక్కుల సంఘాలు, న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రం తక్షణమే వీటిని వెనక్కి తీసుకోవాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరుతున్నారు.
ఏదైనా పోస్ట్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం కోరితే సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రెండు, మూడు గంటల్లో కచ్చితంగా తొలగించి తీరాల్సిందే. ఇందుకోసం ఎవరికీ ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరంలేదు. ఇంతకుముందు ఈ గడువు 36 గంటలుగా ఉండేది. అయితే, ఆ పోస్ట్ చట్టం పరిధిలోనే ఉన్నాదా, లేదా అని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అనుచితమైన పోస్టులను తొలగించాల్సిందే. కానీ ఏది చట్టం పరిధిలో ఉన్నదో, ఏది చట్టవిరుద్ధంగా ఉన్నదో చూసుకొనే సమయం సోషల్ మీడియా సంస్థలకు ఇవ్వాలి కదా! ‘అలా కాకుండా మేం చెప్పామంటే, ఆ పోస్టు తీసేయాల్సిందే’ అని అంటే ఎలా? ఇది ఏ మేరకు సరైందో కేంద్ర ప్రభుత్వ పెద్దలే ఆలోచించాలి. ఇప్పుడు చాలా శాఖలు భాగస్వాములు అయ్యాయి కాబట్టి, కచ్చితంగా ఏ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందో తెలియదు. ఇదే తరహా నిబంధనలతో చట్టం చేయాలని 2024లో కేంద్రం ముసాయిదా బిల్లు తీసుకొచ్చింది. కానీ తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మరింత లోతుగా అధ్యయనం చేయనున్నట్టు తెలిపింది. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల పరిధిలోనే అదనపు నిబంధనల పేరుతో ఆంక్షలు అమలు చేస్తున్నది. డిజిటల్ స్వేచ్ఛ అనేది సౌకర్యం కాదు, అది పౌరుల ప్రాథమిక హక్కు. ఎవరైనా చట్టవ్యతిరేకమైన పోస్టులు పెడితే చర్యలు తీసుకొనే కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. కానీ ‘నాకు నచ్చనిది, నేను మెచ్చనిది అంతా చట్ట వ్యతిరేకమే’ అనే ధోరణిలో పాలకులు అసహనంతో వ్యవహరిస్తే అది ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం.