అనేక త్యాగాలు, ఉద్యమాలతో సాకారం చేసుకున్న ప్రత్యేక తెలంగాణలో తొమ్మిదిన్నరేండ్లపాటు పరిఢవిల్లిన విద్యాభివృద్ధి ఫలాలను విధ్వంసం చేసే పథకం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అప్రతిహతంగా అమలవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం గత పునాదులను కూల్చేసి శిథిలాలపై ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్పేరుతో రంగురంగుల భవనాలను నిర్మించి, అందులో అసలైన పేద, మధ్య తరగతి విద్యార్థులు లేకుండా చేసే కుట్రసాగుతున్నది.
నిన్నమొన్నటి వరకు పేదల ముంగిళ్లల్లో లభించిన విద్యను కార్పొరేట్ స్థాయి పేరుతో ప్రస్తుత పాలకులు అందని ద్రాక్షగా మారుస్తున్నారు. అందుకు అవసరమైన చర్యలు ఆగమేఘాల మీద అమలు చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటూ పేదలకు అందుతున్న విద్యాఫలాలను దూరం చేసేందుకు కుట్రలు, కుతంత్రాలను కొనసాగిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్లు పాలించిన బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో పరుగులెత్తిన గురుకుల వ్యవస్థలను కుప్పకూల్చేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నది. ఈ కారణంగానే ఈ రోజు గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు ఆందోళనకర పరిస్థితుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలు నిర్వహణ లోపంతో తల్లడిల్లుతున్నాయి. పిల్లలు అక్కడ చదువుకోవాలంటేనే భయపడే పరిస్థితిని కాంగ్రెస్ పాలకులు కల్పిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల మరణాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని పరిష్కరించకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వ ప్రతినిధులు కాకమ్మకబుర్లు చెప్తున్నారు. 2024 నుంచి 2026 వరకు128 మంది విద్యార్థులు మృత్యువాత పడగా ఇందులో 25 నుంచి 30 మంది ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం.
ఆర్టీఈ చట్టం2009 ప్రకారం 6-14 ఏండ్లలోపు ఉన్న బాలబాలికలకు 1 నుంచి 8వ తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించాల్సి ఉన్నది. దీని కోసం విద్యార్థులకు పాఠశాల ఫీజులు, యూనిఫామ్లు, పుస్తకాలు, నోటు బుక్కులు తదితర భారం పిల్లల తల్లిదండ్రులకు శాపంగా మారకూడదు.
ఇదే విషయాన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. పిల్లల విద్యను ప్రోత్సహించేందుకు ప్రవేశ, స్క్రీనింగ్ పరీక్షలు, ఫీజుల భారం లేకుండా వారి వయసుకు తగిన తరగతిలో చేర్చి విద్యాపరంగా ప్రోత్సహించాల్సి ఉన్నది. సరైన విద్యను అందించేందుకు తగినంతమంది ఉపాధ్యాయులు ఉండేలా ప్రతి 30 మంది విద్యార్థులకూ ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, 200 పనిదినాలు కొనసాగాలంటూ చట్టం స్పష్టం చేసింది. విద్యాభివృద్ధి, పేదలకు, ముఖ్యంగా బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేసీఆర్ హయాంలో అనేక చర్యలు చేపట్టారు. 2014 24 మధ్యకాలంలో కేసీఆర్ పాలనలో విద్యాభివృద్ధి వేగంగా సాగింది. ఎస్సీల విద్యాభివృద్ధి 72 నుంచి 74 శాతం, ఎస్టీల విద్యాభివృద్ధి 73.4 శాతానికి చేరింది.
ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయత్నం నిరాఘాటంగా సాగుతున్నది. గురుకులాల్లో వసతుల కొరతతో విద్యార్థుల్లో భయాన్ని రేకెత్తిస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కొరత పేరుతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ వర్గాల ఉన్నతి కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలికలను రెసిడెన్షియల్ పాఠశాలలను ఒకే గూటికి కిందికి తెస్తున్నామనే పేరుతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయావర్గాల ప్రత్యేక పరిస్థితులను గుర్తించకుండా, వారి సమస్యలను పరిష్కరించకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ హయాంలో విస్తృతంగా గురుకులాలు ఏర్పాటు చేసి ప్రాథమిక విద్యకు ప్రోత్సాహంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బాలికల విద్య పురోగమన దశకు చేరింది. మొత్తం గురుకులాల సంఖ్య 1,023కు చేరింది. ఈ స్కూళ్లల్లో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఇందులో ఎస్సీలు లక్షా 50 వేల మంది, ఎస్టీలు 79,810 మంది చదువుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో 291 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారంటే ఏ స్థాయిలో పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారో తెలుస్తున్నది. ప్రత్యేక గురుకుల వ్యవస్థ కోసం సొసైటీ ఏర్పాటు చేసి మొత్తం 310 రెసిడెన్షియల్స్ స్కూల్స్, ఇందులో 15 స్పెషలైజ్డ్ బీసీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేయడం గమనార్హం. అదేవిధంగా 204 మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ విధానాల వల్ల ఎస్సీ, ఎస్టీల అక్షరాస్యత 67 శాతానికి పెరిగింది. 2014 ముందు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి జాతీయ సగటు 73 శాతం ఉండగా. ఇందులో ఎస్సీలు 66.1 శాతం, ఎస్టీలు 59 శాతం ఉన్నారు. విద్యాభివృద్ధికి గత సర్కార్ అనేక చర్యలు తీసుకోవడంతో పాటు నిత్యపర్యవేక్షణ, పరిశీలన చేయడం వల్ల ప్రాథమిక, రెసిడెన్షియల్, గురుకులాల్లో విద్యాభివృద్ధి సాగింది. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటూ తెలంగాణ ప్రతిష్ఠను పెంపొందించారు. ఈ వాతావరణాన్ని నాశనం చేసేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసక చర్యలను విద్యాకాముకులు అడ్డుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది.