తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిదేండ్లవుతున్నది. ఈ కాలంలో ఎన్నో మార్పులు, ఎన్నెన్నో అద్భుతాలు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎలాంటి దారుణ పరిస్థితులుండేవో మనకు తెలుసు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయో కండ్లముందే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలనతో అభివృద్ధిలో తెలంగాణ నేడు దేశానికి దిక్సూచిగా మారింది. అందుకే దేశంలో నేడు ‘తెలంగాణ మాడల్’ అభివృద్ధి కావాలన్న డిమాండ్ వినవస్తున్నది. సమైక్య రాష్ట్రంలో చీకటిలో మగ్గిన తెలంగాణ నేడు 24 గంటలు నిత్య కాంతులతో అలరారుతున్నది. నాడు సాగునీరు లేక వట్టిపోయిన భూములు నేడు కాళేశ్వరం నీళ్లతో కళకళలాడుతున్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. దీనికంతటికి తెలంగాణ నాయకత్వ సమర్థ పాలనే కారణమని చెప్పవచ్చు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఎన్నో సందేహా లు, ఎన్నెన్నో అనుమానాలు. ఉద్యమ సా రథి కేసీఆర్ తెలంగాణను ఏం చేయబోతున్నారు? తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని కొందరికి సందేహాలుండేవి. కానీ ఆ అనుమానాలన్నింటిని పటాపంచలు చేస్తూ అభివృద్ధిని పట్టాలెక్కించారు. తెలంగాణలో ఒక్కో పథకానిది ఒక్కో చరిత్ర.
ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం మీద ఆధారపడకుండా స్వతహాగా రాష్ర్టాభివృద్ధికి నడుం బిగించారు. కేంద్రం ఏ మాత్రం నిధులు కేటాయించకున్నా అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. తెలంగాణ సీఎంగా మొదటి దఫాలో కేంద్రానితో కేసీఆర్ ఎంతో సఖ్యతతో ఉన్నారు. కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలకు మద్దతు ఇస్తూ వచ్చారు. దాన్ని మోదీ మరోరకంగా తీసుకొని తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అయినా కేసీఆర్ అనతికాలంలోనే తెలంగాణను దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మార్చారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో ఉన్న కొన్ని రాజకీయపక్షాల వైఖరి దీనికి భిన్నంగా ఉన్నది. దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధిని పొగుడుతుంటే ఇక్కడి ప్రతిపక్షాలకు ఏ మాత్రం రుచించడం లేదు. ఎంతసేపు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ అభివృద్ధిని, ఆత్మగౌరవాన్ని అభాసుపాలు చేసేలా వ్యవహరించడం సిగ్గుచేటు. ముఖ్యంగా ఇక్కడి ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ల తీరు దారుణంగా ఉన్నది. ఢిల్లీ పాలకుల డైరెక్షన్లో తెలంగాణలో కుట్ర రాజకీయాలకు ఒడిగడుతున్నారు. అడుగడుగునా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఇక్కడి ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణకు సహకరించని కేంద్రాన్ని పల్లెత్తు మాట అనని ప్రతిపక్షాలు తెలంగాణ సర్కార్‌ను మాత్రం నిత్యం ఆడిపోసుకుంటున్నాయి. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి.
ఎవరికైనా తన పుట్టిన ఊరు, ప్రాంతంపై అభిమానం ఉంటుంది. దాన్ని ఎవరైనా కించపరిస్తే పౌరుషంతో నిలదీస్తాం. కానీ మన తెలంగాణలో ఇప్పుడో ఒక విపరీత పరిస్థితి నెలకొన్నది. పుట్టిన గడ్డ కన్నా గుజరాత్ గులాంలకు గులాంగిరి చేసే దౌర్భాగ్య స్థితిలో ఇక్కడి బీజేపీ నేతలున్నారు. తెలంగాణ ప్రతిష్టను మంటగలిపేందుకు వారి పంచన చేరి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే దుర్మార్గపు చర్యలకు దిగుతున్నారు. ఇలాంటి నేతల పట్ల యావత్ తెలంగాణ అప్రమత్తంగా ఉండాలి.
తెలంగాణ ఒకవైపు అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరో ఏదో చెప్పారని ఆగమాగం కావొద్దు. ఎందుకు చెప్తున్నారో ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేయకుంటే ఆగమైపోతాం. మన బిడ్డల భవిష్యత్తును ఆగం చేసినవారమవుతాం. స్వార్థ రాజకీయ నాయకుల మాటలను విని మన జీవితాలను ఆగం చేసుకోవద్దు.
ఐ.రాధాకృష్ణ
95539 55316