సభాపర్వం.. రణరంగం!
తెలంగాణ శాసనసభ సమావేశాలు వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. సమావేశాలు మొదలైన తొలిరోజే ఉద్రిక్తతలు నెలకొన్నాయి.ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీ ప్రాంగణం అవాంఛనీయ ఘటనలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ పోలీసు ఒక ఎమ్మెల్యే ప్యాంట్ లాగటం కలకలం కలిగించింది. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ సభ్యుడు నోరుజారారు. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పినప్పటికీ, వివాదం అక్కడితో సమసిపోలేదు.
సదరు సభ్యుడు పేరుపెట్టి అనకపోయినా, అధికార పార్టీ నేతలు ఆ మాటను స్పీకర్‌కే ఆపాదించారు. ఎవరికి తోచినట్టు వారు అతిగా వర్ణిస్తూ పరిస్థితిని దారుణంగా మార్చేశారు. ఆఖరికి స్పీకర్ కంటతడి పెట్టే వరకు అధికార పార్టీ నేతలు ఈ అంశాన్ని సాగలాగారు. ఈ పూర్తి ఎపిసోడ్‌ను నిశితంగా గమనించిన పలువురు దళిత మేధావులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ శ్రద్ధను దళితుల అభ్యున్నతి కోసం ఉపయోగిస్తే బాగుంటుందని సూచించారు. కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం దళిత చట్టాలను, అంశాలను పరోక్షంగా నిర్వీర్యం చేసేలా ఇలా ఎడాపెడా వాడటం బాధాకరం అంటున్నరు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కులం కార్డులను అస్ర్తాలుగా వాడుకోవడం నిజంగా సిగ్గుచేటు.

ఇదీ.. దొంగల, దోపిడీ రాజ్యమట!
తెలంగాణలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన సంబురాలు చూస్తుంటే పలు ఇచ్ఛంత్రాలు కనిపిస్తున్నాయి. అసలు ఎవరు ప్రభుత్వంలో ఉన్నరు? ఎవరు ప్రతిపక్షంలో ఉన్నరు? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు! తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ నడుపుతున్నది. జనం వస్తున్నరు.. తమ గోడు చెప్తున్నరు. ప్రజల విజ్ఞప్తులను స్వీకరిస్తున్న బీఆర్ఎస్ నేతలు సమస్యలపై గళమెత్తుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నరు. ఇంకో వైపు అధికార కాంగ్రెస్ వాళ్లు మాత్రం చేతిలో దిష్టిబొమ్మలు పట్టుకొని రోడ్లెక్కుతున్నరు.
‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం’ అంటూ నినాదాలు చేస్తుండ్రు. తామే పవర్లో ఉన్నమని మర్చిపోయిండ్రా ఏంది! అధికార పార్టీ నేతలే తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దొంగలు, దోపిడీదారులు అని బజారెక్కి మొత్తుకుంటుంటే కాంగ్రెస్ నేతలే తమది దొంగల పాలన.. దోపిడీ పాలన అని ఒప్పుకొంటుంటే.. సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? ఏది ఏమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ నడుపుతున్నది సర్కారో, సర్కసో.. నవయువనేత రాహుల్‌కైనా తెలుసో లేదో! కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ఇదో కొత్త రాజకీయ మాడల్ కావొచ్చు! అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాన్ని తిట్టుకుంటూ కాలం గడుపుతున్నది. ప్రతిపక్షం ప్రజల గోడు వింటూ ముందుకు వెళ్తున్నది. భలే ఉన్నది కాంగ్రెస్ మార్క్ మార్పు!
ఆనాటి చీకటి రోజులే తెచ్చిండ్రు!
ఎన్నికల ముందు కాంగ్రెస్ 420 హామీలు.. ఆరు గ్యారంటీలు.. ప్రతి ఇంటికీ భరోసా.. ప్రతి వర్గానికీ న్యాయం.. అంటూ హామీల వర్షం కురిపించింది. మోసపోయిన ప్రజలు అధికారం అప్పగించారు. కాంగ్రెస్ గద్దెనెక్కింది. కానీ ఇప్పుడు ఆ హామీల అమలు ఎక్కడుందని అడిగితే మాత్రం… సమాధానం చెప్పడంలేదు. హామీల లెక్క అడిగితే ఖజానా ఖాళీ అని, లంకె బిందెలు లేవని ఎటకారం ఆడుతున్నరు. అయితే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పదేపదే చెప్పిన ఆనాటి రోజులు తెస్తాం అనే మాట మాత్రం ఇప్పుడు గురొస్తున్నది. నిజంగానే రైతులు విత్తనాల కోసం క్యూలో నిలబడుతున్నారు. యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. సాగునీటి కోసం ఆకాశం వైపు, అధికారుల వైపు చూస్తున్నారు. నీళ్లు లేక చాలాచోట్ల సాగు తగ్గుతున్నది. రైతు బీమా ఆగిపోయింది.
విద్యుత్తు సమస్యపై రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇక కరెంట్ విషయంలో ప్రభుత్వం చెబుతున్న కారణం మరింత గమ్మతున్నది. విద్యుత్తు కొరతకు ఎల్ నినో కారణం అంటూ డిప్యూటీ సీఎం, విద్యుత్తుశాఖ మంత్రి అసెంబ్లీలోనే ప్రకటించారు. ఎల్ నినో రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిందా? ఏడాది కాలంగా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న ముచ్చటే కదా?! కరోనా లాంటి ప్రపంచవ్యాప్త సంక్షోభం వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాను నిరంతరాయంగా కొనసాగించిన గత పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలకు కావాల్సింది సాకులు కాదు.. సమాధానాలు. ఎన్నికలప్పుడు ‘ఆనాటి రోజులు తెస్తాం’ అన్న మాటకు ఇప్పుడు కొత్త అర్థం కనిపిస్తున్నది. ఆనాటి రోజులు అంటే కాంగ్రెస్ మార్క్ కరువు రోజులే కదా! జనం గోడు పట్టించుకోని అధ్వాన పాలనననే కదా! ఆ రోజులను కాంగ్రెసోళ్లు తీసుకొచ్చిండ్రని ప్రజలు అనుకుంటున్నరు.
పనికిమాలిన ఈహెచ్ఎస్ కార్డు?
ఉద్యోగి జీతం ఖాతాలో పడిందో లేదో.. ఈహెచ్ఎస్ రికవరీ మాత్రం ముందే జరిగిపోద్ది! నీ ఆరోగ్యం మా బాధ్యత అన్నట్టు డబ్బులు లాగేసుకుంటున్నది. కానీ ఆ ఉద్యోగి ఇంట్ల నిజంగానే ఆపదొస్తే.. చేతిలో ఈహెచ్ఎస్ కార్డు పట్టుకుని దవాఖాన గడప తొక్కితే ’ఈ కార్డు మా దగ్గర పనికిరాదు’ అంటున్నరు. కరీమాబాద్ ఉపాధ్యాయుడు భిక్షపతి కొడుక్కు విద్యుత్తు ప్రమాదం జరిగితే అత్యవసర చికిత్స కోసం దవాఖానకు పోయిండ్రు. ఈహెచ్ఎస్ కార్డు పనిచేయకపోవడంతో సొంత డబ్బులు, తోటి టీచర్ల సాయంతో పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నడు.
ఇది కేవలం ఓ కుటుంబ కష్టం కాదు.. నెలనెలా డబ్బులు రికవరీ చేసుకుంటున్న వేలాది ఉద్యోగుల గుండెల్లో ఉన్న భయం! అభద్రత! ప్రైవేట్ దవాఖానలకు బకాయిలుంటే ప్రభుత్వం తీర్చాలె. ప్యాకేజీలు గిట్టకపోతే పరిష్కారం చూపాలె. కానీ ఆ భారం మాత్రం ఉద్యోగి నెత్తిమీద ఎందుకు? అందుకే ఈహెచ్ఎస్ మీద నమ్మకం లేక ’స్కీమ్ కావాలా? వద్దా?’ అనే ఆప్షన్ ఉద్యోగులకే ఉండాలనే డిమాండ్ ఉద్యోగుల వైపు నుంచి రోజురోజుకూ పెరుగుతున్నది. ఉద్యోగి అడిగేది ఉచిత వైద్యం కాదు.. తాను కట్టిన డబ్బుకు ఆపదలో అండ మాత్రమే!