Teachers Day | ‘ప్రపంచాన్ని మార్చే శక్తిమంతమైన ఆయుధం విద్య మాత్రమే’అని నెల్సన్ మండేలా అన్నారు. అలాంటి శక్తిమంతమైన ఆయుధాన్ని ప్రజలకు అందించేవారు, మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దే క్రాంతి ప్రదాతలు ఉపాధ్యాయులు. అందుకే సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు విశిష్ట స్థానం ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 5న జరుపుకొంటారు.
ఉపాధ్యాయుల హక్కులు, బాధ్యతలు, విద్య, నియామకం, ఉపాధి, బోధన, అభ్యసనాలను నిర్ద్దేశించే ఉపాధ్యాయుల ప్రమాణాలను 1966 లో రూపొందించారు. దీనికోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో), యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్), ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ (ఈఐ)లు చేసిన సిఫారసులను ప్యారిస్‌లో ఆమోదించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 1994 అక్టోబర్ 5 నుంచి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
‘ఉపాధ్యాయుల కొరతను అధిగమించడం: ప్రపంచ ఆవశ్యకత’ అనే థీమ్‌తో 2023 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను యునెస్కో ఘనంగా నిర్వహిస్తున్నది. ఉపాధ్యాయుల సంఖ్యను పెంచటం, సమాజానికి నాణ్యమైన విద్యను అందించడం దీని లక్ష్యం.
2030 యునెస్కో ఎజెండాలోని విద్యా లక్ష్యాలను చేరుకోవాలంటే సుశిక్షితులైన ఉపాధ్యాయుల అవసరం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల కొరత 69 మిలియన్లు. ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే నిపుణుల తయారీ సుశిక్షుతులైన ఉపాధ్యాయులతోనే సాధ్యం. టీచర్ల కొరతను తగ్గించడానికి, ప్రతి విద్యాసంస్థ సాంకేతికతను ఉపయోగించుకునేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. దాంతోపాటు, ప్రభావవంతమైన పాఠాలను అందించడానికి వారి బోధనాశైలిని మెరుగుపర్చుకోవటం చాలా ముఖ్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టీచర్లు ఉపయోగించేలా చూడటం ద్వారా నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుంది.
26.5 కోట్ల మంది విద్యార్థులు,14.9 లక్షల పాఠశాలలు, 95 లక్షల మంది ఉపాధ్యాయులతో భారతీయ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థగా గుర్తింపు పొందింది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం, అతిపెద్ద విద్యావ్యవస్థలో ఉన్న మనం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ దేశ ప్రజలకు పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్య అందించడంలో సఫలీకృతం కాలేకపోతున్నాం.
భారతదేశంలో ఉపాధ్యాయులకు అత్యధిక డిమాండ్ ఉన్నది. భారత ప్రభుత్వం 2030 నాటికి ప్రాథమిక విద్యలో 100 శాతం స్థూల నమోదు(ఎన్రోల్మెంట్) లక్ష్యంగా పెట్టుకున్నది. యునెస్కో నివేదిక ప్రకారం భారతదేశంలో 12 లక్షల ఉపాధ్యాయుల అవసరం ఉన్నది. ఆర్థిక సర్వే 2023 ప్రకారం విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి అన్ని స్థాయుల్లో స్థిరంగా పెరుగుతున్నది. ఐక్యరాజ్యసమితి విద్య, విజ్ఞాన (శాస్త్రీయ), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో దాదాపు 1.1 లక్షల ఏక ఉపాధ్యాయ పాఠశాలలు న్నాయి. దేశంలోని పాఠశాలల్లో మొత్తం 19 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 69 శాతం వరకు ఉన్నది.
‘జ్ఞానంపై పెట్టుబడి ఉత్తమ వడ్డీని చెల్లిస్తుంది’ అంటాడు బెంజిమిన్ ఫ్రాంక్లిన్. 21వ శతాబ్దంలో భారతీయ యువత ప్రపంచంతో పోటీ పడాలని, దానికోసం వారికి నాణ్యమైన విద్యను అందించాలని, వారిలో సృజనాత్మకతను పెంచాలని భారత ప్రభుత్వం 2020 జూలై 29న నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం భారతదేశ జీడీపీలో విద్యారంగానికి కనీసం ఆరు శాతం నిధులను కేటాయించాలి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 2.9 శాతం నిధులు (రూ.1,12,899 కోట్లు) మాత్రమే కేటాయించింది. ప్రపంచంలో నాణ్యమైన విద్యను అందించే దేశాలు వాటి బడ్జెట్లో 6 శాతం కన్నా ఎక్కువ నిధులనే కేటాయిస్తున్నాయి. ఉదాహరణకు నార్వే, చిలీ దేశాల్లో 6.6 శాతం, ఇజ్రాయెల్, న్యూజిలాండ్‌లు 6.2 శాతం, ఇంగ్లాండ్ 6.1 శాతం, అమెరికా 6 శాతం నిధులు కేటాయించి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
ఉపాధ్యాయ వృత్తి అనేక సవాళ్లతో కూడుకున్నది. అయితే నేటి ఆధునిక కాలంలో ఉపాధ్యాయ వృత్తిలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రగతిశీల చైతన్యపూరిత భావజాలానికి బదులుగా కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, స్వచింతన విద్యారంగంతో పాటు ఉపాధ్యాయుల్లో కూడా నెలకొన్నాయి.
నేటి బాలలే రేపటి పౌరులు. వారికి నైతిక విలువలు, మానవీయత, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిరక్షణ, ప్రగతిశీల భావనలు వంటి అంశాలు బోధించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నది. అప్పుడే నవభారత నిర్మాణం సాధ్యమవుతుంది.
(నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం)
పాకాల శంకర్ గౌడ్
9848377734