రాజకీయాల్లో ప్రత్యర్థులను లక్ష్యంగా చేస్తూ మాట్లాడటం కొత్త కాదు. కానీ, పరిమితులను అతిక్రమించినప్పుడే వివాదాలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రముఖ సినీహీరో నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ.
ఒకప్పుడు రాజకీయాల్లో ఆరోపణలు చేయాలన్నా ఆచి తూచి వ్యవహరించేవారు. ప్రత్యర్థుల సిద్ధాంతాలు, విధానాలను విమర్శించడం తప్ప వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను రచ్చకీడ్చేవారు కాదు. కానీ, వర్తమాన సమాజంలో ఆ దృశ్యం అంతర్ధానమైంది. లాగుల్లో తొండలు వదలడాలు, పండబెట్టి తొక్కి పేగులు మెడలో వేసుకోవడాలు, అక్రమ సంబంధాలు అంటగట్టడాలు, వ్యక్తిగత అలవాట్లను వెక్కిరించడాలు రాజకీయ నాయకులు ప్రయోగించే ఊత పదాలైపోయాయి. పార్టీ వేదికా? ప్రభుత్వ వేది కా? అన్న తేడా లేకుండా తిట్ల పురాణ ప్రవచనాలు నిత్యకృత్యమైపోయాయి. అది అంతటితో ఆగిందా సంస్కార హీనమైన, అమానవీయమైన వ్యాఖ్యల ప్రకంపనలు రాజకీయాలకు సంబంధం లేని కుటుంబాలను, మహిళలనూ తాకుతుండటమే ఆక్షేపణీయం.
మొన్నటికి మొన్న రాష్ట్ర అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి, సునీతారెడ్డి పట్ల అధికార పార్టీ వ్యవహరించిన తీరు ఇంకా జ్ఞాపకాల ఫలకం మీద చెరిగిపోలేదు. పురుషాధిక్య సమాజంలో మహిళలు రాజకీయాలు సహా ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. అయితే, మహిళలకు మహిళలే ప్రత్యర్థులుగా మారి పరువును మంట కలుపుతుంటే ఇక రక్షించేదెవరు. కొండా సురేఖ ఆ విచక్షణ మర్చిపోయి నోరు జారి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ దూషణ నిందారోపణ పర్వాన్ని కేసీఆర్ ప్రారంభిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నాడని మోకాలుకు, బోడి గుండుకు ముడివేసే వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేతలు తరచుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వివాదాల్లో తలదూర్చి కాంగ్రెస్‌ను పరదా వెనక్కు నెట్టి, కేసీఆర్ దోషి అన్నట్టుగా తీర్పులు చెప్తున్నారు. ఇటీవల హరీశ్‌రావు ఒక పత్రికలో రేవంత్‌రెడ్డి తిట్ల పురాణాన్ని వ్యాసంగా రాస్తే… బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇన్ప్లీడై ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అంటూ ప్రధానంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ అదే పత్రికలో వ్యాసం రాశారు. కేసీఆర్ ప్రయోగించిన భాషను వేలెత్తి చూపుతూ, కాంగ్రెస్ నేతలు ప్రయోగిస్తున్న భాషను పరోక్షంగా బీజేపీ నేతలు వెనుకేసుకొచ్చారు. వాస్తవానికి కేసీఆర్ ఏనాడూ ప్రత్యర్థుల కుటుంబాలను రచ్చకీడ్వలేదు.
జుగుప్సాకరమైన పద ప్రయోగాలు చేయలేదు. తెలంగాణ పలుకుబడులు, జాతీయాలు, గ్రామీణ పదబంధాలు ఉపయోగించారు. పద్యాలు ఉటంకించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తదనంతరం సొంత రాష్ర్టానికి హక్కుగా రావలసిన, న్యాయమైన వాటాల కేటాయింపుల కోసం కొట్లాడిన సందర్భంలో అనివార్యంగా కొంత కోపంగా మాట్లాడింది వాస్తవమే. అది ధర్మాగ్రహమే తప్ప, అవతలి వ్యక్తుల హననం కాదు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ పాలకులను తెల్లోల్లు, బొల్లి గద్దలు అంటే ఆ మాటలను బాడీ షేమింగ్‌గా ప్రజలు భావించలేదు.
నిజాం వ్యతిరేక పోరాటంలో కవులు నిజాం రాజును ముసలి నక్క అన్నా, మేడను పడదోస్తాం-మెడనే విరిచేస్తాం అన్నా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలలో వ్యతిరేక శక్తులపై ఉద్యమకారులు కవులు ప్రయోగించిన భాషను దూషణగా కాక ధర్మాగ్రహ వ్యక్తీకరణగానే ప్రజలు భావించారు. కారణం వాటివెనుక ఒక ప్రజా ప్రయోజనం, ఉద్యమ స్ఫూర్తి, ఆకాంక్షలు ఇమిడి ఉన్నాయి. వ్యక్తులను బట్టి, స్థలకాలాలు, సందర్భాలను బట్టి తిట్టు స్వభావం, విలువలు మారిపోతుంటాయి. అవి నిఘంటువులకు అందవు. కేసీఆర్ భాషణలూ అంతే. ఆయనది విలక్షణమైన డిక్షన్. అది అనితర సాధ్యం. అయినా, కాంగ్రెస్ నేతలు తమ పలుకు ప్రల్లదనాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ మాటలను ముందుకు తెచ్చినప్పటికీ ప్రజలు ఆమోదించలేదు. కేసీఆర్ పాతికేండ్ల పద ప్రయోగాలకు, ప్రసంగశైలికి కాంగ్రెస్ నేతల దిగజారుడు మాటలకు పోలికే లేదు.
ద్రౌపదీ వస్ర్తాపహరణ ఘట్టంలో ఆగ్రహించిన భీముడు దుర్యోధన దుశ్శాసనులను తిట్టినదానికి, రాజసూయ యా గంలో కులవివక్షతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని తిట్టినదానికి తేడా లేదా. రెండు ఒకే గాట కడితే ఎట్లా? మహా మహా భక్తులు సైతం కొన్ని సందర్భాల్లో ఏకంగా దేవుళ్లనే తిట్టిపోశారు. అన్నీ భక్త్యావేశాలే. వాటి వెనక ఒక ఉదాత్తమైన అంశం ఇమి డి ఉన్నప్పుడు సమాజం ఆమోదించింది. ఏదో ఒక తొందరపాటు క్షణంలో మహామహులే నోరు జారి వెనక్కి తీసుకున్న సందర్భాలు రాష్ట్ర దేశ రాజకీయాలలో కోకొల్లలు. అది వేరు. వాలాయించి క్రూర దూషణలు, నిందారోపణలు, అస భ్య పద ప్రయోగాలు అదేపనిగా చేస్తున్న కాం గ్రెస్ నాయకులతోనే సమాజం కలుషితమవుతున్నది. ఈ తేడాను బీజేపీ నేతలు గమనించాలి.
లేని పోని ఆరోపణలు చేయడానికి, అక్రమ సంబంధాలు అంటగట్టడానికి, కుటుంబాల పరువు బజారుకీడ్వడానికి, పుకార్లు, అనుమానాలు, అపోహలు సృష్టించడానికి గతంలో కొన్ని నాసిరకం పత్రికలు ప్రత్యేకంగా ఉండేవి. పైశాచిక ఆనందం కోసం వాటిని ఆసక్తితో చదివే పాఠకులూ కొందరు ఉండేవారు. సోషల్ మీడియా అనే ఐదవ స్తంభం అవతరించాక ఆ వెర్రి వేయి విధాలుగా విస్తరించింది.
వాస్తవానికి ఎవరైనా తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి, పది మందితో పంచుకోవడానికి, చర్చలకు, అభిప్రాయ సేకరణకు, ప్రతిభా పాటవ ప్రదర్శనలకు అద్భుతమైన వేదిక సోషల్ మీడియా. కానీ, కొంతమంది సంస్కారహీనులు ఆ వేదికపై విచ్చలవిడిగా విహారం చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. రాజకీయాల్లో లేనిపోని అబద్ధాల ప్రచారానికి.. అపోహలు, భయాందోళనల కల్పనకు.. ఎన్నికలను ప్రభావితం చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకునే మాఫియా డాన్లు దేశ స్థాయిలో వీవీఐపీలుగా ప్రాచుర్యం పొందారంటే, ప్రభుత్వాలను శాసించగలుగుతున్నారంటే అది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కూడా ఒక ‘కొనుగోలు’కు అమ్ముడు పోవ డం విషాదం. ఒకరిద్దరు సోషల్ మీడియా పోకిరీల వికృత వ్యాఖ్యలకు మంత్రి స్థాయిలో ఉన్నవారైనా బాధపడటం సహజమే. కానీ, సంబంధం లేని ప్రముఖులపై అంతకంటే బాధ కలిగించే తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం తగని పని. జరగాల్సిన నష్టం జరిగాక ఎన్ని క్షమాపణలు చెప్పి నా అవి ఎంతో కొంత విష ప్రభావం చూపక మానవు. ఒక బుద్ధిహీనుడి నీలాపనింద రామాయణ కథ విషాదాంతానికి దారితీసింది.
డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238