ఆమె ఎక్కడా వణకలేదు, బెణకలేదు, తొణకలేదు. ఒత్తిడిని తన దరిదాపుల్లోకి రానివ్వలేదు.ప్రత్యర్థిని మాటల తూటాలతో చీల్చిచెండాడారు. తన విధానాలను విస్పష్టంగా వివరించారు. ప్రత్యర్థి ప్రశ్నలకు దీటుగా సమాధానాలిచ్చారు. అమెరికాను అగ్రభాగాన నిలిపేందుకు తనకంటూ ఒక
విజన్ ఉందని నొక్కిచెప్తూనే, ప్రత్యర్థి వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని కుండబద్దలు కొట్టారు. ప్రతి అంశంలోనూ ఆధిక్యత కనబరిచి స్పష్టమైన ఆధిపత్యం చెలాయించారు. జాతీయ నుంచి అంతర్జాతీయ యుద్ధాల వరకు తన వైఖరిని విస్పష్టంగా వెల్లడించిన అమెరికా నల్లకలువ
కమలా హ్యారిస్ అగ్రరాజ్యంతో పాటు ప్రపంచాన్ని మైమరిపించారు.
నల్లజాతి ఓటర్లలో 69%మంది నల్లకలువకే మద్దతు తెలుపుతున్నట్టు సర్వేలు తేల్చి చెప్తున్నాయి. దీంతో శ్వేత సౌధం ముమ్మాటికీ తమదేనని కమల మద్దతుదారులు ధీమాగా ఉండటంతో ట్రంప్‌కు ఓటమి భయం పట్టుకున్నది. అందుకే ఆయన జాతులు, వర్గాల మధ్య చిచ్చుపెడుతూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ఫిలడెల్ఫియాలో జరిగిన తొలి డిబేట్లోనే డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహ్యారిస్ తన సత్తా ఏమిటో చాటిచెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ట్రంప్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించారు. డిబేట్ ప్రారంభానికి ముందే తన సహజసిద్ధమైన చిరునవ్వుతో ప్రత్యర్థితో కరచాలనం చేసిన కమలా అమెరికన్లను ఆకట్టుకున్నారు. తడబడకుండా, ఒత్తిడికి గురికాకుండా, కొండంత ఆత్మవిశ్వాసంతో సుత్తి లేకుండా, ముక్కుసూటిగా డిబేట్ చివరి వరకు ఆమె మాట్లాడి అందరి మన్ననలు పొందారు. అంతేకాదు, విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ, సవాళ్లకు ప్రతిసవాల్ విసురుతూ ఎక్కడా తగ్గేదేలేదని నిరూపించారు. ఈ క్రమంలో లీగల్ విభాగంలో ప్రాసిక్యూటర్‌గా గతంలో ఆమెకున్న అనుభవం ఎంతగానో కలిసొచ్చింది. ఆర్థిక సంక్షోభం నుంచి యుద్ధాల వరకు సాగిన ఈ డిబేట్లో కమలా హ్యారిస్ పైచేయి సాధించారని చెప్పడానికి అమెరికన్ మీడియా ఆమెను ఆకాశానికి ఎత్తిన తీరే నిదర్శనం.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో జరిగిన మొదటి డిబేట్లో బైడెన్‌పై ట్రంప్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనంతర పరిణామాల నేపథ్యంలో బైడెన్ నిష్క్రమణ, ఆయన స్థానంలో కమలా హ్యారిస్ అభ్యర్థిగా బరిలో నిలవడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు గెలుపు ధీమాతో ఉన్న ట్రంప్‌లో నిరాశ, నిస్పృహ ఆవహించాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన కమలా హ్యారిస్ గంటల వ్యవధిలోనే మెజారిటీ పార్టీ ప్రతినిధులు, కీలక నేతల మద్దతును కూడగట్టుకున్నారు.
ప్రజామోదం నేపథ్యంలో మొదట కినుక వహించిన మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం ఆమెకు మద్దతివ్వాల్సి వచ్చింది. భారీగా విరాళాల సేకరణతో కమల గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతూ పోయింది. దీంతో అప్పటివరకు ఓడిపోతామని నైరాశ్యంలో ఉన్న డెమోక్రటిక్ వర్గాల్లో ఒక్కసారిగా జోష్ వచ్చింది. వారి ఆత్మైస్థెర్యం అమాంతం పెరగగా.. ట్రంప్ మద్దతుదారుల్లో నిస్పృహ అలుముకున్నది.
కమలా హ్యారిస్ అతితక్కువ సమయంలోనే ట్రంప్‌కు కొరకరాని కొయ్యలా మారారు. భారతీయ మూలాలున్న కమలాహ్యారిస్‌కు స్వతహాగానే భారతీయులు మద్దతుగా నిలుస్తున్నారు. తండ్రి వారసత్వం వల్ల నల్లజాతీయులు కూడా ఆమెకు జై కొడుతున్నారు. దీంతో అధ్యక్ష పీఠం దిశగా ఆమె రేసుగుర్రంలా దూకుడుగా దూసుకుపోతున్నారు. ఓవైపు తన మాటలతో అమెరికన్లను మంత్రముగ్దుల్ని చేస్తూనే.. మరోవైపు విమర్శలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఏ మాత్రం అలసత్వం వహించకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
నల్లజాతి ఓటర్లలో 69 శాతం మంది నల్లకలువకే మద్దతు తెలుపుతున్నట్టు సర్వేలు తేల్చిచెప్తున్నాయి. దీంతో శ్వేత సౌధం ముమ్మాటికీ తమదేనని కమల మద్దతుదారులు ధీమాగా ఉండటంతో ట్రంప్‌కు ఓటమి భయం పట్టుకున్నది. అందుకే ఆయన జాతులు, వర్గాల మధ్య చిచ్చుపెడుతూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ప్రస్తుత డిబేట్ ద్వారా మధ్యతరగతి మద్దతును కమలాహ్యారిస్ కూడగట్టుకున్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు ఉన్న ప్రాధాన్యాన్ని, పెద్దన్న పాత్రను కాపాడుతారనే విశ్వాసాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో కమలాహ్యారిస్ గెలుపు ఖాయంగా కనిపిస్తున్నది.