అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ధారాదత్తం చేయడంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు స్థానిక స్వచ్ఛంద సంస్థల న్యాయపోరాటం ఫలితంగా ఇది సాధ్యమైంది. 2015-25 మధ్యకాలంలో రూ.1,270 కోట్ల విలువైన కాంట్రాక్టులు సీఎం సతీమణితో సహా ఆయన బంధుగణానికి చెందిన కంపెనీలు దక్కించుకున్నాయనేది ప్రధాన ఆరోపణ. ఇలా సమీప బంధువులు వరుసబెట్టి కాంట్రాక్టులు దక్కించుకోవడం ‘విస్మయకరమైన యాదృచ్ఛికత’గా సుప్రీంకోర్టు అభివర్ణించడం గమనార్హం. రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేసి ఉండవచ్చు. ఎవరో ప్రజాసక్తి వ్యాజ్యం వేసి ఉండవచ్చు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం సర్వోన్నత న్యాయస్థానం సీఎం అవినీతి, బంధుప్రీతిపై బండారం బద్దలు కొట్టాల్సిందేనని తేల్చిచెప్పడం అసాధారణమైన సంగతేనని చెప్పక తప్పదు. అయితే కోర్టు నిర్ణయం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసి దర్యాప్తునకు దారి సుగమం చేయాల్సిన సీఎం పేమా ఖండూ సుప్రీం తీర్పును స్వాగతించి చేతులు దులిపేసుకోవడం విడ్డూరం. దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నదనేది ఆయన మద్దతుదారుల వాదన. కేంద్రం చేతిలో సీబీఐ పావుగా మారిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నేపథ్యంలో ఈ వైఖరి అనుమానాలకు తావిస్తున్నది.
2014కు ముందు తలెత్తిన అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో బీజేపీ చాలానే లబ్ధి పొందింది.‘నేను తినను, ఇంకొకరిని తిననివ్వను’ అంటూ ఊదరగొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో బీజేపీ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. అనేక రాష్ర్టాల్లో బీజేపీ సీఎంలు, మంత్రులు భూబాగోతాలు, మైనింగ్ ముడుపులు, ఆర్థిక అవకతవకల కేసుల్లో దొరికిపోవడం తెలిసిందే. కర్ణాటక, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు యడ్యూరప్ప, శివరాజ్‌సింగ్ చౌహాన్ స్కామ్‌లలో ఇరుక్కున్నారు. ఈశాన్య రాష్ర్టాల్లో బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలకు లెక్కేలేదు. అందుకు పేమా ఖండూ ఉదంతమే పెద్ద ఉదాహరణ. 2016 జూలైలో కాంగ్రెస్ సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టి ఆరు మాసాల కాలంలో రెండుసార్లు పార్టీ మారారు. అవినీతి ఆరోపణల మధ్య రాజకీయ అస్థిరత ఏర్పడటంతో తన పదవికి ఎసరు వస్తుందని భావించి సెప్టెంబర్‌లో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌లో చేరారు. ఆ పార్టీ తనను బహిష్కరించడంతో బీజేపీలో చేరి, పదవిని కాపాడుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారు బీజేపీలో చేరితే రాత్రికిరాత్రే ‘పరిశుద్ధులు’గా మారుతారనడానికి ఖండూ ఓ నిలువెత్తు నిదర్శనం.
అయితే సీఎంలు, మంత్రులు స్కామ్‌లలో ఇరుక్కోవడం బీజేపీకి మాత్రమే పరిమితమైన విషయం కాదు. అనేక బీజేపీయేతర రాష్ర్టాల్లోనూ మంత్రులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత కంపెనీలకు ఎంతోకొంత మేలు చేసుకోవడం గురించిన వార్తలు వింటూనే ఉన్నాం. భూకబ్జాలు, కాంట్రాక్టులు ఎగరేసుకుపోవడాలూ యథేచ్ఛగా జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రయోజనాలకు, స్వప్రయోజనాలకూ మధ్య దూరం పాటించాలనే నియమం గాలికి పోతున్నది. వీటన్నిటి మాటేమిటి? అయినా కోర్టు ఆదేశిస్తే గానీ దర్యాప్తులు జరుపకపోవడం ఏమిటి? ఇవీ దేశం ముందున్న ప్రశ్నలు.