విత్తనం చుట్టూ మోహరించిన రుగ్మతలను దూరంగా తరిమేయడం వల్లనే తెలంగాణ పంటల మాగాణమయ్యింది. ఏ సావుకారి ఇంటి ముందు, ఏ అవసరానికి కూడా ఏ రైతు చెయ్యి చాపి నిలబడే దుస్థితి రాకూడదనే కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అన్నదాతకు ఆసరాగా నిలబడింది. అభివృద్ధి మాత్రమే కాదు, వ్యవసాయ స్థిరీకరణే అసలు లక్ష్యంగా పదేండ్ల పాటు ప్రగతిశీల వ్యవసాయ విధానాన్ని ఆచరణలో పెట్టింది.
ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే కాదు, యావత్ దేశంలోనూ నినాదాల జోరు, పంగనామాల తీరు తప్ప, ప్రభుత్వాలకు వ్యవసాయ రంగంపై లోతైన దృష్టి కోణం గతంలో ఎక్కడుండింది? సుదీర్ఘ కాలం అన్ని రంగాల్లోలాగానే వ్యవసాయంలో సైతం విధ్వంసక వికాసాన్నే రాష్ట్ర, దేశ సర్కార్లు విజన్ పేరిట డంభాచారం చేసుకున్నాయి. స్థానిక భౌగోళిక, సామాజిక వాస్తవికతను విస్మరించి, గణాంకాల గుణంతో వ్యవహరించి సేద్యాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేశాయి. ఫలితంగా గ్రామాలు ఆకలి, అప్పులు, ఆత్మహత్యల నిలయాలుగా మారి భీతినే తప్ప, ఏ అనుభూతిని కానకపోయేవి. ఇంట్లో ఉండలేక, పొలాలకు పోలేక, రాతిబండల మీద కూలబడి, రోదన పంచుకునే సమూహంగా రైతులోకం గడ్డుకాలాలను ఎదుర్కొన్నది.
దగాపడ్డ తెలంగాణ పడిన దుఃఖాన్ని, ఉరితాళ్లకు వేలాడిన బంధాలను చూసి విలవిలలాడటాన్ని ఎట్లా మరువగలం? కానీ, పదేండ్ల ప్రయత్నం, ప్రజా ఆత్మగౌరవమే గీటురాయిగా కేసీఆర్ సర్కార్ అమలు చేసిన రైతాంగ సంక్షేమ పథకాల ఫలితంగా తెలంగాణ తలెత్తుకొని నిలబడింది.
ఏ విధ్వంసక వృద్ధి నమూనా అయితే మళ్లీ తెలంగాణ మెడకు పడకూడదని అనుకున్నామో, ఏ అధ్వాన పరిస్థితి అన్నదాతలకు తిరిగి ఎదురవ్వరాదని భావించామో, అదే భయానక దుస్థితిని అంతటా చూడాల్సి రావడం బాధాకరం. రెండేండ్లలోపే పదేండ్ల పంటకు ప్రమాదం ఏర్పడింది. రాజులా బతికిన రైతే రోడ్డున పడాల్సిరావడం తెచ్చుకున్న తెలంగాణకు ఎంత తలవంపు? విత్తనాల కోసం, ఎరువుల కోసం, నీటి కోసం చివరికి సొంత భూమిని కాపాడుకోవడం కోసం తండ్లాడాల్సిన పరిస్థితి రైతన్నకు దాపురించింది. బిల్డింగ్లపైకే కాదు, భూమిపైకి బుల్డోజర్లను పంపే గుండె లేని గవర్నమెంట్ వల్ల ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు రైతు లోకం శోకమయంగా మారింది. రైతులకు ఎరువులు కూడా సరఫరా చెయ్యలేని దుర్భర పరిస్థితికి కేవలం సర్కార్ అసమర్థతే కారణమైతే, సరిచేసుకోవాలని విమర్శలతో సరిపెట్టవచ్చు. కానీ, సర్కార్ అవగాహనలో, ఆచరణలోనే వ్యవసాయ విముఖత మిళితమై ఉందన్నది స్పష్టంగా కనిపిస్తున్నది కదా? అసమర్థతో, నిర్లక్ష్యమో అయితే సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, విధానమే వికారంగా ఉన్నప్పుడు పరిష్కారాన్ని ఈ ప్రభుత్వం నుంచి ఆశించలేం. ఇలా అన్యాయమైన వైఖరే లేకపోతే పార్లమెంట్ ఎన్నికలో, స్థానిక సంస్థల ఎన్నికలో ఉంటే తప్ప రైతు భరోసానూ అరకొరగా అందజేసే తతంగాన్ని ఎలా నడిపించగలరు? అసలు రైతులను ఏమార్చి ఏం బావుకుందామని? వారసత్వమేమో పోలీస్ పటేల్ వ్యవస్థ నుంచి, నేపథ్యమేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి అయినప్పుడు, రైతుల అవసరాల పట్ల అప్రమత్త వ్యవహారశైలి ప్రస్తుత ముఖ్యమంత్రికి సహజంగానే అలవడకపోవచ్చు. కానీ, ఆర్తనాదాలు వినపడిన తర్వాతైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఈ సర్కార్ పెద్దలను ఏమనాలి?
తెలవారకమునుపే నిద్ర లేచి రైతు పొలం పనుల తొవ్వ పట్టినట్లుగా, గత కేసీఆర్ ప్రభుత్వం పంటకాలం మొదలు కావడానికి ఎన్నో రోజుల ముందు నుంచే వ్యవసాయరంగ అవసరాలపై కచ్చితమైన అంచనాలను రూపొం దించుకునేది. సాగు విస్తీర్ణం, లక్ష్యాలు, అందుబాటులో ఉంచాల్సిన సదుపాయాల పట్ల అప్రమత్తంగా ఉండేది. రైతులకు కావాల్సిన ఎరువులు, నాణ్యమైన విత్తనాలను సరిపడా సమకూర్చిపెట్టేది. దానివల్లనే 2014లో 25.14 లక్షల టన్నుల ఎరువుల వినియోగం జరిగితే, 2022 నాటికి 39.87 లక్షల టన్నుల ఎరువులను తెలంగాణ రైతాంగం వినియోగించుకోగలిగింది. నాటి సీఎం కేసీఆర్ ముందస్తు చర్యలు, వ్యవసాయ శాఖ, కలెక్టర్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ వల్ల బీఆర్ఎస్ హయాంలో ఎనిమిదేండ్ల పాటు మాయమైపోయిన రైతుల క్యూలైన్లు ఎరువులు, విత్తనాల కోసం మళ్లీ బారులుతీరాయి.
ఈ వానాకాలం సీజన్లో లోటు వర్షపాతం వల్ల రంది పడుతున్న రైతన్నకు అదనంగా ఎరువులు, విత్తనాల కొరతను కలిగించి సర్కారు కన్నీరు పెట్టిస్తున్నది. రైతుల ఎరువులనూ ఆరగించే బకాసుర సర్కార్‌గా రేవంత్ ప్రభుత్వం మారిపోవడం వెగటు పుట్టిస్తున్నది. మార్క్‌ఫెడ్ ఎరువుల రవాణా టెండర్లు, గోదాముల నిల్వ సామర్థ్యం తదితర అనేక అంశాల్లో అడ్డగోలుగా నిబంధనలు మార్చుతూ అవినీతికి పావులు కదిపారనే ఆరోపణలు రేవంత్ సర్కార్‌పై వెల్లువెత్తుతున్నాయి. విత్తనాన్ని సైతం వదలకపోవడం ఎంతటి దుర్మార్గం? రైతు భరోసాను కుదించి, అరకొరగా విసిరారు. పంటల బీమాకు పైసలు లేవంటున్నారు. సగానికిపైగా రైతాంగానికి రుణమాఫీ ఎగ్గొట్టేశారు. రైతు బీమాను ఎత్తేస్తున్నారు. రెండేండ్లలో రైతులకు గుండు సున్నా చూపింది చాలక, గత కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన అన్నింటినీ ఆపేస్తే రైతులోకం ఏమైపోవాలి?
అసలు ఆశలు ఆవిరైపోయిన అన్నదాతల్లో విశ్వాసాన్ని వికసింపజేయడానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఎంత సంఘర్షణ పడ్డదో రేవంత్ సర్కార్ ఎన్నటికీ అర్థం చేసుకోలేదు. పడావు పడిపోయిన ప్రాథమికరంగంలో ప్రగతిని పండించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత శ్రమించిందో హస్తం పాలకులు అంచనా కూడా వేయలేరు. వ్యవసాయరంగాన్ని గుదిబండగా గవర్నమెంట్లు భావిస్తున్న కాలంలో, సుస్థిర వృద్ధికి ఇరుసుగా ఎవుసాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీర్చిదిద్ది దేశానికి చూపెట్టింది.
రూ.75 వేల కోట్లతో రైతులకు ఉచిత విద్యుత్తు అందించడమే కాదు, నూతనంగా 98 లక్షల ఎకరాలకు సాగునీరునూ సరఫరా చేసింది. 2014-15లో 62.49 లక్షల ఎకరాలకే నీటిపారకం ఉండగా, 2022-23లో 159.97 లక్షల ఎకరాలకు పెరిగిందని ఆర్బీఐ గణాంకాధారితంగా వెల్లడించింది. దీనికి తోడు రూ.35 వేల కోట్లకు పైగా రైతు రుణాలను మాఫీ చేసి కర్షకుల నుంచి 1.34 లక్షల కోట్ల ధాన్యం కొనుగోలు చేసింది. ఊరూరా రైతు వేదికలు, గోదాములు.. ఇలా ఎన్నో దీర్ఘకాలిక, నిర్మాణాత్మక వ్యవసాయ విధానాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. వీటన్నింటి ఫలితంగానే 2014-15లో కేవలం రూ.41,706 కోట్ల విలువైన పంట పండితే, 2023-24 నాటికి రూ.1,02,359 కోట్ల పంట పండిందని, పదేండ్లలో మొత్తంగా తెలంగాణ రూ.6.69 లక్షల కోట్ల పంటను పండించిందని బీఆర్ఎస్ కాదు, శాస్త్రయ లెక్కలతో ఆర్బీఐ రాష్ట్ర ప్రగతిని వివరించింది. సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి, ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణల్లో ఎక్కడో అడుగున మగ్గిన తెలంగాణ, స్వల్పకాలంలో దేశంలోనే తొలి స్థానానికి ఎదిగిన చరిత్ర తలచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది.
అందుకే భారతీయ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ వ్యవసాయ రంగంలో కేసీఆర్ దేశానికి కొత్త దిశను చూపించారని కొనియాడారు. ‘కేసీఆర్ వంటి విజనరీ లేరు. తెలంగాణ ప్రయోగమే దేశమంతటా జరగాలని కోరుకుంటున్నా’ అని దివంగత జయప్రకాశ్ నారాయణ్ ప్రధాన అనుచరుడు, జాతీయ కిసాన్ ఆందోళన్ నేత, ప్రొఫెసర్ రాకేశ్ రఫీక్ చెప్పారు. వీరే కాదు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేందర్‌సింగ్ సహా ఎందరో వ్యవసాయరంగ నిపుణులు కేసీఆర్ ప్రభుత్వ విధానాలను, సాధించిన మానవీయ ఫలితాలను ప్రశంసించారు. ఇంత శ్రమ నేడు బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుండటం ఆవేదన కలిగిస్తున్నది. అసలు ప్రభుత్వ లక్ష్యాలు ఎలా ఉండాలో, పాలకుల నుంచి రైతులు ఏం ఆశిస్తారో రేవంత్ సర్కార్‌కు ఎన్నడు అర్థమవుతుందో? ఇలా పొలాలను పస్తులుంచేది అసలు ప్రభుత్వమెలా అవుతుంది? రెండేండ్లలోనే తెలంగాణ బీళ్లు బావురుమనే దుస్థితి దాపురించడం దారుణం.