ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు చెప్పిన ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ. కానీ, అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోగా.. ఏడో గ్యారెంటీకి పూర్తిగా ఎగనామం పెట్టింది. లగచర్ల ఘటనే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ ఏడాది పాలనకు ఆ ఘటన పరాకాష్ఠ. తమ భూములను బలవంతంగా గుంజుకుంటారేమోననే భయాందోళనలో కట్టలు తెంచుకున్న అన్నదాతల ఆగ్రహం దాడుల దాకా వెళ్లింది. అయితే, అది అధికారులపై దాడి కానే కాదు. ముమ్మాటికీ రేవంత్ సర్కార్‌పై తిరుగుబాటే.
అన్నదాతల నిరసనను కలెక్టర్, అధికారులపై దాడిగా, రైతులను గుండాలుగా, రౌడీమూకలుగా కాంగ్రెస్ నాయకులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా కలెక్టరే తనపై దాడి జరగలేదని తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గంలో తిరుగుబాటు జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ పాలకులు.. ప్రజాసమస్యలపై రాజీలేని పోరా టం చేస్తూ, ప్రజలను చైతన్యం చేస్తున్న బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకున్నారు. బీఆర్ఎస్పై కోపంతో లగచర్లను దిగ్బంధం చేసి అమాయక గిరిజన రైతులపై దాడులు చేయడం గర్హనీయం.
లగచర్ల ఘటన జరిగిన నాటినుంచి ఆ గ్రామంలోకి ఎవరినీ వెళ్లనీయడం లేదు. ఆ గ్రామం పాకిస్థాన్‌లో ఉన్నట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు లగచర్లను సందర్శించి, బాధితులను పరామర్శించడానికి వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అంతేకాదు, జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, ఆఖరికి మహిళా సంఘాలను కూడా గ్రామంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న రేవంత్ సర్కార్ తెలంగాణను పోలీస్ రాజ్యంగా మార్చింది.ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రగా రైతుల నిరసనను పేర్కొంటున్న రేవంత్ సర్కార్.. తమపై తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను వ్యూహాత్మకంగా వదిలేసింది. వారిని కూడా అరెస్టుచేస్తే బీఆర్ఎస్ కుట్ర అనే డ్రామాను రక్తి కట్టించడం సాధ్యం కాదని పాలకులకు బాగా తెలుసు. అందుకే, బీఆర్ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులనే అరెస్ట్ చేయించారు. ఈ క్రమంలో రైతుల కు సంకెళ్లు వేసి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, పలువురిని జైలుకు పంపించడం శోచనీయం.
ఫార్మా కంపెనీల కోసం కేసీఆర్ ప్రభుత్వం ముచ్చర్లలో సుమారు 14,000 ఎకరాలను గతంలో సేకరించింది. ఒకే దగ్గర ఫార్మా కంపెనీలను ఏర్పాటుచేస్తే కాలుష్యాన్ని నియంత్రించవచ్చనేది బీఆర్ఎస్ సర్కార్ భావన. గత బీఆర్ఎస్ సర్కార్ సేకరించిన భూములపై రేవంత్ సర్కార్ కన్ను పడింది. అందుకే, ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సిద్ధమైంది.
తమ భూములను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు లగచర్ల రైతులు విన్న వించుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపాలని, తాము అండగా ఉంటామని నరేందర్ రెడ్డి, కేటీఆర్ అన్నదాతలకు భరోసా ఇచ్చారు. అంతేకాదు, ఆయా గ్రామాల్లో కాం గ్రెస్ పాలకులు చేస్తున్న అరాచకాలను అడుగ డుగునా అడ్డుకున్నారు. అందుకే, కుట్రదారుడి గా ఆరోపిస్తూ నరేందర్రెడ్డిపై కేసు నమోదు చేసి, అతన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు.
లగచర్ల రైతులది ముమ్మాటికీ ధర్మాగ్రహంతో కూడిన నిరసన. ఒక్క లగచర్ల రైతులే కాదు, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఒక్క హామీ అమలు చేయకుండా, గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలనూ ఎత్తివేసి కాంగ్రెస్ సర్కార్ ప్రజలను వేధిస్తున్నది. అందుకే, రాష్ట్రవ్యాప్తంగా సబ్బండవర్గాలు కాంగ్రెస్ పై కన్నెర్రజేస్తున్నాయి.
దేశంలోని ఇతర రాష్ర్టాల్లో అదానీ, పెట్టుబడులను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం ఆయన కంపెనీలకు ఎర్రతివాచీ పరుస్తున్నది. కాలుష్య కారక పరిశ్రమలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకత్వంలో ప్రజలు ఉద్యమిస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్ ఏకమై ప్రజాభిప్రాయాన్ని పక్కదారిపట్టిస్తున్నాయి. లగచర్ల ఘటనలో కాంగ్రెస్ వ్యవహ రించిన తీరును బీజేపీ సమర్థించడమే ఆ రెండూ పార్టీలు ఒక్కటేనని చెప్పేందుకు తార్కాణం.
మనకు అన్నం పెట్టే రైతన్నలు ఆపదలో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడకపోతే మనమే అసలైన దోషులుగా మిగిలిపోతాం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నసమయంలో చూస్తూ కూర్చుంటే మనం ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతాం. రాజకీయాలకు అతీతంగా లగచర్ల రైతులకు అండ గా నిలబడి ప్రభుత్వ దమననీతిని ఎదిరిద్దాం. ఎన్ని నిర్బంధాలు విధించినా మొక్కవోని ధైర్యం ప్రదర్శిస్తున్న రైతులపక్షాన ప్రజా ఉద్యమానికి సన్నద్ధమవుదాం.
(వ్యాసకర్త: కార్పొరేషన్ మాజీ చైర్మన్)
దేవిప్రసాద్