ఈ సమాజం నాకేమిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూసేవారెందరో ఉన్న ఈ సమాజంలోనే.. సమాజం కోసం తమ సర్వస్వాన్ని ధారబోయగల త్యాగమూర్తులు కూడా ఉన్నారని కొందరు త్యాగధనులు నిరూపిస్తారు. వారి సిద్ధాంతాలు ఏమైనా కావచ్చు, వాళ్లు నడిచే బాట ఎంత కఠినతరమైనదైనా కావచ్చు. కానీ, తాము నమ్మిన సిద్ధాంతం కోసం తమ జీవితాలను అంకితం చేస్తారు కొందరు. అలాంటి దార్శనికుల్లో ఒకరు సీతారాం ఏచూరి.
Sitaram Yechury | ఉన్నత కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యాభ్యాసం చేసి, మంచి ఉద్యోగంలో స్థిరపడగలిగే అన్ని అవకాశాలున్నా తన జీవితాన్ని సమాజం కోసం ధారపోశారు ఏచూరి. సర్వేశ్వర సోమయాజులు, కల్పకం దంపతులకు 1952 ఆగస్టు 12న మద్రాస్‌లో సీతారాం ఏచూరి జన్మించారు. సోమయాజులు అప్పటి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజినీరుగా పని చేస్తున్నందువల్ల హైదరాబాద్‌లోని ఆల్‌సెయింట్ హైస్కూల్లో సీతారాం ఏచూరి చదివారు. తర్వాత న్యూఢిల్లీలోని ప్రెసిడెంట్ ఏస్టేట్ స్కూల్ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్‌లో దేశంలోని ప్రథమ స్థానాన్ని సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాల నుంచి బీఏ, జేఎన్టీయూ నుంచి ఎంఏ పట్టా పొందారు. ఇక జేఎన్‌యూలో పీహెచ్‌డీలో చేరినా ఎమర్జెన్సీ కారణంగా అరెస్టు కావడంతో అది అర్ధాంతరంగా ముగిసింది.
జేఎన్‌యూ విద్యార్థి నేతగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏచూరి అంచెలంచెలుగా ఎదిగారు. 1974లో ఎస్ఎఫ్ఐలో చేరిన ఏచూరి ఆ తర్వాత దేశం గర్వించే నేతయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన 1975లో కొంత కాలం పాటు జైలుజీవితం గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక మూడు పర్యాయాలు జేఎన్‌యూ విద్యార్థి విభాగం అద్యక్షుడిగా ఎన్నికై విద్యార్థుల హక్కుల కోసం పోరాడారు. 1978లో ఎస్ఎఫ్ఐ ఆల్ఇండియా జాయింట్ సెక్రెటరీగా, ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ ఆల్ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అనతికాలంలోనే సీపీఐ (ఎం)లో చేరి, ఆ పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరిగా గుర్తింపు సాధించారు. 1984లో ఆ పార్టీ సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యారు. సీపీఐ (ఎం) జనరల్ సెక్రెటరీగానూ సేవలందించారు. 2005లో పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఏచూరి దేశ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తారు. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఏచూరి ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదు. తన జీవితాన్ని సర్వస్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ధారపోశారు.
ఏచూరి విద్యావంతుడు, గొప్ప రాజకీయ నాయకుడే కాకుండా, ఒక ఉత్తమ రచయిత కూడా. ఆయన అనేక పుస్తకాలను రచించారు. వాటిలో చాలావరకు పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్త్తున్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి ఏచూరి సీతారాం పరమపదించడంతో ఈ దేశం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది.
బసవరాజు నరేందర్ రావు
99085 16549