హద్దులు దాటిన సీఎం దూషణలు
ప్రజాస్వామ్యంలో మాటలకు అపారమైన శక్తి ఉంటుంది. ఒక పాలకుడు వాడే ప్రతీ పదం కేవలం భావప్రకటనకు సాధనం మాత్రమే కాదు, అది ఆ సమాజ నైతిక స్థాయి, పాలనా సంస్కృతి, ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అధికారంలో ఉన్నవారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే తీరు యావత్తు రాష్ర్టానికీ దిశానిర్దేశం చేయాలి.
ప్రజాస్వామ్యంలో మాటలకు అపారమైన శక్తి ఉంటుంది. ఒక పాలకుడు వాడే ప్రతీ పదం కేవలం భావప్రకటనకు సాధనం మాత్రమే కాదు, అది ఆ సమాజ నైతిక స్థాయి, పాలనా సంస్కృతి, ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అధికారంలో ఉన్నవారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే తీరు యావత్తు రాష్ర్టానికీ దిశానిర్దేశం చేయాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా, సాధారణ ప్రజల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. నిన్నటివరకు తనను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీ నాయకులను పైనే తిట్లు ప్రయోగించగా, తాజాగా జరిగిన సిద్దిపేట సభలో సొంత పార్టీ శాసనసభ్యులపై కూడా మాటలదాడి చేయడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు విధానపరంగా, హుందాగా ఉండాలి. వ్యక్తిగత స్థాయికి దిగజారి, దుర్భాషలకు తావిచ్చేలా ఉండకూడదు. ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి మాటల్లో సంయమనం లోపించినప్పుడు, ఆ ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపైనా పడుతుంది. రాజకీయ ప్రత్యర్థులపై దూషణల వల్ల పాలన గౌరవం మసకబారుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రను, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సంప్రదాయాలను పరిశీలిస్తే, వాడీవేడీ చర్చలు జరిగినా సభా గౌరవాన్ని నిలబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి నేతలు తీవ్రమైన ఆరోపణలు, ప్రతివిమర్శలు చేసుకున్నప్పటికీ, సభలో చర్చల తీరు, చమత్కారాలు, హుందాతనం ఒక స్థాయిలో ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి శాసనసభలోనూ కె.చంద్రశేఖర్‌రావు, జానారెడ్డి వంటి సీనియర్ సభ్యుల మధ్య సాగిన వాడీవేడీ చర్చల్లోనూ సిద్ధాంతపరమైన, విధానపరమైన వాదనలు వినిపించేవి. అయితే, ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి మాటల స్థాయి దిగజారుతుండటం, రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ సభ్యులపైనా ఆగ్రహావేశాలతో వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి మంచిది కాదు.
రాజకీయ విమర్శలకు ఒక స్పష్టమైన హద్దు, మర్యాద ఉండాలి. ప్రభుత్వ విధానాలు, పరిపాలనా నిర్ణయాలు, ఆర్థిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లోని లోపాలపై ప్రశ్నించడం ప్రతిపక్షం హక్కు. వాటికి సమాధానం ఇవ్వడం అధికార పక్షం బాధ్యత. కానీ, ఆ చర్చలు విధానాల చుట్టూ కాకుండా, వ్యక్తుల వ్యక్తిగత జీవితాల చుట్టూ, కించపరిచే పదజాలం చుట్టూ తిరిగినప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. రేవంత్‌రెడ్డి పలు వేదికలపై ప్రత్యర్థులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, సొంత శాసనసభ్యులపై చేస్తున్న హెచ్చరికలు రాజకీయ సంస్కృతిని కలుషితం చేస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి నోట వచ్చే మాటలు పదిమందికీ ఆదర్శంగా నిలువాలి. నాయకులే హద్దులు దాటి దూషణలకు దిగితే, ఇక సామాన్య శ్రేణుల్లో సంయమనం ఎలా ఆశించగలం? మన దేశ పార్లమెంటరీ చరిత్రను పరిశీలిస్తే, సిద్ధాంతపరమైన విభేదాలు, రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ఆనాటి నేతలు పాటించిన హుందాతనం నేటి తరానికి ఒక గొప్ప పాఠం.
నాటి పార్లమెంటరీ, శాసనసభ సంప్రదాయాలను నేటి నేతలు గుర్తుచేసుకోవాలి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య విధానపరమైన అభిప్రాయభేదాలు ఉండవచ్చు. కానీ, విధానాలపై పోరాటం కాస్తా వ్యక్తులపై దాడిగా మారినప్పుడు అసలు సమస్యలు పక్కదారి పడుతాయి.
ప్రజల జీవన ప్రమాణాలు, ఉద్యోగ కల్పన, రైతుల సంక్షేమం, విద్య, వైద్యం వంటి కీలక అంశాలపై జరుగాల్సిన చర్చ, ఎవరు ఎవరిని ఏ పదంతో తిట్టారు అనే అంశం వైపు మళ్లడం సమాజానికి ఏ రకంగానూ మేలు చేయదు. ముఖ్యమంత్రి పదవి కేవలం ఒక పార్టీకో, ఒక వర్గానికో పరిమితమైనది కాదు. అది రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఆ పదవిలో ఉన్నవారు తమ భాషను మరింత పరిణతి, సంయమనంతో తీర్చిదిద్దుకోవాలి. విమర్శలను ఎదుర్కోవడానికి బలమైన విధానాలు, స్పష్టమైన పాలనా ఫలితాలు ఉండాలి తప్ప, తిట్లు, దూషణలు సరికాదు. రాజకీయాలు ఉన్నతంగా, విలువలకు కట్టుబడి ఉన్నప్పుడే ప్రజలకు వాటిపై విశ్వాసం నిలుస్తుంది. మాటల తూటాలకు బదులుగా, ఆలోచనల పదునుతో, హుందాతనంతో ముందుకు సాగినప్పుడే ప్రజాస్వామ్యానికి, పాలకులకు గౌరవం దక్కుతుంది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకురాలు)
సబితా ఇంద్రారెడ్డి
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

