తెలంగాణలో గత ముప్పై రోజుల్లోనే ఆరుగురు పోలీసులు తమ విలువైన ప్రాణాలను చేజేతులా నాశనం చేసుకున్నారు. మొన్న కూడా ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరంపర ఇంతటితో ఆగాలి. ప్రియమైన పోలీసు మిత్రులారా…: గత ముప్పై ఏండ్లుగా నేనూ ఆయుధాల మధ్యనే బతుకుతున్నా. సర్వీసులో ఎన్నో చెప్పుకోలేని అవమానాలు, నిరాశలు, సహచరుల అకాల మరణాల వంటి ఎన్నో బాధలు ఎదురయ్యాయి. కొన్ని నెలల తరబడి పోస్టింగ్ ఇవ్వకుండా నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు కూడా. అయినా నేను ఎన్నడూ మద్యానికి బానిస కాలేదు. నాకెన్నడూ ఆత్మహత్య చేసుకోవాలనిపించలేదు. భవిష్యత్తులో కూడా నాకు ఆ ఆలోచన రాదు. ఆ రహస్యం ఏమిటో మీకు చెప్పాలని ఉంది. దీనివల్ల మీరు, మీ కుటుంబాలు సజీవంగా, సంతోషంగా ఉంటాయనే చిన్న ఆశ, నమ్మకం నాకున్నది.
నేను ఐపీఎస్ అధికారిని అయినా, నాదీ మీ అందరి లాంటి నేపథ్యమే. మారుమూల ప్రాంతాల్లో చదవడం, మంచి అవకాశాల కోసం నగరాలకు రావడం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏదో సాధించాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు చదవడం, చివరికి విజయం సాధించడం… తర్వాత పోలీసు అకాడమీలో ట్రైనింగ్ ఒక గొప్ప అనుభూతి . అది జీవితానికి ఒక గొప్ప క్రమశిక్షణను అలవాటు చేసింది. మూడు దశాబ్దాలుగా నాకు వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని (పోలీసు ఉద్యోగం) చేతనైనంత మేర ప్రజలకు మేలు చేయడానికే ఉపయోగించాను. మీరు కూడా అలాగే వాడాలి. ఈ విషయాన్ని చాలారోజుల తర్వాత విక్టర్ ఫ్రాంకెల్ రాసిన ‘అర్థం కోసం అన్వేషణ’ పుస్తకంలో చదివాను. మీరు కూడా చదవండి.
మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపించదు. నేను పోలీసు ఉన్నతాధికారి కావడం వల్ల నేను పుట్టి పెరిగిన ఊరు చివరలో ఉన్న మా కాలనీ ప్రజలకు, నా స్నేహితులకు, ఒక గుర్తింపు వచ్చింది. నేను పోలీసు వాహనంలో మా ఊరికి పోయినప్పుడు మా బస్తీ ప్రజల ఆనందానికి అవధుల్లేవు. మీ అందరికీ ఇలాంటి అనుభవాలే ఎదురై ఉంటయి. మీరందరూ, మీ మీ సమూహాల్లో సెలబ్రిటీలు. మీ తల్లిదండ్రులు మీకు తెలవకుండా మీ గురించి చాలా గొప్పగా ఊర్లో చెప్పుకుంటరు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మీ కుటుంబాలకు, మీ సమాజానికి, సమూహానికి ఒక గొప్ప బలం. మనంతటికి మనం ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ల పరిస్థితి ఏమిటి? ఆలోచించండి. అసలు ప్రతిరోజు చావులను ఎఫ్ఐఆర్లు, పంచనామాలు, పోస్టుమార్టంల రూపంలో చూసే మనకు చావాలన్న ఆలోచన రావడమే విడ్డూరంగా ఉన్నది! అయినా, మనుషుల ప్రాణాలను కాపాడటానికి జీతం తీసుకునే మనం, మన ప్రాణాలు మనమే తీసుకోవడం ఏమిటి?
మీకు తెలుసా?: ప్రతిరోజూ మన వల్ల మనకు తెలియకుండా ఎన్నో జీవితాలు సురక్షితంగా ఉంటాయి. గొప్ప విలువ ఉన్న ఇలాంటి జీవితాన్ని, ఒక పిరికి ఆలోచనతో, క్షణికావేశంలో నాశనం చేసుకోవద్దు. మనం చేసే చిన్న చిన్న తప్పుల గురించి రోజుల తరబడి ఆలోచించే సమయం ఎవరికీ లేదు. తప్పులను డిలీట్ చేసుకొని మనం ముందుకు సాగాల్సిందే. నిజం చెప్పాలంటే ఎవరి బతుకుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆరోగ్యం బాగా లేకపోతే డాక్టర్ దగ్గరికి పోవాలి. మరో మహిళనో/ మరో పురుషుడో మన జీవితాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తే వెంటనే మన జీవిత భాగస్వామితో ఆ విషయాన్ని నిర్మొహమాటంగా పంచుకోవాలి, పరిష్కారం కనుక్కోవాలి. అంతేకానీ, అందరికీ తెలుస్తుందని భయపడి ప్రాణాలు తీసుకుంటే మీ పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతారు కదా?
నా అనుభవంతో పాటు కొంతమంది నిపుణులు, పోలీసు అధికారులతో మాట్లాడి కింది సలహాలు ఇస్తున్నా ను. దయచేసి చదివి, పాటించండి.
పోలీసు ఉన్నతాధికారులకు విన్నపం
-డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్