ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనాపరంగా వేసే ప్రతి అడుగు వెనుక గత ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలని లేదా ప్రజల్లో బీఆర్ఎస్ నాయకుల ప్రాబల్యాన్ని తగ్గించాలనే లక్ష్యమే దాగి ఉంటోంది. అదే కోణం ఇప్పుడు జిల్లాల పునర్విభజన అనే అంశంలోనూ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన తొలినాళ్లలోనే రేవంత్ రెడ్డి తన మనసులో దాగివున్న ఈ విషయాన్ని బయటపెట్టినా తగిన అవకాశం కోసం కాలం గడుపుతూ వచ్చారు. ఈ నెల 6వ తేదీన సచివాలయంలో రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం క్యాలెండర్‌ను విడుదల చేస్తూ సీఎం రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరిస్తామని ప్రకటించారు. ఆ సమావేశానికి వచ్చిన గెజిటెడ్ ఆఫీసర్లలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఉంటారు కాబట్టి జిల్లాల పునర్విభజన అనే విషయాన్ని అక్కడ బయటపెడితే బాగుంటుందనుకున్నారేమో. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలే కాకుండా బీజేపీ వాళ్లు కూడా భగ్గుమన్నారు.
ప్రజల నుండి ఎలాంటి విజ్ఞప్తులు లేకున్నా..గత ప్రభుత్వం చేసిన ఈ పునర్విభజన వల్ల ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రేవంత్ అదే సభలో అన్నారు. ఒక్కో జిల్లా రెండు, మూడు నియోజకవర్గాల్లో భాగమైనందున సమీక్ష సమావేశాల్లో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు పదే పదే మీటింగులకు రావాల్సి వస్తోందని ఆయన అన్నారు. అయితే, సీఎం చేసిన ఈ వాదనలో ఎలాంటి బలం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 110 అసెంబ్లీ నియోజక వర్గాలు, 33 జిల్లాలు ఉన్నాయి కనుక ఒక్కో జిల్లా రెండు, మూడు నియోజకవర్గాల్లో ఉండే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక జిల్లా ఏర్పాటు చేయాలనే తలంపు ముఖ్యమంత్రి మనసులో ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదేదో గురువు వెనుక శిష్యుడు గుడ్డిగా నడిచే తప్పటడుగులా ఉంది.
ఉదాహరణకు..పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాంతాలు ఉన్నాయి. మొదటి మూడు పెద్ద ప్రాంతాలు. జగిత్యాల, మంచిర్యాల జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేశారు. జిల్లా కేంద్రాల స్థాయిలో ఆ పట్టణాలు పెరగడమే కాకుండా వాటి చుట్టూ ఎన్నో గ్రామాలూ ఉన్నాయి. చివరకు వారి కాంక్ష తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీరింది. కరీంనగర్-మంచిర్యాలకు మధ్య ఉన్న పెద్దపల్లి కూడా జిల్లాగా మారిన తర్వాతే వృద్ధి చెందింది. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని త్యాగం చేయడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. కరీంనగర్‌కు 50 కి.మీ, నిజామాబాద్‌కు 100 కి.మీ. దూరంలో జగిత్యాల ఉంటుంది. కరీంనగర్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా పెరిగాక జిల్లా ఆవశ్యకత ఏర్పడింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎంత కోరుకున్నా జగిత్యాలకు జిల్లా భాగ్యం దక్కలేదు. జగిత్యాల జిల్లా కావాలంటే ‘ఫలానా పార్టీ’కే ఓటు అనే ఎన్నికల నినాదం కూడా పుట్టింది. అయితే, దశాబ్దాల నాటి ఆ ప్రాంతవాసుల కల తెలంగాణ ఏర్పడ్డాక సాధ్యపడింది. ఎట్టకేలకు జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించడంతో ప్రజలు ఎంతో సంతోషించారు. కలెక్టర్, సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ లాంటి జిల్లా కార్యాలయాల బోర్డులు చూసి జనం మురిసిపోయారు. ఇది ఒక్క కొత్త జిల్లా ప్రజలకే పరిమితమైన భావోద్వేగం కాదు. యావత్ తెలంగాణలోని 33 జిల్లాల ప్రజలు పొందిన అనుభూతి ఇది.
జిల్లాల సంఖ్యను పెంచే సమయంలో అధికారుల ఆవశ్యకత, కార్యాలయ భవంతులు, సిబ్బంది, పెరిగే ఖర్చు అన్నీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా వచ్చాయి. స్వరాష్ట్రం వచ్చాక ప్రజలు అధికారులను కలిసేందుకు ఇబ్బందులు పడకూడదు అనే ఎంతో చక్కనైన ఆలోచనతోనే కేసీఆర్ ముందడుగు వేశారు. ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని బెజ్జూరు ప్రాంతవాసులు తమ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మధ్యలో ఓ రాత్రి గడపవలసి వచ్చేది. ఇప్పుడు కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు ఏర్పడడం వల్ల ఆ వెనుకబడిన ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. అలాంటి ఈ సౌకర్యాన్ని ఎత్తివేయాలని అనుకోవడం తిరోగమన చర్యే అవుతుంది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 10 జిల్లాలు, 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలు ఉండేవి. బీఆర్ఎస్ పాలనలో అవి 33 జిల్లాలు, 76 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలుగా ఏర్పడ్డాయి. తొలుత 31 జిల్లాలు ఏర్పడ్డాక వాటిలో 11 అక్టోబర్ 2016 నుండి కొత్త పాలన మొదలైంది. మళ్లీ ఫిబ్రవరి 2019లో నారాయణపేట, ములుగు జిల్లాలు ఏర్పడి మొత్తం జిల్లాలు 33 అయ్యాయి.
అన్ని జిల్లా కేంద్రాల్లో కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ భవంతుల నిర్మాణం జరిగింది. అక్కడక్కడా ఉండే జిల్లా ఆఫీసులు అన్నీ ఒకే గొడుగు కిందకి వచ్చాయి. ఒక క్రమబద్ధంగా సాగుతున్న ఈ వ్యవస్థను హేతుబద్ధీకరణ పేరుతో ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేయాలని చూస్తోంది. ఇంకా ప్రజలు పాత, కొత్త జిల్లాల సర్దుబాటులో ఉన్న సమయంలో మరో మార్పు తెచ్చి ఇంకా తికమక పెడితే కోలుకోవడానికి కష్టమవుతుంది.
33 చోట్ల జిల్లా కార్యాలయాల నిర్వహణ విషయానికొస్తే.. సిబ్బంది, ఖర్చు దృష్ట్యా ప్రభుత్వంపై భారమే కానీ ప్రజల సౌలభ్యం కన్నా ప్రభుత్వాలకు ఏదీ ప్రాధాన్యత కాకూడదు. జిల్లా అధికారులను కలిసేందుకు దూర ప్రాంతాలకు చెందిన ప్రజలకు అయ్యే కష్టనష్టాలు, వ్యయ ప్రయాసల కన్నా ప్రభుత్వం మోసే భారం ఎక్కువ కాదు. ఈ నేపథ్యంలో గత పదేండ్లుగా సవ్యంగా ఉన్న వ్యవస్థను చిన్నాభిన్నం చేసే అవసరమే లేదు. వరంగల్, హనుమకొండ జిల్లా కలిపి ఒకటిగా వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానికులు కొందరు కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారి డిమాండ్లు..అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉంటే ప్రభుత్వం ఆ ఒక్క ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. దాని కోసం రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేయవలసిన అవసరం లేదు. ప్రజల విజ్ఞప్తులపై అధ్యయనం జరిపేందుకు రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని, ఆ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజల సూచనలు, సలహాలు తీసుకుంటుందని సీఎం అన్నారు.
ఏ జిల్లా ప్రజలైనా వచ్చిన జిల్లాను పోగొట్టుకోరు. మరో జిల్లాలో తమను కలపమనే డిమాండ్లు వస్తే వాటిని తీర్చడానికి చాలా అధ్యయనాలు చేపట్టవలసి వస్తుంది. రాష్ట్రమంతా ప్రయోగశాలగా మార్చకుండా ఎక్కడైనా హేతుబద్ధమైన డిమాండ్లు ఉంటే ప్రజల ఏకాభిప్రాయంతో కొద్దిపాటి మార్పులు చేపట్టవచ్చు. కానీ, రాజకీయంగా బీఆర్ఎస్ నేతలకు పేరు ప్రఖ్యాతులున్న ప్రాంతాలను ముక్కలు చేసి వారికి దక్కకుండా చేయాలనుకునే కుట్ర గానీ ప్రభుత్వం దృష్టిలో ఉంటే మాత్రం ప్రజలే దానికి సమాధానం చెబుతారు.
బద్రి నర్సన్