ఈ నెల 2, 3, 4 తేదీలలో ఆసక్తికరమైన పరిణామాలు కొన్ని చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2వ తేదీన కేరళం ఎన్నికల ప్రచారంలో తమ కాంగ్రెస్ నాయకత్వాన గల యూడీఎఫ్ పక్షాన పాల్గొంటూ అక్కడి సీపీఎం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విజయన్ ఎల్డీఎఫ్ నాయకుడు. ఆయన రేవంత్ వ్యాఖ్యలకు స్పందించి 3వ తేదీన ఎదురు విమర్శలు చేశారు. ఆ మరునాడు 4వ తేదీన తెలంగాణలో జరిగిందేమిటి? కేరళం ఎల్డీఎఫ్లో సీపీఎంతో పాటు సీపీఐ కూడా భాగస్వామి. విజయన్ ఎదురు విమర్శల వార్తలు తెలుగు పత్రికలన్నీ వేశాయి. సీపీఎం పత్రిక ‘నవ తెలంగాణ’ మొదటి పేజీలో బ్యానర్ చేయగా సీపీఐ దినపత్రిక ‘ప్రజాపక్షం’ మొత్తం 12 పేజీలలో ఎక్కడా ఒక్క అక్షరమైనా వేయలేదు. ఇక్కడ కాంగ్రెస్‌తో గల ‘మిత్రపక్ష ధర్మం’ అందుకు కారణం కావచ్చునా?
4వ తేదీ నాటి విచిత్రాలు ఇంకా ఉన్నాయి. విజయన్ స్పందనను ఒక అక్షరమైనా వేయకపోవటమే కాదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటన ఏదీ వారి పత్రికలో కన్పించలేదు. ప్రతి దానిపై ఉత్సాహంగా వ్యాఖ్యానించే సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షుడు కే నారాయణ హనుమకొండలో మరేవో మాట్లాడారు గాని ఈ విషయమై ప్రస్తావన అయినా చేసినట్లు లేరు.
ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మామూలే. కానీ విమర్శల తీరును బట్టి ఒక్కోసారి తేడా వస్తుంది. ఆ విధంగా రేవంత్‌రెడ్డి కేరళ ప్రభుత్వ విధానాలు, పరిపాలన వైఫల్యాలపై విమర్శలు చేసి ఉంటే ఎవరూ అభ్యంతర పెట్టనక్కరలేదు. అదే విధంగా తెలంగాణలో తమ ప్రభుత్వం చేసిన మంచి గురించి ప్రచారం చేసినా అది ఆమోదించదగినదే. ఒకవేళ కేరళం ప్రభుత్వ వైఫల్యాలన్నవి నిజంగా వైఫల్యాలు కాకున్నా, తమ ప్రభుత్వపు మంచి అన్నది నిజంగా మంచి కాకపోయినా, ఆ మాటలు పరిపాలనకు మాత్రమే పరిమితమై సాగితే ఎన్నికల ధోరణి అనుకొని ఉపేక్షించవచ్చు. కానీ విమర్శలు వ్యక్తిగతంగా మారితే విషయం మరొకటి అవుతుంది.
రేవంత్‌రెడ్డి చేసింది అదే. ఆయన నోటికి అడ్డ్డూ అదుపు లేదని, ఒక బాధ్యతాయుతమైన స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా సంస్కారం అబ్బలేదని ఈసరికి అందరికీ అర్థమైంది. ఆ ధోరణిని తెలంగాణకు పరిమితం చేయకుండా దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశమంతటా ప్రదర్శిస్తున్న ఆయన ఇప్పుడదే పని కేరళంలోనూ చేశారు. తను అన్నదాని ప్రకారం విజయన్‌ది కుటుంబ పాలన, అవినీతి పాలన, అసమర్థ పాలన. రాష్ర్టాన్ని ఆయనా, ప్రధాని మోదీ కలిసి పాలిస్తున్నారు. ఆయనకు కేసీఆర్‌కు పోలికలున్నాయి.
రేవంత్ మరొకటి కూడా అన్నారు. కేరళం ప్రజలకు మేనిఫెస్టో ద్వారా ఇస్తున్న గ్యారెంటీల వంటివి తెలంగాణలోనూ ఇవ్వటమేగాక అమలుపరిచామని, కేవలం గ్యారెంటీలను విమర్శిస్తున్న వారు, తమ గారంటీలను తాము తెలంగాణలో ఎట్లా అమలు చేస్తున్నామో చూసేందుకు రావాలని కోరారు. అక్కడి గ్యారెంటీలలో తెలంగాణ తరహాలోనే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, కాలేజీ విద్యార్థినులకు నెలకు వెయ్యి నగదు, పింఛన్లను 3 వేలకు పెంచటం, ప్రతి కుటుంబానికి పాతిక లక్షల ఆరోగ్య బీమా, యువతకు స్వయం ఉపాధి కోసం ఐదు లక్షల వడ్డీ లేని రుణాల వంటివి ఉన్నాయి. ఇందుకు విజయన్ స్పందిస్తూ చెప్పినవి ఈ విధంగా ఉన్నాయి. దేశంలో దుర్భర దారిద్య్రాన్ని అధిగమించిన తొలి రాష్ట్రం మాది. అత్యంత తక్కువ అవినీతి గల రాష్ట్రం మాదే. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు నడిపి కూలగొడుతున్న వ్యక్తి పరిపాలన, సంక్షేమం గురించి నీతులు చెప్పనక్కరలేదు. నీతీ ఆయోగ్ నివేదిక ప్రకారం 20 25 చివరి నాటికి కేరళం దారిద్య్ర రేటు 0.55 శాతం కాగా తెలంగాణది 5.88 శాతం. తమ అక్షరాస్యత 95.3 శాతం కాగా తెలంగాణది 76.9 శాతం. తమ సిబ్బందికి జీతభత్యాలు, పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేని వ్యక్తి, గ్యారెంటీలు అమలు చేయలేని నాయకుడు తమ రాష్ట్ర పత్రికలలో కోట్లాది రూపాయల ఖర్చుతో అడ్వర్టయిజ్మెంట్లు ఇవ్వ టం హాస్యాస్పదమని అన్నారాయన.
ఇద్దరు ముఖ్యమంత్రుల మాటలను నిష్పాక్షికంగా పరిశీలించే ఎవరైనా అందులోని నిజానిజాలు ఏమిటో తేలికగా చెప్పగలరు. సర్వతోముఖ అభివృద్ధికి, సంక్షేమానికి ‘కేరళ నమూనా’ అన్నది భారతదేశంలోనే గాక విదేశాలలోనూ కొన్ని దశాబ్దాలుగా పేరుబడింది. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడింది ఇటీవలనే అయిన స్థితిలో, అప్పటికీ స్వల్ప కాలంలోనే జాతీయస్థాయిలో పలు ర్యాంకులు సాధించినప్పటికీ, రెండింటిని పోల్చలేము. గత రెండేళ్లుగా ఇక్కడ హామీల అమలు తీరేమిటో, అభివృద్ధి, సంక్షేమాలేమిటో దేశమంతా ఇప్పటికే తెలిసిపోయింది. ఇటువంటి పరిస్థితుల మధ్య రేవంత్‌రెడ్డి కేరళంకు వెళ్లి మేనిఫెస్టో విడుదల చేయటం, హామీలను తప్పక అమలు చేయగలమనటం, ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం, యూడీఎఫ్‌కు ఓటు వేయండి అని కోరటం వంటివి ఆక్షేపించవలసినవి కావు. కానీ ఆయన తన పరిమితులను దాటి లేని కష్టాలు కొనితెచ్చుకున్నారు. విజయన్ విమర్శలకు ఆయన సమాధానం చెప్పగలరా? ఇదే లోగడ కూడా జరిగింది. రేవంత్‌రెడ్డి ఢిల్లీ, మహారాష్ట్ర, బిహార్ ఎన్నికల ప్రచారంలో ఇంతే ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణలో గ్యారెంటీలను ఎంత గొప్పగా అమలు చేస్తున్నారో, అభివృద్ధి, సంక్షేమాలు తమ ఆధ్వర్యంలో ఎంత ఘనంగా ఉన్నాయో భారీ ప్రకటనలను భారీ ఖర్చుతో ఇచ్చారు. అక్కడి గ్యారెంటీల అమలు కూడా తన బాధ్యత అని భరోసాలు కూడా చెప్పారు. చివరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిచోటా ఓడటమేగాక సీట్ల సంఖ్య పోయిన మారు కన్నా తగ్గింది. కేరళంలో వరసగా రెండుసార్లు గెలిచిన ఎల్డీఎఫ్ను ఈ మూడవసారి అయినా ఓడించాలని రేవంత్‌రెడ్డి పట్టుదల చూపుతున్నారు.
ప్రస్తుత చర్చ అంతా ఈ సందర్భంలో వస్తున్నది. కేరళం ముఖ్యమంత్రి గురించి, ఎల్డీఎఫ్ ప్రభుత్వం గురించి రేవంత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసి, అందుకు సమాధానంగా విజయన్ అంతే గట్టి సమాధానం ఇచ్చినప్పుడు, ఆ ప్రభుత్వంలో తాము కూడా భాగస్వాములుగా ఉన్న సీపీఐ అధికార పత్రిక తెలంగాణలో మౌనం వహించటం సహజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. కమ్యూనిస్టు పార్టీలు కొంతకాలం క్రితం వరకు పశ్చిమ బెంగాల్, త్రిపురతో పాటు కేరళంలో అధికారంలో ఉండేవి. ఇపుడు మిగిలింది కేరళం ఒక్కటే.
తక్కిన రెండుచోట్ల పూర్తిగా బలహీనపడ్డారు. అటువంటప్పుడు కేరళం ప్రభుత్వంపై ఈ తరహా విమర్శలను ఎంతమాత్రం ఆమోదించరాదు. అక్కడ సీపీఐకి 16 మంది ఎమ్మెల్యేలు, నలుగురు కేబినెట్ మంత్రులు ఉన్నారు. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయానికి భిన్నంగా పోయినసారి రెండోమారు గెలిచి అందరినీ ఆశ్చర్యపరచిన తర్వాత ఇపుడు మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అది జరిగేదీ లేనిదీ మనం చెప్పలేము గాని, ఈ వివరాలను బట్టి ఆ రాష్ట్రం ఉభయ కమ్యూనిస్టులకు మొత్తం దేశ రాజకీయాలలోనే ఎంత కీలకంగా మారిందో తేలికగా గ్రహించవచ్చు. అక్కడ ఓడితే సీపీఎంతోపాటు సీపీఐ కూడా దేశమంతటా మరింత దిక్కుతోచని స్థితిలో పడుతుంది.
విజయన్ స్పందనను ఒక్క అక్షరమైనా వేయని సీపీఐకి ఈ స్పృహ ఉన్నట్లా? వారికి ఇక్కడ కాంగ్రెస్‌తో, రేవంత్‌రెడ్డితో చాలా మంచి సంబంధాలున్నాయి. నడిసంద్రంలో మునుగుతుండిన తమకు పోయిన మారు ఆయన ఒక అసెంబ్లీ సీటు ఇచ్చి గెలిపించి ఒడ్డుకు చేర్చటం నిజమే. అందుకు తన పట్ల వారు అడుగడుగునా కృతజ్ఞతా భావాన్ని చూపటాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రభుత్వం గ్యారెంటీలు అమలు పరచకపోయినా, పేదల భూములు ఆక్రమించటం, బుల్డోజర్లతో వారి ఇళ్లు కూలగొట్టడం జరిగినా, గిరిజనుల ఊర్లపై అర్ధరాత్రి దాడులు జరిపి, వారి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినా, మూసీ ప్రక్షాళన పేరిట వందలాది పేదలను ఉడుకుతున్న అన్నం గిన్నెలతో సహా వీధులపాలు చేసినా విన్నకుండటాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, వారు ఒక కౌన్సిల్ సీటు కోసమో, ఒక కార్పొరేషన్ కోసమో, పంచాయతీ సర్పంచులు, మున్సిపల్ వార్డుల కోసమో ‘మిత్ర ధర్మం’ అనే మాట నిరంతరం అంటూనే ఉంటారు గనుక ఇదంతా తెలిసిన కథే. ఇపుడు కొత్తగా తెలిసి వస్తున్నదేమంటే వారికి కేరళం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ గౌరవ మర్యాదలను కాపాడుకునేందుకు ప్రయత్నించడం కన్నా కూడా రేవంత్‌రెడ్డితో, ఇక్కడి కాంగ్రెస్‌తో ‘మిత్ర ధర్మం’ ముఖ్యంగా మారింది.
4వ తేదీ నాటి విచిత్రాలు ఇంకా ఉన్నాయి. విజయన్ స్పందనను ఒక అక్షరమైనా వేయకపోవటమే కాదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటన ఏదీ వారి పత్రికలో కన్పించలేదు. ప్రతి దానిపై ఉత్సాహంగా వ్యాఖ్యానించే సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షుడు కే నారాయణ హనుమకొండలో మరేవో మాట్లాడారు గాని ఈ విషయమై ప్రస్తావన అయినా చేసినట్లు లేరు. జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి చండూరులోనూ అంతే. ఇంతకుముందు రాష్ట్ర కార్యదర్శి, ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అయిన చాడ వెంకటరెడ్డి జగిత్యాలలో మొక్కుబడిగా అన్న ఒక మాట, అందుకు సంబంధించిన వార్తలో ఎక్కడో అడుగున పడిపోయింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ మాత్రమే నాగర్‌కర్నూల్‌లో గట్టిగా విమర్శించి పార్టీ పరువు కొంత కాపాడారు. మరొక గమ్మత్తు ఏమంటే, సీపీఐ ఆంధ్ర రాష్ట్ర మాజీ కార్యదర్శి, ప్రస్తుతం జాతీయ కార్యదర్శి అయిన కే రామకృష్ణ చేసిన ఘాటైన ఖండన కూడా సీపీఎం పత్రికలో, ఇతర పత్రికలలో తప్ప సీపీఐ పత్రికలో రాలేదు. ఇంతకన్నా ఇంకా చెప్పవలసింది లేదేమో.
-టంకశాల అశోక్