పంచ పాండవులెందరంటే మంచం కోళ్ల లెక్క ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపించి, ఒకటి రాశాడంట వెనుకటికొకడు. తెలంగాణలో రేవంత్ సర్కారు చేసిన కులగణన సర్వే కూడా అచ్చం అలాంటిదే. సమగ్ర సర్వే పేరిట చేపట్టిన గణనలో అసమగ్ర వివరాలు పొందుపరచడం రేవంత్‌కే చెల్లింది. బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి రేవంత్‌కు ఏ మాత్రం లేదు. అందుకే, సర్వేను తప్పుల తడకగా చేసి, కాకి లెక్కలతో మమ అనిపించారు.
బీసీ వర్గాల ఓట్ల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాహుల్‌గాంధీతో సహా కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మిన బీసీ ప్రజలు ఆ పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేశారు. నమ్మినవాళ్లను నట్టేట ముంచినట్టు తమను గద్దెనెక్కించిన బీసీలను కూడా రేవంత్‌రెడ్డి నిండా ముంచిండు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తూనే తెరవెనుక గోతులు తవ్విండు. ఇచ్చిన హామీని ఎగ్గొట్టేందుకు విఫలయత్నం చేస్తున్నడు.
ఒక విధానమనేది పాటించకుండా, లెక్కాపత్రం లేకుండా చేసిన కులగణన వల్ల బీసీలకు నష్టమే. సాధారణంగా కాలంతోపాటు జనాభా కూడా పెరుగుతుంది. 2014లో తెలంగాణ ఏర్పడినాక కేసీఆర్ సర్కార్ తొలిసారిగా చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం… రాష్ట్ర జనాభా 3.68 కోట్లు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ చేసిన కులగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3.70 కోట్లుగా తేలింది. అంటే గత పదేండ్లలో రాష్ట్ర జనాభా రెండు లక్షలు మాత్రమే పెరగడం వివాదాలకు తావిస్తున్నది. మన రాష్ట్ర వార్షిక జనాభా వృద్ధిరేటు 1.35 ఈ లెక్కన పదేండ్లలో రాష్ట్ర జనాభా 4.18 కోట్లకు చేరాలి.
జనాభా వృద్ధిరేటు ఏ ఒక్క వర్గానికో పరిమి తం కాదు. జనాభా పెరుగుదలలో అన్నివర్గాల ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ, కాంగ్రెస్ సర్కా రు చేసిన సర్వేలో ఒక వర్గం జనాభా మాత్రమే భారీగా పెరగడం అనుమానాలకు తావిస్తున్న ది. జనాభా పెరుగుదలలో అప్పటికే రాష్ట్రంలో మెజారిటీ వర్గంగా ఉన్న సామాజిక వర్గానికి ఎక్కువ వాటా ఉండాలి. అయితే రాష్ట్రంలో అతి పెద్ద సామాజికవర్గమైన బీసీల జనాభా గత పదేండ్లలో 51 శాతం నుంచి 46 శాతానికి పడిపోవడం విడ్డూరం. రాష్ట్రంలో అతి తక్కువ గా ఉన్న ఓసీల జనాభా భారీగా పెరగడం చర్చనీయాంశం. సాధారణంగా ఓసీ సామాజిక వర్గ ప్రజలకు కుటుంబ నియంత్రణపై చాలా అవగాహన ఉంటుంది. అయితే, మన రాష్ట్రంలో మాత్రం ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గి ఓసీల సం ఖ్య పెరగడం గమనార్హం.
కల్యాణలక్ష్మి పథకం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 14 లక్షల జంటలు చెక్కులందుకున్నాయి. అంతేకాదు, 2017 నుంచి 2023 జూన్ వరకు సుమారు 14 లక్షల మంది తల్లులు కేసీఆర్ కిట్ అందుకున్నారు. ఈ లెక్కన ఒక్కో కొత్త జంటకు ఒకరు చొప్పున పిల్లలు పుట్టినా రాష్ట్ర జనాభా సుమారు 14 లక్షలకు పైగా పెరగాలి. కానీ రెండు లక్షలే పెరిగింది. అంతేకాదు, 20 24లో ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 3.28 కోట్ల మంది ఓటర్లున్నారు. కులగణన ప్రకారం రాష్ట్రంలో 3.70 కోట్ల మంది మాత్రమే ఉన్నట్టు కాంగ్రెస్ సర్కారు చెప్తున్నది. అంటే రాష్ట్రంలో 18 ఏండ్ల లోపు జనాభా 42 లక్షలు మాత్రమేనా? వాస్తవానికి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదు. అధికారంలోకి రావడం కోసమే కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించి, ఇప్పుడు ఏదో ఒక హడావుడి చేసి తప్పుడు లెక్కలతో చేతులు దులుపుకోవాలని చూస్తున్నడు. అందులో భాగంగానే మొద ట రాష్ట్ర బీసీ కమిషన్‌కు కులగణన బాధ్యతను అప్పగించారు. ఆ కమిషన్ అనేక జిల్లాల్లో పర్యటించింది కూడా. ఈ నేపథ్యంలో కోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాల్సి వచ్చింది. అంతేకాదు, కులగణన ప్రక్రియ డెడికేటెడ్ కమిషన్ ఆధ్వర్యంలో జరగలేదు. హడావుడిగా, అసమగ్రం గా చేసిన ఈ సర్వే వివరాలు సర్వోన్నత న్యాయస్థానం ముందు నిలువవని రేవంత్ రెడ్డి కి కూడా తెలుసు. అందుకే, అసెంబ్లీలో తీర్మా నం చేసి బంతిని కేంద్రం కోర్టులో పడేసి చేతు లు దులుపుకోవాలని చూస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వ తీరును మొదటినుంచి గమనిస్తున్న ప్రజలు ఈ సర్వేలో పెద్దగా పాల్గొనలేదు. అసంబద్ధమైన ప్రశ్నాపత్రం, వ్యక్తిగత గోప్య సమాచారాన్ని సేకరించడం, చాలామం ది తమ వివరాలు చెప్పేందుకు ఇష్టపడలేదు. కొందరు ప్రభుత్వంపై ఆగ్రహంతో అధికారుల ను నిలదీశారు. దీంతో హడావుడిగా 50 రోజుల్లోనే తూతూ మంత్రంగా సర్వే పూర్తిచేసి మమ అనిపించారు. ఎవరు చెప్పినా వినకుండా, 57కి పైగా ప్రశ్నలు గల సుదీర్ఘ ప్రశ్నపత్రాన్ని రూపొందించి, సరైన పూర్తి వివరాలు రాబట్టలేకపోయారు. గతంలో బీహార్ ప్రభుత్వం ఇలాంటి సర్వేను 10 నెలలు పైగా రెండు విడతల్లో చేసి సమగ్ర వివరాలు రాబట్టింది. 17 ప్రశ్నలనే సంధించిన బీహార్ ప్రభుత్వం కులాలవారీ వివరాలతో పాటు ఆర్థిక, విద్య, ఉద్యో గ, వృత్తిపరమైన సమాచారాన్ని కూడా వెల్లడించింది.
కులగణన జరగాలని, దామాషా పద్ధతిలో రిజర్వేషన్స్ ఇవ్వాలని, విద్య, ఉద్యోగరంగాల్లో ఉన్నట్టుగానే రాజకీయ రంగంలోనూ బీసీ వర్గీకరణ జరగాలని మొదటినుంచి నేను కొట్లాడు తూ, హైకోర్టులో పలుమార్లు కేసులు వేశాను. ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసి దాని ఆధ్వర్యంలో కులగణన చేపట్టాలని కోర్టు లో వాదించాం. మా వాదనలు విన్న న్యాయస్థానం 2024, ఆగస్టు 6న ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుచేయాలని, దాని ఆధ్వర్యం లో కులగణన చేయాలని రేవంత్ సర్కార్‌ను ఆదేశించింది. అయినప్పటికీ రేవంత్ ప్రభు త్వం మొద్దు నిద్ర వీడలేదు. హైకోర్టు ఆర్డర్‌ను మూర్ఖత్వంతో బేఖాతరు చేస్తూ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేసింది. దీంతో ఆర్.కృష్ణ య్య మళ్లీ అదే అంశంపై కోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్‌పై అక్టోబర్ చివరలో కోర్టు మళ్లీ అదే తీర్పు ఇచ్చింది. అప్పటికే నెలన్నరకు పైగా జాప్యం జరిగింది. ఆగస్టులో మొదటి తీర్పు వచ్చినప్పటికీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయకుండా నవంబర్ వరకు కావాలనే జాప్యం చేయడమే బీసీ కులగణన పట్ల రేవంత్ సర్కారుకు ఏ పాటి చిత్తశుద్ధి ఉన్నదో చెప్పేందు కు నిదర్శనం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నవంబర్ 4న రిటైర్డ్ బ్యూరోక్రాట్ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. నెలలోపే నివేదిక సమర్పిస్తామని రేవంత్ సర్కార్ గప్పా లు కొట్టింది. కానీ, మూడు నెలలు గడిచినా డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఇప్పటికీ బయట పెట్టలేదు. ఆ నివేదికతో సంబంధం లేకుండానే కులగణన చేపట్టింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక లేకుండా రిజర్వేషన్లపై ఏ విధంగా నిర్ధారణకు వస్తున్నారనేది రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి.
కులగణన సర్వే మొత్తం లోపభూయిష్టంగా జరిగింది. అందులో సంఖ్యాపరమైన తప్పులు చాలా ఉన్నాయి. సుమారు 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వమే చెప్తున్నది. అలాంటప్పుడు ఈ సర్వే ఎలా ప్రామాణికమవుతుంది. అంతేకాదు, బీసీల జనాభా భారీస్థాయిలో తగ్గిపోవడానికి కారణమేంటి? ఈ పదేండ్లలో లక్షల మంది చనిపోయారా? అదే జరిగితే వారి డెత్ సర్టిఫికెట్లు ఏమయ్యాయి?
రేవంత్ రెడ్డి తన అసమర్థతను, చేతకానితనాన్ని, బీసీల పట్ల ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి షబ్బీర్ అలీని ముందుపెట్టి డ్రా మా చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని షబ్బీర్ అలీ రేవంత్‌కు లేఖ రాయడం హాస్యాస్పదం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులను తెలుసుకొని, తద్వారా ఎలాంటి పథకాలు అమలుచేస్తే ప్రజలు వృద్ధిలోకి వస్తారనే అవగాహన కోసం నాడు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. ఆ సర్వే వివరాల ఆధారంగానే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, దళితబంధు, పింఛన్ల పెంపు, చేపపిల్లలు, గొర్ల పంపిణీ లాంటి అనేక బృహత్తర సంక్షేమ పథకాలను వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టారు. కేసీఆర్ నేతృత్వం లో పర్ క్యాపిటా ఇన్‌కం రూ.1.15 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెరిగిందంటే, దానికి కారణం వారి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన డాటా వివరాలతో ప్రజాభివృద్ధ్ది కార్యక్రమాలు చేపట్టడం వల్లే. పదకొండేండ్ల పాటు మొద్దు నిద్రలో ఉన్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు మేలుకొని బీసీ కోటా ఇవ్వడంలో తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ సర్కారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేపై బట్ట కాల్చి మీద వేయాలని చూస్తున్నది. విచారణ కచ్చితంగా జరగాల్సిందే కానీ, అది సమగ్ర సర్వేపై కాదు, రేవంత్‌రెడ్డి చేసిన కులగణనపై.
వందల కోట్లు ఖర్చుపెట్టి మరీ బీసీల సంఖ్యను ఎందుకు తక్కువ గా చూపెడుతున్నారు? దీని వెనకు న్న రాజకీయ కుట్ర ఏమిటి? ఫ్యూడ ల్ మనస్తత్వ కుట్ర చేస్తున్నదెవరు? వందల కోట్లు ఖర్చుపెట్టి చేసిన సర్వే పత్రాలను బీసీ సంఘాలు తగులబెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తదితర అంశాలపై మొదట సీబీఐ విచారణ జరగాలి.
బీసీల భావోద్వేగాలతో రేవంత్‌రెడ్డి ఆటలాడుతున్నారు. నాడు కామారెడ్డి డిక్లరేషన్‌లో 42 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు రాజ్యాంగ సవరణ అవసరమని చెప్పడం ఖండనీయం. రాజ్యాంగ సవరణ అవసరమని రేవంత్‌రెడ్డికి నేడు గుర్తుకొచ్చిందా? డిక్లరేషన్ ప్రకటించిన రోజు ఈ విషయం ఆయనకు తెలియదా? అసెంబ్లీలో తీర్మానం చేసిన నాడు దీనిపై ఎందుకు మాట్లాడలేదు? తీరా అమలుచేసే సమయానికి కేంద్రంపై నెపం నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం హేయం. ఇది రేవంత్ ప్రభుత్వానికి ఏ మాత్రం తగదు. ఇది ముమ్మాటికీ బీసీలను మోసం చేయడమే. ఇప్పటికైనా జరిగిన చారిత్రాత్మక తప్పిదాన్ని రేవంత్‌రెడ్డి అంగీకరించాలి. రీ సర్వే చేయించి ఆ తప్పులను సరిచేయాలి. లేకపోతే బీసీ ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరు.
‘మేమెంతో మాకంత’ అని బీసీ వర్గాలు నినదిస్తుండగా.. మాకేం సంబంధం, ‘మీకు మీరే.. మాకు మేమే’ అని కాంగ్రెస్ ప్రభుత్వం తెగేసి చెప్పేసింది. తెలంగాణలో నిర్వహించే కులగణన దేశానికే ఆదర్శంగా నిలవాలని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టాలనుకుంటున్న కులగణనకు ఆదర్శంగా నిలవాలని రాహుల్‌గాంధీ చెప్తున్న మాటలను రేవంత్‌రెడ్డి సర్కార్ తుంగలో తొక్కింది. ఏకంగా సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ సర్వేను తప్పుబడుతున్నారు. బీసీ సంఘాల మేధావులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. గతంలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సరైనదని ఎమ్మెల్సీ మల్లన్న కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనుకున్న సర్వే కాస్త ప్రభుత్వ వైఫల్యం వల్ల తప్పులకు నిదర్శనంగా మారింది.