ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మాటలను తానే ఉల్లంఘిస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆయన తీవ్రంగా స్పందించారు. మహిళ మృతికి బెనిఫిట్ షోనే కారణమని వాదించిన ఆయన, తాను ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ, అంతలోనే మాట మార్చారు.. సినీ పెద్దలతో సమావేశం తర్వాత తన ద్వంద్వ వైఖరిని అందరిముందు బయటపెట్టేసుకున్నారు.
అసెంబ్లీలో సినిమా ఇండస్ట్రీ, నటులపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను అధికారంలో ఉన్నంత వరకూ బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ల ధరలు పెంచబోమని చెప్పారు. కానీ, రెండు వారాల్లోనే యూటర్న్ తీసుకున్నారు. సినిమా పరిశ్రమను సమానంగా చూడాల్సిన ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రయోజనాలు, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. గత నెలలో అల్లు అర్జున్ అరెస్టు విషయంలో దుందుడుకుగా వ్యవహరించిన ముఖ్యమంత్రి జాతీయస్థాయిలో ఒక నటుడి అరెస్టు మీద స్టేట్మెంట్లు ఇవ్వడం రాజకీయ, సినీ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఇంకో అడుగు ముందుకేసి అసెంబ్లీలోనూ చర్చకు పెట్టారు. బాధితుల పట్ల సానుభూతి చూపడాన్ని ఎవరూ తప్పు పట్టట్లేదు కానీ, మిగతా వ్యవస్థలు చేయాల్సిన పనిని ముఖ్యమంత్రి తన చేతుల్లోకి తీసుకోవడమే ఇక్కడ అభ్యంతరం.
సినీ నటులు సరిహద్దుల్లో పనిచేయట్లేదని, చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న ప్రకటన అర్థరహితం. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే సినీ పరిశ్రమతో విభేదాల్ని కొనితెచ్చుకున్న రేవంత్ ప్రభుత్వం ఆనాటి నుంచి అదే ధోరణితో వ్యవహరిస్తున్నది. తన మంత్రివర్గ సహచరులు సినీ ప్రముఖుల కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడం, హైకోర్టు స్టే ఇచ్చినా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు లాంటివి ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెంచాయి. తమ ప్రభుత్వాన్ని సినిమా ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదన్న దుగ్ధతోనే అల్లు అర్జున్ అరెస్టు విషయంలో అతిగా స్పందించారన్న అపవాదును రేవంత్‌రెడ్డి మూటకట్టుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు బెనిఫిట్ షోనే కారణమని నిర్ధారించిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఉదయం నాలుగు గంటల షోకు ఎందుకు అనుమతినిచ్చింది? అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన ప్రకటనలకు విలువ లేకుండా పోయింది.
ధరల పెంపునకు అనుమతినిచ్చి తన వ్యాఖ్యలను తానే ఎందుకు ఉల్లంఘించారు? ఇంతకీ సినీ పెద్దలతో సీఎం జరిపిన సమావేశం ద్వారా ప్రభుత్వం ఏం సాధించింది? ఇండస్ట్రీకి ఎలాంటి లాభం కలిగింది? ప్రతి విషయంపైనా ముఖ్యమంత్రి ద్వంద్వ విధానాలు అనుసరిస్తారన్న ప్రతిపక్షాల విమర్శల్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది. లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడం, మాట వినని వాళ్లను బెదిరించడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారింది.
అదే తరహాలో తెలుగు సినిమా ఇండస్ట్రీని భయపెట్టి లొంగదీసుకున్నారా? తనకు అనుకూలమైన వ్యక్తులకు ఒకలా, వ్యతిరేకులను మరోలా ట్రీట్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న దిల్‌రాజు చిత్రానికి అయాచిత లబ్ధి కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇది కచ్చితంగా క్విడ్ ప్రో కో కిందకే వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలు కలవకముందు చట్టం, న్యాయం, అందరికీ సమానమే అన్న రేవంత్‌రెడ్డి, వాళ్లు కలిశాక పరిస్థితులు ఎందుకు మారాయో ప్రజలకు సమాధానం చెప్పాలి.