భారత్‌లో ఎన్నికల వ్యవస్థ ఎంతో కీలకమైనది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే అతికొద్ది సంస్థల్లో భారతీయ ఎన్నికల సంఘం కూడా ఒకటి. ఓటర్ల జాబితా తయారీ నుంచి రాజకీయ పార్టీలకు గుర్తింపు, చిహ్నాల కేటాయింపు, ఎన్నికల నిర్వహణ వరకు ఎన్నో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించే ఎన్నికల కమిషన్‌కు ఆర్టికల్ 324 ద్వారా స్వయంప్రతిపత్తిని అంబేద్కర్ కల్పించారు. అందుకే, కేంద్ర, రాష్ర్టాల్లో ఎంతటి బలమైన నాయకులున్నా మొన్నటివరకు ఎన్నికల కమిషన్ ఆయా పార్టీలకు, ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించలేదు.
గత దశాబ్ద కాలంగా ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ ఆధారాలను ప్రతిపక్షాలు బయటపెడుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఆ రాష్ట్ర ఎన్నికల్లో జరిగిన అవకతవకలే కారణమని, బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ వాడుకున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఇటీవల ఆరోపించారు. హర్యానాలో సుమారు 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దొంగ ఓట్ల సాయంతోనే హర్యానాలో సర్కార్‌ను బీజేపీ ఏర్పాటు చేసిందని కూడా చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పలు ఆధారాలను ఆయన బహిర్గతం చేశారు. అయితే, బ్రెజిల్‌కు చెందిన మోడల్ ఫొటోపై వివిధ పేర్లతో హర్యానాలో 22 చోట్ల ఓటు ఉండటాన్ని బట్టి చూస్తే, ఓటు చోరీ ఆరోపణలను నమ్మక తప్పని పరిస్థితి నెలకొన్నది. దీనిపై బ్రెజిల్ మోడల్ స్పందించారు. భారత్‌లో తన ఫొటోలతో ఓటర్ కార్డులు ఉండటాన్ని ఆమె ఖండించారు. ఇది మన దేశ ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలకు నిదర్శనం కాదా? అత్యున్నత విలువలు కలిగిన భారత రాజ్యాంగాన్ని విదేశీయుల ముందు అవమానించడం కాదా?
ఒకవేళ ఓట్చోరీ ఆరోపణల్లో నిజం లేకపోతే, ఎన్నికల సంఘం తప్పు చేయకపోయి ఉంటే, కేంద్రప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల వ్యవస్థ వ్యవహరించకపోయి ఉంటే, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థపై తప్పుడు ఆరోపణ చేస్తున్నప్పుడు ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉన్నది? ఎన్నికల వ్యవస్థను అబాసుపాలు చేస్తున్నారని చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఎన్డీయే సర్కార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం కొమ్ముకాస్తున్నదా? చట్టపరమైన చర్యలకు ప్రధాని మోదీ ఎందుకు వెనుకాడుతున్నారు? అంటే ఈ ఆరోపణల్లో నిజం ఉన్నదని మోదీ అంగీకరిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో ఎన్నికల సంఘం ఉన్నదని ప్రధాని చెప్పదలుచుకున్నారా? అని మేధావులు, విద్యావంతులు, సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో కొన్నిసార్లు నాయకుల గెలుపోటములను ఒక్క ఓటు నిర్ణయిస్తుంది. కాబట్టి, ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. ఎన్నికల సంఘానికి భారత రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ దుర్వినియోగం చేస్తున్నారంటే భారత రాజ్యాంగంతోపాటు, 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నట్టే. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉన్నది. కానీ, నకిలీ ఓట్ల ద్వారా ప్రజాభీష్టానికి విరుద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడుతుంటే, ప్రజాభిప్రాయానికి విలువ లేనప్పుడు, దేశ ప్రజల నిర్ణయాన్ని పాలకులు అగౌరవపరుస్తుంటే ప్రజాస్వామ్యం ఎలా వర్ధిల్లుతుంది? రాజ్యాంగ విలువలు ఎలా పరిఢవిల్లుతాయి?
ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై ఇప్పటికే అనేక సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల మదిలో మెదులుతున్న అనేక ప్రశ్నలకు ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలి. 140 కోట్ల మంది భారతీయులకు వాస్తవాలను తెలపాలి. భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని, కేంద్ర ఎన్నికల కమిషన్ స్వతంత్రతను రక్షించాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. తద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
-పుల్లెంల గణేష్
95530 41549