నీరు ప్రాథమిక అవసరం. జీవ మనుగడకు మూలం. ప్రతి పౌరుడికీ అందివ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత. అది రాజ్యాంగ హక్కు. దేశంలోని రాష్ర్టాలన్నీ అందుకోసమే తహతహలాడుతున్నాయి. చుక్క చుక్కను ఒడిసిపట్టేందుకు ప్రణాళికలను రూపొందించుకొని ముందుకుసాగుతున్నాయి. రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా రాష్ట్ర జలహక్కుల రక్షణ, ప్రజల ప్రయోజనాల పరిరక్షణే
ప్రథమ లక్ష్యంగా చేసుకుని ప్రజాప్రతినిధులు, మేధావి వర్గాలు కలిసికట్టుగా అడుగులు వేస్తున్నాయి.
ప్రాజెక్టుల నిర్మాణానికి వడి వడిగా పరుగులు తీస్తున్నాయి. నీటిహక్కుల రక్షణకు మూకుమ్మడిగానే కాలుదువ్వుతున్నాయి. అదే సమయంలో భేషజాలకు పోకుండా నీటి వినియోగ సామర్థ్యాలను అంతకంతకూ రెట్టింపు చేసుకుంటున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటక సర్కారు అందుకు నిలువెత్తు నిదర్శనం. అప్పర్తుంగా, అప్పర్‌భద్ర ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆ రాష్ట్రం సిద్ధమైంది. ఆల్మట్టి ఎత్తు పెంపునకు, దానికి సమాంతరంగా నావలి రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకుంటున్నది. అవిగాక చిన్నపాటి చెక్‌డ్యామ్‌లను చేపడుతున్నది. మరోవైపు చిన్న రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ మరో సజీవ సాక్ష్యం.
గోదావరిలో ఆ రాష్ట్ర వాటాకు చెందిన 148 టీఎంసీల జలాలను తాత్కాలికంగానే కావేరికి తరలిస్తామని కేంద్రం చెప్తున్నా ఒప్పుకోబోయేది లేదని తెగేసి చెప్తున్నది. హడావుడిగా బోధ్‌ఘాట్ ప్రాజెక్టును తెరమీదికి తీసుకువచ్చింది. కేంద్రంలో, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నది బీజేపీ ప్రభుత్వాలే కావడం గమనార్హం. ఇక మహారాష్ట్ర సైతం అనేక ఇంట్రారివర్ లింకు ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమైంది. ఇక తెలంగాణ పొరుగునే ఉన్న ఏపీ సైతం మరో ప్రబల సాక్ష్యం. అనుమతులతో పనిలేకుండా, అవార్డులను పట్టించుకోకుండా, పొరుగు రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా కృష్ణా, గోదావరిపై ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులను అనాదిగా చేపడుతున్నది. తాజాగా పోలవరం-నల్లమలసాగర్‌ను చేపట్టేందుకు వడి వడిగా పావులు కదుపుతున్నది. సూటిగా చెప్పాలంటే ఒడిషా, తమిళనాడు ఏ రాష్ట్రంలోనూ సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయపార్టీలు పరస్పర కక్ష సాధింపులకు దిగిన దాఖలా లేదు. రాజకీయ ఆరోపణలకు, లేదంటే విధానపరమైన విమర్శలకు పరిమితమయ్యాయే తప్ప కేసులు వేసి, కమీషన్లను పెట్టి, రచ్చకీడ్చి ప్రాజెక్టులను పడావు పెట్టిన చరిత్ర కనబడదు. నీటి వనరులను ఒడిసిపట్టడమే ఏకైక లక్ష్యంగా ఆయా రాష్ర్టాల్లో పార్టీలు విజ్ఞతతో పురోగమిస్తున్నాయి.
పొరుగు రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ ప్రస్తుత రాజకీయ ఏలికల ఆలోచనా సరళి అత్యంత హేయంగా ఉన్నది. వారు అనుసరిస్తున్న విధానాల్లో రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా మృగ్యం. ఉమ్మడి రాష్ట్రంలో.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రతిపక్ష హోదాలో.. నేడు అధికారపక్షంగానూ అవలంబిస్తున్న, అమలుచేస్తున్న ప్రణాళికలే ఇందుకు నిదర్శనం. ఇంకా అదే ఉమ్మడి పాలనలో నాటి భావదారిద్య్రం. నాడు వలసాంధ్ర పాలకులు చేసిన జలకుట్రలను ఏనాడూ అవగాహన చేసుకోలేదు. ప్రశ్నించలేదు. నదీ జలాలు దక్కకూడదనే దురాలోచనతో నీళ్లురాని చోట, కనీస నీటి నిల్వ సామర్థ్యం లేకుండా తెలంగాణ ప్రాజెక్టులను ప్రతిపాదించినా నిలదీయలేదు. సీమాంధ్ర ప్రాజెక్టులకు నిధుల వరదపారిస్తూ.. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు నిధులివ్వకుండా.. అంతర్రాష్ట్ర వివాదాల్లోకి నెట్టి పడావుబెట్టినా పట్టించుకోలేదు. దౌర్జన్యంగా ఆర్డీఎస్ను బద్దలుకొట్టి.. పోతిరెడ్డిపాడును విస్తరించి నీళ్లను దోచుకెళ్లినా కిక్కురుమనలేదు. నోరు విప్పలేదు. పదవులకు, కాల్వల కాంట్రాక్టుల పనులకు కమీషన్లను దండుకునేందుకు పోటీపడ్డ నేతలే తప్ప న్యాయమైన నీళ్ల వాటా కోసం నిక్కచ్చిగా నిలబడ్డదీ లేదు. ఒక్కరూ కలబడిందీ లేదు.
కాంగ్రెస్ నేతల ఆ పాపఫలమే కదా కృష్ణమ్మ, గోదారమ్మ ఏండ్లుగా తెలంగాణ బీళ్లను తడపకుండానే, ఈ గడ్డపై నిలువకుండానే దిగువకు పరుగుపెట్టాయి. తుంగభద్ర నడిగడ్డను కన్నెత్తిచూడకుండానే తరలిపోయింది. భీమా ఏ ధీమాను ఇవ్వలేకపోయింది. వెరసి కరువులకు, ఆకలికి, వలసలకు తెలంగాణ నిలయమైంది. తెలంగాణ వాకిలి పొక్కిలైంది. జీవన విధ్వంసానికి గురైంది. కష్కెడు నీళ్లకు సైతం తండ్లాడింది. ఇదేమీ యుగాల కిందటి చరిత్ర కాదు. పన్నెండేండ్ల కిందటి తెలంగాణ బతుకుచిత్రం, చేదు వాస్తవం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరమైనా కాంగ్రెస్ నేతల తీరు మారింది లేదు. రాజకీయాలే తప్ప విశాల తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉమ్మడి పాలకులు జల కుట్రలను ఛేదించేందుకు అకుంఠిత దీక్షతో కేసీఆర్ పూనుకుంటే, పొరుగు రాష్ర్టాలకు వంతపాడుతూ, రాష్ట్ర నీటి హక్కులను పణంగా పెడుతూ అడుగడుగునా అడ్డునిలిచే ప్రయత్నమే చేశారు. తెలంగాణ సోయితో.. భావి తెలంగాణ నీటి అవసరాలపై కచ్చితమైన అంచనాలతో.. కృష్ణా, గోదావరిలో న్యాయమైన వాటాల మేరకు జలాలను వినియోగించుకోవాలనే లక్ష్యంతో.. చుక్క చుక్కను ఒడిసిపట్టి.. తెలంగాణ మూలమూలకూ పారించాలనే సదాశయంతో ప్రాజెక్టుల రీడిజైన్‌ను చేపడితే నిందలేశారు. నీళ్లు లేని చోట ప్రతిపాదించిన ప్రాజెక్టులను సమృద్ధిగా నీళ్లున్న చోటుకు మార్చితే తప్పుబట్టారు. వరద వచ్చిన సమయంలోనే, అతితక్కువ కాలంలోనే ఎక్కువ నీళ్లను ఎత్తిపోసుకునేందుకు వీలుగా పెద్ద పంపులను పెడితే కమీషన్లను అంటగట్టేందుకు యత్నించారు.
తెలంగాణ భౌగోళిక అవసరాలకనుగుణంగా, నీటిరంగ నిపుణుల సూచనల మేరకు నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు భారీ రిజర్వాయర్లను నిర్మిస్తే రైతులను ఎగదోసి అడ్డుకునేందుకూ యత్నించి విఫలమయ్యారు. చచ్చినోళ్ల పేరిట ప్రాజెక్టులపై కేసులు వేసి అభాసుపాలయ్యారు. ప్రతిపక్షంగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేయడం మాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. సీతమ్మసాగర్, డిండి, గౌరవెల్లి, మల్లన్నసాగర్ పనులను అడ్డుకునేందుకు కోర్టుల్లో దావాలు వేసి తెలంగాణను దగా చేసేందుకు సైతం తెగించారు. చెరువులు తవ్వినా, పూడిక తీసినా, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం తలపెట్టినా రాద్ధాంతం. కాళ్లలో కట్టెలు పెట్టే రాజకీయం. ఇదే కాంగ్రెస్ అనుసరించిన విధానం. దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన కేసీఆర్‌ను పదేండ్లలో ఏనాడూ మాటవరుసకైనా ప్రశంసించిన పాపాన పోలేదు కాంగ్రెస్ నేతలు. సూటిగా చెప్పాలంటే పొరుగు రాష్ర్టాల కన్నా ఎక్కువగా రాష్ట్ర ప్రాజెక్టులను తెలంగాణ కాంగ్రెస్ నేతలే బద్నాం చేయ పూనుకోవడం అత్యంత విచారకరం. తెలంగాణకు విషాదకరం.
పార్టీ ఏదైనా కానీ, అధికారంలోకి వచ్చాక తీరు మారాలె. రాజకీయాలు వేరు. ప్రభుత్వం వేరు. రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ తరాల బాధ్యత మోస్తున్నామనే భావనతో మెలగాలె. విజ్ఞతను ప్రదర్శించాలె. వివేకంతో వ్యవహరించాలె. వివేచనతో అడుగులు వేయాలె. కాలం మారినా కాంగ్రెస్‌లో ఇప్పటికీ ఆ సోయి కానరాకపోవడమే విషాదకరం. ఉమ్మడి పాలకుల కుట్రపూరిత ప్రణాళికలే భేష్ అంటూ కీర్తించడమే కాదు, వాటినే అనుసరిస్తుండటమే కాంగ్రెస్‌కు తెలంగాణ సోయి లేదనే సత్యాన్ని పట్టిచూపుతుంది. కాంగ్రెస్ భావదారిద్య్రానికి, వదిలిపోని బానిస తత్వానికి అద్దం పడుతుంది. రేవంత్ సర్కారు గత రెండేండ్లుగా అనుసరిస్తున్న విధానాలు, సాగునీటి ప్రణాళికలే అందుకు నిలువెత్తు నిదర్శనం. అధికార పగ్గాలను చేతబట్టిన వెంటనే కాళేశ్వరంపై కక్షసాధింపులు మొదలయ్యాయి. శ్వేతపత్రాల పేరిట రాద్ధాంతాలు, కమిషన్లు, విజిలెన్స్ ఎంక్వయిరీలు.. నివేదికల పేరిట తెలంగాణ కల్పతరువైన ప్రాజెక్టును మూలకునెట్టింది. ఎదురెక్కిన గోదావరిని మళ్లీ ఏపీకి సద్దికడుతున్నది.
దిగువకు పారకం పెడుతున్నది. మరోవైపు ఏపీ జల దోపిడీకి అడ్డుచక్రం వేసేందుకు.. తెలంగాణకు నీటిభరోసా కల్పించేందుకు చేపట్టిన పాలమూరు లిఫ్ట్నూ నిర్లక్ష్యం చేస్తున్నది. పనులను పూర్తిచేసి కృష్ణమ్మను ఒడిసిపట్టే అవకాశం ఉన్నా రెండేండ్లుగా పడావు పెడుతున్నది. కృష్ణా జలాల దోపిడికి కొమ్ముకాస్తున్నది. ప్రాజెక్టు కాల్వల టెండర్ల రద్దు, భీమా నీటి కోటాలో కోతలు, గ్రావిటీని కాదని.. ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రణాళికలన్నీ తారుమారు చేశారు. ఆయకట్టు కుదింపులు, తొలగింపులు, చెక్‌డ్యామ్‌ల పేల్చివేతలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఉన్న ఆయకట్టుకే నీరివ్వలేని జూరాలపై కొడంగల్ లిఫ్ట్ పేరిట అదనపు భారం మోపే అనాలోచిత నిర్ణయాలే ఉదాహరణలు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులే లేవని ప్రభుత్వ పెద్దలే కోడై కూస్తూ కుట్రలకు అస్ర్తాలు అందించడమే కాంగ్రెస్ సోయిలేని తనానికి దర్పణం. తెలంగాణ దౌర్భాగ్యం.
ఇక రాష్ట్రంలో బీజేపీ నేతలదీ అదే తీరు. ‘మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి. తెలంగాణలో ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి. తెలంగాణలో యువకులు వందల సంఖ్యలో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ మాతృమూర్తులను గుర్తు చేసుకోవాలి. ఆ బలిదానాలు కాంగ్రెస్ పాప ఫలితం. తెలంగాణకు ఇప్పుడు ఏం కావాలి. తెలంగాణ అభివృద్ధి చెందాలి. రాతలు మారాలి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి. ఇక్కడి రైతులకు నీళ్లుంటే మట్టిలో బంగారం పండిస్తరు. మమ్మల్ని సమర్థించండి. నీళ్లు ఇస్తాం. కరెంటు ఇస్తాం’ ఇదీ 2014, ఏప్రిల్ 22లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలమూరు గడ్డపై నేటి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు. కానీ 12 ఏండ్లుగా పాలమూరుకు మోదీ చేసింది శూన్యం.
కృష్ణా జలాల్లో వాటాను తేల్చేందుకు ట్రిబ్యునల్ వేసేందుకు తొమ్మిదిన్నరేండ్లు కాలయాపన చేసింది.పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు సరికదా ఒక్క రూపాయినీ విడుదల చేయలేదు.
మరోవైపు నీటి వాటాలకు విరుద్ధంగా, చట్టాలను ధిక్కరిస్తూ.. జల సూత్రాలను తుంగలో తొక్కుతూ బీజేపీ పాలిత రాష్ర్టాలు.. కూటమి ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల వరద పారిస్తున్నది. అనుమతులను మంజూరు చేస్తున్నది. పొరుగు రాష్ర్టాల అభ్యంతరాలను సాకుగా చూపుతూ తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను తొక్కిపెడుతున్నది. ఏపీ చర్యలన్నింటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇతోధికంగా వత్తాసు పలుకుతున్నది. తెలంగాణ హక్కులకు గండి కొడుతున్నది. తీరని విద్రోహాన్ని తలపెడుతున్నది. ఇంత జరుగుతున్నా ఇక్కడి కమల దళాధిపతులు నోరు మెదపరు. అది సరే సిద్ధాంత వైరుధ్యాలనూ పక్కనబెట్టి.. అధికార కాంగ్రెస్‌తో జతకలిసి తెలంగాణ ప్రాజెక్టులనే బద్నాం చేయపూనుకోవడం తెలంగాణ రాజకీయాల వైచిత్రి, వైపరీత్యం.
తెలంగాణ బీళ్లను తడపకుండా, బిడ్డల గొంతు తడపకుండా తరలిపోతున్న కృష్ణా, గోదావరిని చూసి నిలువునా నీరై కరిగిపోయింది, తల్లడింది కేసీఆరే. ఆ కుట్రల మర్మమేంటని తెలంగాణ పక్షాన ప్రశ్నించిండు. వలసాంధ్ర పాలకుల నీటి గుట్టుమట్లను విప్పి నిలదీసిండు. గులాబీ జెండాను ఎత్తి పట్టిండు. పోరు నడిపిండు. తెలంగాణ నీటి హక్కుల కోసం గర్జించిండు. ముఖ్యమంత్రిగా తెలంగాణ తెలివిడిని చూపిండు. వివాదాలకు, సంవాదాలకే పరిమితమై పోలేదు. భేషజాలు చూపలేదు. తెలంగాణ సోయితో ప్రాజెక్టులను రూపుదిద్దిండు. నదీ జలాలను తెలంగాణ మూలమూలకూ మళ్లించే ప్రణాళికలకు రూపుదిద్దిండు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిండు. కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులను కండ్ల ముందు నిలబెట్టిండు. చెరువును, కుంటను, వాగును, వంకను వదలకుండా అడ్డుకట్టలు కట్టి చుక్కచుక్కను ఒడిసి పట్టిండు. సజీవ జలధారలుగా మార్చిండు. తెలంగాణను జలభాండంగా తీర్చిదిద్దిండు. అందుకు దరులను ఒర్సుకు పారుతున్న కాల్వలే సజీవ సాక్ష్యాలు.
ఇప్పుడు వర్తమానంలోనూ మళ్లీ తెలంగాణపై పొరుగు రాష్ట్రం మూకుమ్మడిగా, ఏకతాటిపై నిలబడి మన జలహక్కులపై ముప్పేట దాడి చేస్తున్నది. నీళ్లను దొబ్బుకుపోయే ఎత్తులు వేస్తున్నది. అయినా ఇక్కడి కాంగ్రెస్, బీజేపీలకు సోయి లేకుండా పోయింది. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పొరుగు రాష్ర్టానికి తాకట్టు పెడుతున్నాయి. ఆ ముప్పేట దాడిని, కుట్రలను ఇప్పుడు మళ్లీ నిలదీస్తున్నదీ కేసీఆరే. తెలంగాణ జలహక్కుల రక్షణ కోసం పోరు చేస్తున్నదీ గులాబీ జెండానే. ఇది తెలంగాణ సమాజం గమనించాలె, మేలుకోవాలె. తెలంగాణ భావితరాల భవిష్యత్తుకు, నీటి హక్కుల రక్షణకు బీఆర్ఎస్తో కలిసి నడువాలె. నీటి హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్‌కు, కొమ్ముకాస్తున్న బీజేపీకి బుద్ధిచెప్పాలె.
-మ్యాకం రవికుమార్
9182777621