నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కందిబండ రంగారావు ఖమ్మం జిల్లాలోని వైరా మండ లం, సిరిపురం (కనకగిరి) గ్రామంలో 1907 సెప్టెంబర్ 26న జన్మించారు. చేయని హత్యకు మరణశిక్ష విధించబడి, మృత్యువు అంచుల్లోకి వెళ్లి చివరి క్షణంలో, అదృష్టవశాత్తు తిరిగి స్వేచ్ఛా వాయువులు పీల్చిన అరుదైన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఆయన.
రంగారావు 1927లో నిజాం కళాశాల నుంచి బీఏ డిగ్రీ పూర్తిచేశారు. అలా రంగారావు ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి పట్ట భద్రుడుగా గుర్తింపు పొందారు. ప్రజాసేవ చేయాలని భావించి, అందుకు అనువైనదిగా భావించి తన స్వగ్రామం సిరిపురంలోనే స్థిరపడ్డారు. వంశపారంపర్యంగా వస్తున్న గ్రామాధికారి వృత్తి అయిన ‘కరణం’గా అధికారిక విధులను నిర్వర్తించారు. ఆ తర్వాత గ్రామ సర్పంచ్‌గా, వైరా పంచాయతీ సమితి ఉపాధ్యక్షునిగా, తెలంగాణ గ్రామాధికారుల సంఘం అధ్యక్షులుగా చాలాకాలం పనిచేశారు.
1969లో ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో రంగారావు పాల్గొన్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులంతా ఉద్యమంలో పాల్గొని పోలీసుల లాఠీ దెబ్బలు తినటమే కాకుండా జైలు శిక్షలను కూడా అనుభవించారు. అంతకు ముందు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రంగారావు తీవ్ర పోరాటం చేశారు. ఆ సమయంలో ఉప్పల మడక గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే ముస్లిం వ్యక్తిని హత్య చేశారనే ఆరోపణ చోటు చేసుకున్నది. దానితో రంగారావును అరెస్ట్ చేశారు. రంగారావే హత్య చేశారని, ఆయనను ఉరికూడా తీస్తారనే వార్త దావానలంలా వ్యాపించింది. ఆ వార్తను విన్న ఆయన కుటుంబ సభ్యులు చేసేది లేక, ఉరి శిక్ష ఖాయమని నమ్మి, అంత్యక్రియలకు కూడా సిద్ధపడ్డారు. ఆయన పార్థివ శరీరాన్ని తీసుకొద్దామని వరంగల్ సెంట్రల్ జైలుకు వెళ్లినప్పుడు ఆయనను ఉరి తీయలేదని, ఆయన బతికే ఉన్నారని తెలిసింది. ఉరి తీయడానికి తీసుకెళ్లే ముందు నిజాం ప్రభుత్వంలో హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన క్లాస్మేట్ డా.అహ్మద్ తన మిత్రుడిని ఉరి తీయకుండా అడ్డుకున్నట్టు తెలుసుకుని సంతోషించారు. హత్య కేసు విచారణలో మృతుని భార్య తన భర్తను రంగారావు హత్య చేయలేదని సాక్ష్యం ఇవ్వడంతో రంగారావు బతికి బయట పడ్డారు. నిజాం పాలనలో ఒక ముస్లిం హత్య కేసులో ఇరుక్కున్న కందిబండ రంగారావు ఉరిశిక్ష పడే ప్రమాదం నుంచి బయటపడటం విశేషం. అందులోనూ మృతుని భార్య సాక్ష్యం చెప్పి, ప్రాణ భిక్ష పెట్టిన అరుదైన సంఘటనగా ఈ విషయాన్ని చెప్పుకుంటారు. ఆరునెలల తర్వాత వరంగల్ సెంట్రల్ జైలు నుంచి రంగారావు విడుదలయ్యారు. విడుదలయ్యాక అనేక ఏండ్లు ప్రజా సేవకు అంకిత మయ్యారు. చివరి వరకు తన స్వగ్రామమైన సిరిపురంలోనే గడిపిన ఆయన 1987 ఆగష్టు 23న తుదిశ్వాస విడిచారు.
(నేడు కందిబండ రంగారావు వర్ధంతి)
-రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494