ఇయ్యాళ్ల, రేపు బాధల్లేని మనిషి మన దునియాల లేడంటే నాకైతే అర్కీస్ నమ్మబుద్ధి గాదు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు.. ఎవ్వల ఐషత్కు తగ్గట్టు, ఎవ్వల తాహత్కు తగ్గట్టు వాళ్లకు బాధలుండనే ఉంటయి. అయితే బా ధలు బహురకాలని పెద్దలు శెప్పంగ ఇన్న మాట. కొందరు వాటిని బాధలంటే, ఇంకొందరేమో కొత్తగా వాటిని కోరికలంటుంటరు. నా వరకొస్తే.. పేదోళ్లు వడేది బాధలైతే.. పెద్దోళ్లు తమ గొంతెమ్మ కోరికలనే బాధలుగా శెప్పుకుంటరు. ‘ఈ బాధ తీరితే సాలు దేవుడా’ అని పేదోళ్లు భగవంతునికి మొక్కుకుంటే, ‘అబ్బా.. ఇగ గీ ఒక్క కోరిక తీరిస్తే సాలు’ అని పెద్దోళ్లు దేవునికి ఆదేశాలిస్తుంటరు.
‘నాకొక్క యూరియా బత్త దొరికితే సాలు బిడ్డ, ఇగ నా బాధ వాసినట్టే’నని మొన్న మా ఎల్లన్న చిన్నబాపు శెప్పవట్టిండు. పేదోని బాధ గిట్లుంటే.. ‘నేను రెండోసారి గూడ ముఖ్యమంత్రి గావాలె, అది మీ జేతుల్నే ఉంది, మీరు కచ్చితంగా జెయ్యాలె’ అని మన రేవంత్ సారసొంటోళ్లు టీచర్లకు ఆదేశాలిస్తుంటరు. ఇసువంటి గొంతెమ్మ కోరికలనే పెద్దోళ్లు తమ బాధలుగా శెప్పుకుంటరు. పెద్దోళ్లు బాధల రూపంలో ఇసొంటి కోరికలను ఎన్నైనా శెప్పుకోవచ్చు గనీ, ఎటొచ్చి పరేషాన్ అంతా నా అసొంటి పేదోళ్లకే. అవును, నా అసొంటోళ్లు ‘బాధలు శెప్పుకోవద్దు, బస్ గంతే!’ ఎందుకో ఎర్కేనా?
అర్జున్ రెడ్డి సిన్మాలో శివ పాత్రతో ఇండస్ట్రీలో మంచి కమెడీయన్‌గా పేరు తెచ్చుకున్నడు రాహుల్ రామకృష్ణ. మనిషి మస్తు మంచోడు. మంచోడని నేనెందుకు శెప్తున్ననంటే.. ‘నా దరిద్రం పోతైపాయె, మంది బాధ మనకెందుకు’ అనుకునే ఈ కలికాలంల రాహుల్ రామకృష్ణ మంది కోసం తపనవడ్డడు. ప్రజల కోసం తన్లాట వడ్డడంటే ఏ మనిషైనా మంచోడన్నట్టే గదా! బరాబర్, నూటికి నూరుపాళ్లు మంచోడే. రాష్ట్ర ప్రజలు వడుతున్న బాధలు సూడలేక, చూస్తూ జీర్ణించుకోలేక గత రెండేండ్లుగా దిగమింగుకుంటున్న బాధను దస్రా పండుగు నాడు రాహుల్ రామకృష్ణ ఒక్కసారిగా ఎల్లగక్కిండు. ‘రాష్ట్ర ప్రజలు దస్రా పండుగు జరుపుకొనే స్థితిల లేరు, వాళ్లు మస్తు బాధలు వడుతున్నరు.
సారూ.. మీరు మళ్లా రావాలె. పండుగలైనా, పబ్బమైనా అవి మీరుంటేనే’ అని సోషల్ మీడియా వేదికగా పోస్టు వెట్టి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు ట్యాగ్ జేసిండు. ‘బాధలు శెప్పుకోవద్దు, బస్ గంతే!’ అని రానే అచ్చినయి అల్లరిమూకలు. పాపం, అదే సోషల్ మీడియా వేదికగా రాయలేని భాషల ఆయనను బండబూతులు తిట్టిన్రు. ఈ అల్లరిమూకల ఎన్క ఎవరున్నరో తెలుసా.. ఇంకెవరుంటరు? ప్రజల బాధలు వట్టనోళ్లు, పాలకుల మోచేతి నీళ్లు తాగేటోళ్లే. ఇండస్ట్రీలోని ఓ పెద్దమనిషి ఏకంగా రాహుల్ రామకృష్ణకు పోన్జెయ్యనే జేసిండట! ‘పలానా పోస్టు డిలిట్ జేస్తవా, చెయ్యవా?, చెయ్యకుంటే నీ కథ ఇక్కడికే పుల్‌స్టాప్’ అని బెదిరించిండట! ఇంకేం జేస్తడు. పాపం చిన్న చిన్న క్యారెక్టర్లు జేస్కుంటే గానీ బతుకలేని రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా పోస్టును తీసేసిండు.
ఇదిట్లా ఉంటే, ఇంకో ముచ్చట సూడుర్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన మానుక లక్ష్మణ్ బతుకుదెరువు కోసం బైటిదేశం బోయి సొంతూరుకు తిరిగొచ్చిండు. సొంతం మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు, మొత్తం ఐదెకరాలల్ల వరి పంటేసిండు.
ఆ పంట కోసం 10 బత్తాల యూరియా అవసరం బడ్తే.. కాలుగాలిన పిల్ల లెక్క అటూ ఇటూ దిర్గిండు. తిర్గంగ తిర్గంగ ఆఖరికి రెండు బత్తాల యూరియానే దొరికింది. తిర్గీ తిర్గీ మొసకొచ్చిన లక్ష్మణ్ యూరియా లేకుంటే తన పంట ఎక్కడ దెబ్బతింటదోననే బాధను మీడియా ముంగట వీడియో రూపంల ఎల్లవోసుకున్నడు. అది సోషల్ మీడియాలో శెక్కర్లు కొట్టడంతో తన ఇంటికి రానే అచ్చిన్రు పోలీసోళ్లు. పొద్దుననంగా వట్కపోయి లక్ష్మణ్ మీద ఓ కేసు వెట్టి ఆరింటిదాన్క టౌన్లనే కూసోవెట్టిర్రు. ‘బాధలు.. శెప్పుకోవద్దు, బస్ గంతే’ అన్నట్టుగా బెదిరించిన్రు. ఎల్లారెడ్డిపేటకు చెందిన తతిమా రైతులు లక్ష్మణ్ దిక్కు నిలవడటంతో పోలీసులకు ఏం పొద్దువోక పొద్దూకిజామున లక్ష్మణ్‌ను ఇంటికి దోలిర్రు.
నిన్నటికి నిన్న.. ఒక లక్కీ డ్రా వార్త సోషల్ మీడియాల గిరగిరా శెక్కర్లు గొట్టింది. ఆ వార్త సారాంశం ఏమంటే.. ‘రూ.500లకే, రూ.16 లక్షల ప్లాట్’ అని. నీయవ్వ గీ ముచ్చటేందో అస్సలుందని వాట్సాప్‌ల అచ్చిన ప్రకటన మీదున్న నంబర్ జూసి పోన్గల్పిన. ప్లాట్ ఓనర్ పేరు కంచర్ల రాంబ్రహ్మం అట. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని దుగునవెల్లి ఊరికి చెందిన రాంబ్రహ్మం 2019, కరోనా కాలంల నల్గొండ పట్టణంల రూ.32 లక్షలు వెట్టి ఈఎంఐ కింద ఒక ఇల్లు గొన్నడు. ఓ ప్రైవేటు పార్మసీలో చిన్న కొలువు జేస్కునే రాంబ్రహ్మం మూణ్నాలుగేండ్లు ఈఎంఐ మంచిగనే గట్టిండు గనీ, తర్వాత ఏదో అడ్డమొచ్చి ఈఎంఐ మలాద వడ్డది. అదెట్లా గట్టాల్నో దెల్వక క్రెడిట్ కార్డులను గూడ వాడుకున్నడు. అటు ఈఎంఐ, ఇటు క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక రెండు పైసల మిత్తి చొప్పున అప్పు గూడ దూస్కచ్చిండు. ఏడాది దాన్క ఎట్లనో గట్ల మా ఎల్లదీస్కుంటొచ్చిండు గనీ, ఏడాది దాటినంక అప్పులొల్ల బాధలు ఎక్కువైనయి. ఇగేం జెయ్యాల్నో తెల్వక చౌటుప్పల్ పరిధిలో తనకున్న 66 గజాల ప్లాట్‌లో ఉన్న చిన్న రేకుల షెడ్డును అమ్మకానికి వెట్టిండు. అమ్మకానికి వెట్టి సరిగ్గా రెండేండ్లు కావస్తున్నది. అయినా.. పాపం, ఆ ప్లాట్ అమ్ముడువోలేదు. అప్పులొల్లు ఇంటికి వస్తనే ఉన్నరట! ‘వాళ్లను మోసం చేయొద్దనుకున్న రాంబ్రహ్మం అప్పులొల్లకు నవంబర్ 31వ తారీఖు గడువు వెట్టిండు. ప్లాట్ అమ్ముడువోతే గానీ అప్పు కట్టలేని పరిస్థితిల ఉన్న రాంబ్రహ్మం మెదడుల ‘లక్కీ డ్రా’ ఆలోచన వుట్టిందట!
‘బ్రహ్మం భాయ్.. రెండేండ్లయినా నీ ప్లాట్ ఎందుకు అమ్ముడువోతలేదే. దీనికి గల కారణాలను నువ్వేమన్న శెప్పదల్సుకున్నవా’ అని నేనడిగితే… ఫోన్లనే రెండు శేతులెత్తి దండం పెట్టవట్టిండు. ఆయన బాధేందంటే.. నవంబర్ 2వ తారీఖున డ్రా ఉన్నదట. ఇప్పటికీ 1100 కూపన్లు అమ్ముడువోయినయట. పైసలు గూడ ఓ ఐదారు లక్షల దాన్క మా అచ్చినయట.
అచ్చిన పైసల్ అచ్చినట్టు అప్పులు గూడ కడుతున్నడట. ‘అన్నా.. అసలే నా అద్రుట్టం మంచిగలేదే ఇప్పుడు. అరటి పండు తిన్నా పండ్లిరిగుతున్నయి. రెండేండ్ల కిందనే ప్లాట్ ఫర్ సేల్ అని బోర్డు వెట్టిన. కావాల్నంటే నా ప్లాట్ సుట్టుముట్టోళ్లను గూడ అడిగి తెల్సుకో. ఇంకా సుట్టాలకు, దోస్తులకు, అందరికీ జెప్పిన ప్లాట్ అమ్ముతున్ననని. అయినా ఒక్కల్గూడ ప్లాట్ కొనేటందుకు ముందుకురాలె. ఇగ జేసేదేం లేక ‘లక్కీ డ్రా’ వెట్టిన. ఇగ మీరే అర్థం జేస్కోర్రి గనీ, నా నోరునెందుకే మురికి జేస్తరు’ అని బాధపడవట్టిండు. ఆయన మాటలిన్న నాకు గత రెండేండ్లుగా రియల్ ఎస్టేట్ పడివోయిన విషయం నాకు మతికొచ్చింది. కానీ, బాధలు శెప్పుకోవద్దు, బస్ గంతే!
-గడ్డం సతీష్
99590 59041