140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ క్షీణస్థితికి రాహుల్‌గాంధీ, హీనస్థితికి రేవంత్ రెడ్డి సంకేతాలుగా నిలుస్తున్నారు. ఒక సంస్థ గొప్పగా వెలిగిన దశలో ఆ కాలపు నాయకులు కూడా గొప్పగా ఉంటారు. ఆ సంస్థ కాలక్రమంలో క్షీణించటం మొదలైన తర్వాత, ఒక్కోసారి సమర్థులైనవారు రంగంలోకి వచ్చి సంస్థను తిరిగి గొప్పదిగా తీర్చిదిద్దగలరు. అట్లా కానప్పుడు సంస్థ క్షీణత కొనసాగి తాము ఆ క్షీణత్వానికి సంకేతాలుగా మిగులుతారు. రాహుల్‌గాంధీ పరిస్థితి ఆ విధంగా ఉంది. మరొకవైపు, క్షీణత్వం హీనత్వంగా మారేందుకు ఎక్కువ సమయం పట్టదు. అటువంటి హీనత్వానికి సంకేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలుస్తున్నారు.
వీరిద్దరి క్షీణత, హీనతలు ఏ విధంగా కనిపిస్తున్నాయో చర్చించేందుకు ముందు, కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఈ దశకు ఎందువల్ల చేరిందో అర్థం చేసుకోవటం అవసరం. రాహుల్, రేవంత్‌లను ఎంత విమర్శించినా మనం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ క్షీణత గాని, హీనత గాని వీరితో మొదలుకాలేదు. ఆశ్చర్యం కలగవచ్చు గాని, అందుకు ఆరంభం మొదటి ప్రధానమంత్రి నెహ్రూ ప్రగతిశీల విధానాలను అప్పటి దేశవ్యాప్త ఫ్యూడల్ శక్తులు అడుగడుగునా విఫలం చేయటంతో జరిగింది. తన భూ సంస్కరణలు, పంచాయతీరాజ్, సహకార విధానం, రిజర్వేషన్లు, బ్యాంకుల పరపతి విధానం, పంచవర్ష ప్రణాళికల వంటివి ఆ శక్తుల మూలంగా విఫలం కానట్టయితే, ఒకవైపు గ్రామ సీమల నుంచి మొదలుకొని దేశం అభివృద్ధి చెందటం, మరొకవైపు తన నాయకత్వాన కొత్త శక్తులు కాంగ్రెస్‌లోకి ప్రవేశించి పార్టీ తన భవిష్యత్తు కోసం కూడా బలపడటం జరిగేవి. కానీ అది జరిగే సూచనలు కనిపించకపోవటంతో, 1952 నాటి మొదటి ఎన్నికల తర్వాత 1957లో రెండవ ఎన్నికలు వచ్చేసరికే పార్టీ అనేక రాష్ర్టాలలో ఓట్లు, సీట్లు కోల్పోయింది. కేరళలో అధికారం సైతం పోగొట్టుకుంది.
తర్వాత 1960లలో ఇటు పట్టణాలలో ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగ యువకుల నుంచి, అటు గ్రామాలలో రైతులు, కూలీల నుంచి ఆందోళనలు ఉధృతంగా సాగాయి. 1967 ఎన్నికలలో కాంగ్రెస్ లోక్‌సభ స్థానాలు 361 నుంచి 284కు పడిపోగా, 9 రాష్ర్టాలలో అధికారం కోల్పోయింది. అదే సంవత్సరం నక్సలైట్ ఉద్యమం మొదలైంది.
ఇంకా వివరాలలోకి వెళ్లనక్కరలేదు గాని, అదే ధోరణి అటు ఇటుగా అప్పటినుంచి కొనసాగుతూ వస్తున్నది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడవసారి కేంద్రంలో అధికారానికి రాలేకపోయింది. కేవలం మూడు రాష్ర్టాలలోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. ఈ మధ్యకాలపు ఎన్నికల వివరాలను అటుంచితే, ఒక ముఖ్యమైన మాట చెప్పుకోవాలి. 1957 ఎన్నికల పరాజయాలతో కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతికి గురికాగా, ఆ ఫలితాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలలో సమీక్షించిన నెహ్రూ ఒక విలువైన హెచ్చరిక చేశారు. ప్రజలు చైతన్యవంతులవుతున్నారని, దానితో పాటు వారికి ఓటు అనే ఆయుధం ఉందని, పరిస్థితులు అప్పటి వలెనే కొనసాగితే ఆ చైతన్యవంతులు తమ ఓటును వినియోగించి మనను పక్కకు తోసివేసి తమ దారిలో తాము ముందుకుపోగలరని అన్నారాయన. కానీ, ఆ హితవు కాంగ్రెస్‌ను ఆ స్థితికి తెచ్చిన శక్తుల చెవికెక్కలేదు. ఫలితం ఏమైందో పైన చెప్పుకొన్నాం. ఆ తర్వాత ఇందిరాగాంధీ తన అధికార పరిరక్షణ కోసం కొన్ని రాడికల్ నటనలు చేశారు గానీ, మౌలిక పరిస్థితులు మాత్రం నెహ్రూ ఆశించిన రీతిగా మారనందున కాంగ్రెస్ పతనావస్థ ఎప్పటివలెనే కొనసాగింది.
ఆ క్షీణస్థితి ఏయే రూపాలు తీసుకుంటూ వస్తున్నదో ఇక్కడ రాసుకోలేము గాని, కాంగ్రెస్‌ను నిజమైన అర్థంలో పునరుద్ధరించిన వారు ఎవరూ లేకపోయారు. నెహ్రూ ఆలోచించినట్టుగా ఫ్యూడల్ వ్యవస్థను, దాని బలిమిని నిర్మూలించకపోవటం కాంగ్రెస్‌కు ఒక పెద్ద ఎదురుదెబ్బ కాగా, 1990ల ఆర్థిక సంస్కరణలను విచక్షణారహితంగా భుజానికి ఎత్తుకోవటంతో మొదలైన దశ, దాని ప్రభావాలు మరొక పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఆ రెండు దశలలో కలిపి అనేక సామాజిక వర్గాలు పార్టీకి దూరమయ్యాయి. నెహ్రూ వంటి సమగ్ర దార్శనికులు గల నాయకత్వం ఇక పార్టీకి ఎప్పుడూ రాలేదు. దృష్టి యావత్తూ ఎప్పటికప్పుడు అధికార రాజకీయాల చుట్టూ తిరిగే దశలోకి ప్రవేశించింది. అధికారానికి హామీ లేని స్థితి పెరిగిన కొద్దీ, అధికారం కోసమే సమస్త శక్తియుక్తులు ఒడ్డే స్థితి కూడా పెరుగుతూ పోయింది. ఒక గొప్ప చారిత్రక పాత్ర నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి ఇదంతా క్షీణ స్థితే. దేశ నిర్మాణం కోసం ఒక గొప్ప దార్శనికత ఉండిన పార్టీకి ఇది నిస్సందేహకరమైన క్షీణస్థితే.
మొదట ఒక మాట అనుకున్నాము. ఒక సంస్థ కాలక్రమంలో క్షీణించటం మొదలైన తర్వాత ఒక్కోసారి సమర్థులైనవారు రంగంలోకి వచ్చి సంస్థను తిరిగి గొప్పదిగా తీర్చిదిద్దగలరు. అట్లా కానప్పుడు సంస్థ క్షీణత కొనసాగి తాము ఆ క్షీణత్వానికి సంకేతాలుగా మిగులుతారని. ఇప్పుడు మనకు కాంగ్రెస్ విషయంలో గానీ, దానికి మకుటం లేని మహారాజుగా కేవలం ఆ వంశంలో తన పుట్టుక కారణంగా చెలామణి అవుతున్న రాహుల్‌గాంధీ విషయంలో గానీ కనిపిస్తున్నది సరిగా అదే. అవును సరిగా అదే. కాంగ్రెస్ పార్టీ ఇక తిరుగులేని విధంగా క్షీణదశలో ప్రవేశించింది. రాహుల్‌గాంధీ నిస్సందేహకరమైన రీతిలో దానికి క్షీణ సంకేతంగా మారారు.
ఈ క్షీణతకు ఆరంభం తాను అనటం లేదు. కాని, వర్తమానంలో కొనసాగుదలకు మాత్రం తానే కారణం. ఎందుకంటే, ఆయనను 2004లో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుంచి గమనిస్తున్నాం. ఇప్పటికి 21 సంవత్సరాలు. పూర్తిగా ఒక్క కొత్త తరం ఉనికిలోకి వచ్చిన సమయం. కాని ఆయనకు ఈ సుదీర్ఘ సమయంలో ఈ దేశం గురించి, సమాజం గురించి, ఆర్థిక-సామాజిక-రాజకీయ పరిస్థితుల గురించి, చరిత్ర గురించి, భవిష్యత్తు గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, దాని క్షీణత గురించి, పునర్నిర్మాణ వ్యూహం గురించి తగిన అవగాహనలు ఉన్నాయనే అభిప్రాయం ఎప్పుడూ కలగలేదు. అవసరమైన సమర్థతలు ఉన్నట్టు అంతకన్నా అనిపించలేదు. పార్టీలో తన మాటకు ఎంతమాత్రం ఎదురులేని ఒక వ్యక్తి పరిస్థితి 21 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇట్లా ఉన్నప్పుడు, ఇక మున్ముందు సమర్థునిగా మారవచ్చునేమో అన్న ఆలోచనే పెద్ద అవివేకం.
పోనీ కాంగ్రెస్‌ను అట్లా సరిదిద్దగలవారు మరెవరైనా ఉన్నారా? ఆ వంశంలో లేరు. వంశానికి బయట లేరు. ఉన్నా ఆ వంశం, దాని భక్తులు నిలవనివ్వరు. అదొక బందీ పార్టీ. దానిని బట్టి అంతిమంగా తేలుతున్నది, పార్టీకి ఈ క్షీణత ఒక స్థిరపడిన వాస్తవం. రాహుల్‌గాంధీ క్షీణ నాయకత్వం
మరొక స్థిరపడిన వాస్తవం.
ఇక్కడ ఒక ఆలోచన రావచ్చు. అది, ఐక్య సంఘటనల విషయం. ఒక పెద్ద పార్టీ క్షీణించి స్వీయశక్తిని కోల్పోయినప్పుడు ఇతర పార్టీలతో ఐక్య సంఘటనలు ఏర్పాటు చేసుకోవటం సర్వసాధారణం. కాంగ్రెస్ ఆ పని పలుమార్లు చేసింది. గెలిచినా, ఓడినా వాటిని నిలబెట్టుకున్నది. కానీ, రాహుల్‌గాంధీ నాయకత్వం మొదలైనాక ఆ విషయంలోనూ క్షీణదశ ఆరంభం కావటం గమనించదగినది. ప్రస్తుతం ‘ఇండియా’ కూటమి పరిస్థితినే గమనించండి. గత ఎన్నికలలో ఆ కూటమికి, దానితోపాటు కాంగ్రెస్‌కు మంచి ఫలితాలైతే వచ్చాయి గాని, కేవలం రాహుల్ అసమర్థత కారణంగా తర్వాత నుంచి కూటమి గందరగోళంగా మారింది. ఆయన తీరు పట్ల అసంతృప్తి ప్రకటించని పార్టీ ఒక్కటైనా లేకపోయింది. ఒకరు కూటమి నుంచి పూర్తిగా బయటకుపోగా, కొందరు ఆ మాట అనకున్నా సొంతంగా పోటీ చేస్తున్నారు. మామూలుగానైతే ఎక్కువ మాట్లాడని సీపీఎం వంటి పార్టీ గత ప్రధాన కార్యదర్శి, ఇప్పుడిక ‘ఇండియా’ కూటమి అనేదే లేదన్నారు.
గత ఎన్నికల తర్వాత కూటమి ఒక్కసారైనా సమావేశం కాలేదని, దాని అజెండా ఏమిటో బోధపడటం లేదని ఎత్తిచూపారు. ఇన్నిన్ని జరుగుతున్నా రాహుల్‌గాంధీ నోరు విప్పటం లేదు. మరింత విచిత్రంగా, క్షేత్రస్థాయిలో ప్రజలకు పట్టని, వారి జీవిత సమస్యలతో నిమిత్తం లేని నినాదాలు ఏవో ఎత్తుకొని, భూమ్యాకాశాలను ఒకటి చేసే హంగామాలు సాగిస్తున్నారు. ఆయన గతంలోనూ ఇదే చేశారు. కాలానుగుణమైన ఒక నిర్దిష్ట ప్రణాళిక ఆయన నాయకత్వాన కాంగ్రెస్‌కు గాని, ఇండియా కూటమికి గాని నేటికీ లేదు. తనను ఆ 140 ఏండ్ల పార్టీ క్షీణ దశ ప్రతినిధి అనటం అందువల్లనే.
రేవంత్‌రెడ్డి విషయానికి వస్తే, ఒక క్షీణస్థితి హీనస్థితిగా పతనం కావటం గాని, క్షీణ నాయకుల అనుయాయులుగా హీన నాయకులు చెలామణిలోకి రావటం గాని ఒక తార్కికమైన సహజ పరిణామం. ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు ఎవరో ఒకరు, లేదా ఎందరో కొందరు ఆ పతన స్థితికి హీన సంకేతాలుగా, ప్రతినిధులుగా రూపొందుతారు. ఆ విధంగా ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ప్రముఖ పాత్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తన తీరుతెన్నులలో ఈ క్షీణతలు, హీనతలు ఏ విధంగా ప్రతిఫలిస్తున్నాయో ప్రజలు అనునిత్యం గమనిస్తున్నదే. ఏవగించుకుంటున్నదే. ఆ విషయం తను గ్రహించలేనిది కాదు. కానీ, తనకు గతం నుంచి అబ్బిన సంస్కారం వల్ల కొంత కాగా, కాంగ్రెస్ క్షీణతకు ఫలితమైన హీనత తనలో కలగలిసి పోవటం వల్ల మరి కొంతగా ఆయన ఆ లక్షణాలకు బందీగా మారారు. ఆ హైన్యాన్ని అనుభవించి ఆనందిస్తున్నారు. క్షీణతలో స్వయంగా బందీ అయిన రాహుల్‌గాంధీ, ఈ హీనతను సరిదిద్దగల పరిస్థితి లేదు.
మొత్తంగా చూసినప్పుడు ఆ స్థాయిలో రాహుల్‌గాంధీ, ఈ స్థాయిలో రేవంత్‌రెడ్డిలు కలిసి, 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ క్షీణతకు, హీనతకు ప్రతినిధులుగా, సంకేతాలుగా ఇంకా చెప్పాలంటే పరిణామ కారకులుగా మారారు. ఆ విధంగా ఇది ఆ పార్టీ పతన చరిత్రలో ఒక సహజ, అనివార్య అధ్యాయం అవుతున్నది.
-టంకశాల అశోక్