రాజనీతిజ్ఞుడిగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా, అపర చాణక్యుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సంస్కరణల సృష్టికర్తగా పేరుగాంచిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారత ఖ్యాతిని ఇనుమడింపజేశారు. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రిగానే కాకుండా, ప్రధానిగా కూడా సేవలందించిన పీవీ సరికొత్త చరిత్ర లిఖించారు. భారత్‌ను ఆర్థికమాంద్యం నుంచి తప్పించేందుకు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఆయన దేశ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. నిరాడంబరుడైన ఆయన గొప్ప రాజకీయ దురంధరుడు. తన చాణక్యనీతితో దేశాన్ని ఐదేండ్లు పాలించిన ఆయన స్థితప్రజ్ఞత గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే.
పీవీ నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకటనర్సింహారావు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం లక్నేపల్లిలో సీతారామారావు, రుక్మిణి దేవి దంపతులకు 1921 జూన్ 28న ఆయన జన్మించారు. అయితే, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామస్థులైన పాములపర్తి రంగారావు, రత్న బాయి దంపతులు ఆయనను దత్తత తీసుకున్నారు. దీంతో ఆయన పేరులో పాములపర్తి వచ్చిచేరింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన పీవీ.. డిగ్రీ చదివేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో చేరారు. ఆ సమయంలో నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నందుకు ఆయన ఓయూ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తిచేశారు.
బ్రిటిష్ వలసవాదానికి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన గొప్ప విప్లవకారుడు పీవీ. 1944లో వరంగల్ వేదికగా కాకతీయ పత్రికను స్థాపించిన ఆయన 1946- 1955 వరకు ఆ పత్రిక సంపాదకులుగా వ్యవహరించారు. కాకతీయ పత్రికలో ప్రచురితమైన గొల్ల రామవ్వ కథ, అబల జీవితం, నీలి రంగు పట్టుచీర, మంగయ్య అదృష్టం లాంటి రచనలు అప్పటి సామాజిక జీవనానికి అద్దం పట్టాయి. పీవీ రచించిన ఆర్తగీతికలు కూడా కాకతీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. పీవీ ఆత్మ కథ ‘లోపలి మనిషి’లో భారతదేశ చరిత్ర, హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన విశిష్ట అంశాలను ప్రస్తావించారు.
1952లో పీవీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. 1957లో మంథని ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగిడారు. అపర మేధావి అయిన పీవీ 1962 తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి జన్మభూమికి ఎనలేని సేవ చేశారు. 1969 తొలి దశ ఉద్యమం తర్వాత తెలంగాణకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాల్సి వచ్చింది. దీంతో వివాదరహితుడైన పీవీని ఆ పదవి వరించింది. ఈ క్రమంలో 1971 సెప్టెంబర్ నుంచి 1973 జనవరి వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా సేవలందించిన ఆయన భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పీవీని తెలంగాణ పక్షపాతి అని ఆంధ్ర నాయకులు ఆరోపించినా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆయన ఎక్కడా తగ్గలేదు. అదే సమయంలో ‘జై ఆంధ్ర’ ఉద్యమం కూడా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీవీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత సుమారు రెండు దశాబ్దాలకు 1991 జూన్ 21న దేశ ప్రధానిగా పీవీ బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా ఆయన ప్రమాణం చేసే నాటికి భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన పలు సంస్కరణలు తీసుకొచ్చి భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌పై పీవీ విశ్వాసముంచారు. మునిగిపోయే నావ లాంటి మైనారిటీ సర్కార్‌ను ఐదేండ్లు విజయవంతంగా నడిపిన పీవీ వినూత్న విధానాలతో కొత్త శకానికి నాంది పలికారు. భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన ఆయన తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణం.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం, స్థానిక వ్యాపారాలను క్రమబద్ధీకరించడం, మూలధన మార్కెట్‌ను సంస్కరించడం, ద్రవ్యలోటు తగ్గించడం వంటి కార్యక్రమాలను పీవీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకొని దేశం ప్రగతి పథంలోకి దూసుకెళ్లింది. పీవీ అనుసరించిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల ఫలితంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచింది. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా అభివర్ణిస్తారు. ఆర్థిక సంస్కరణలే కాకుండా పీవీ మరికొన్ని ఘనతలను సాధించారు. దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న పంజాబ్ తీవ్రవాదాన్ని అణచివేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
1998లో వాజపేయ్ ప్రభుత్వం చేపట్టిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ సర్కారే. మానవ వనరుల శాఖకు ఆద్యుడు కూడా పీవీనే. విద్యాభివృద్ధికి పీవీ బాటలు వేశారు. ఇక దౌత్యపరంగా పీవీ సర్కార్ సరికొత్త శకానికి తెరతీసింది. ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలను కొనసాగించింది. తీవ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తున్న విషయాన్ని బయటపెట్టి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేలా చేసింది. ఆగ్నేయాసియా దేశాలతో సత్సంబంధాలను కొనసాగించింది. ఇలా భారత బాగు కోసం అహర్నిశలు శ్రమించిన పీవీ కీర్తిప్రతిష్టలు ఎప్పటికీ ఠీవీగా నిలిచి ఉంటాయి.
– (వ్యాసకర్త: లైబ్రేరియన్, శ్రీవెంకటేశ్వర ఆర్కిటెక్చర్ కళాశాల, సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ)
సిలివేరు అశోక్ 77806 81801