బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, సంస్కరణలకు ఆద్యుడు పీవీ. తెలంగాణ బిడ్డగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శం. చాలా ఆలస్యంగా భారతరత్నకు ఎంపికైన ఆయన అసలైన ‘భారతావని రత్నం’ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయనకు భారతరత్న పురస్కారం వచ్చిందని తెలియగానే నా మనసు పులకించింది. పీవీతో గడిపిన నాటి క్షణాలు మదిలో మెదిలాయి.
అది 1984 సంవత్సరం జూలై మాసం. మా స్వగ్రామం నాగసముద్రాల నుంచి చింతపల్లి భాస్కర్‌రెడ్డి, సురుకొంటి రాఘవరెడ్డి, ఎల్గుమెట్ల మల్లారెడ్డి, మంగళారపు చిన్న మల్లయ్య, పెద్ద సముద్రాల కోనవేన చంద్రయ్యలతో కలిసి నేనూ ఢిల్లీకి వెళ్లాను. అంతకుముందే భాస్కర్‌రెడ్డి, చంద్రయ్య దుబాయి వెళ్లివచ్చారు. మమ్మల్ని కూడా తీసుకెళ్తామని చెప్పడంతో వారితో పాటు ఢిల్లీకి పోయాం. ఇదిగో వీసా! అదిగో వీసా! అంటుండగానే దేశ రాజధానిలో 14 నెలలు గడిచిపోయాయి. వీసాలు వచ్చాయని ఏజెంట్ల నుంచి ఓ రోజు కబురందింది. రాత్రి 10 గంటలకల్లా నెహ్రూ ప్యాలెస్‌లోని ఆఫీస్‌కు రావాలని వారు చెప్పారు. ఒక్కొక్కరి నుంచి రూ.12 వేల విలువైన డీడీలు, కొంత నగదు తీసుకున్నారు. ఉదయం 4 గంటలకు విమానం ఉందని, రాత్రి 12 గంటలకు ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు బస్సులు వస్తాయని చెప్పారు. మాతో పాటు తమిళనాడు, కేరళ, పంజాబ్‌లకు చెందిన మొత్తం 40 మంది బస్సుల కోసం ఆఫీస్‌లో వేచి చూస్తున్నాం.
ఏడాదిగా కండ్లు కాయలుకాచేలా ఎదురు చూసిన కోరిక నెరవేరుతున్నదని, పట్టరాని సంతోషంతో అప్పటికే ఊరికి ఉత్తరాలూ రాశాం. సమయం గడిచిపోతున్నది. బస్సులు రావడం లేదు. ఆఫీస్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రధాన ఏజెంట్ ముఖర్జీ మోసం చేసి పారిపోయాడని ఆలస్యంగా తెలిసింది. మరో ఏజెంట్ వరియామ్ సింగ్, సిబ్బంది కూడా అక్కడికక్కడే మాయమైపోయారు. మోసపోయామని అప్పుడు అర్థమైంది.
కండ్ల వెంట నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అందరం అప్పు చేసే ఢిల్లీకి వెళ్లాం. తీసుకున్న అప్పుపై అప్పటికే ఏడాది వడ్డీ పడింది. మంగళారపు చిన్న మల్లయ్య అయితే ‘నేను ఇక్కడే ఏ రైలు కిందనో పడి చస్తా. ఊరికి మాత్రం రాను’ అంటూ గొల్లున ఏడ్చాడు. వారం పాటు ఆఫీసు చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. ఆఫీసు మూతపడింది. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. ఏం చేయాలో పాలుపోక ఊరికి బయలుదేరాం. రైలులో కూర్చున్నామే కానీ, మనసులో బాధ తీవ్రంగా కలచివేస్తున్నది. అర్ధరాత్రి 12 అయింది. ట్రైన్ ఆగ్రాలో ఆగింది. అందరూ నిద్రపోయారు. మమ్మల్ని మోసం చేసిన వాడిని ఏం చేయకుండా ఊరికి ఎందుకెళ్లాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే రైలు దిగేశాను. ఢిల్లీకి టిక్కెట్ తీసుకున్నాను. తిరిగి ఢిల్లీ చేరుకున్నా. ‘చెప్పాపెట్టకుండా దిగేశాను. వారి పరిస్థితి ఏమిటి? నేను చనిపోయానని అమ్మనాన్నలు అనుకుంటారేమో? తప్పు చేశానా?’ అనే ఆలోచనలతో చాలాసేపు ఏడ్చాను.
మేం మొదటిసారి కిరాయికి ఉన్న యూసఫ్ సరై కాలనీలో స్థానికుడైన ప్రేమ్ చందర్‌తో నాకు మంచి స్నేహం కుదిరింది. అతన్ని కలిసి జరిగిందంతా చెప్పా. ఎలాగైనా ఆ ఏజెంట్‌ను పట్టుకొని.. మా డబ్బులు, పాస్‌పోర్టులు తిరిగి తీసుకోవాలని వాడితో చెప్పా. రాజకీయ నాయకులు, తెలిసిన పోలీసుల సాయంతోనే అటువంటి మాఫియా గ్యాంగ్‌ను పట్టుకోగలమని అతనన్నాడు. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఒకటే ఆలోచనలు. ఆఖరుకు ఢిల్లీలో ఉండే పీవీని కలవాలని నిశ్చయించుకున్నా. మరుసటి రోజు పీవీ ఇంటికి వెళ్లాను. అక్కడ బోర్డును చూశాక నాకు తెలిసింది.. ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అని.
మొత్తానికి పీవీని కలిశాను కానీ, ఏం మాట్లాడాడో తెలియలేదు. ఆలోచిస్తూ నిల్చున్నా. ‘ఏం బాబు, ఏంటమ్మా’ అన్నారు పీవీ. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించా. ‘సార్ మాది హుస్నాబాద్’ అని చెప్పి, జరిగిందంతా వివరించా. పీవీకి హుస్నాబాద్‌కు అవినాభావ సంబంధం ఉంది. పీవీ, హుస్నాబాద్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు స్వయానా వియ్యంకులు. అందుకే లక్ష్మీకాంతరావు పేరు కూడా చెప్పా. ‘అంత డబ్బు వాళ్లను నమ్మి ఎలా ఇచ్చారు’ అని మొదట మందలించారు. కానీ, అక్కడే అల్పాహారం పెట్టించారు. అనంతరం సార్ పిలిచి తన కారులో పార్లమెంట్ సమీపంలోని పెద్ద భవంతికి తీసుకెళ్లారు. అక్కడ నాతో ఫిర్యాదులు తీసుకున్నారు. అప్పటికే సాయంత్రం 4 గంటలు అయింది. సార్ పిలిచి ‘ఎక్కడుంటున్నావు? డబ్బులు ఉన్నాయా?’ అని అడిగారు. రెండు రోజుల తర్వాత కనిపించమని చెప్పి, దించి రమ్మని డ్రైవర్‌తో అన్నారు. మరుసటి రోజు ఉదయమే ఏజెంట్ ముఖర్జీ ముంబైలో పట్టుబడ్డాడని వార్తలు వచ్చాయి. వందలాది మందిని మోసం చేసిన ముఖర్జీని పట్టుకోవడంతో చాలా సంతోషించా. 24 గంటలు గడవకముందే అరెస్టు చేయడంతో పీవీ సార్ దాన్ని ఎంత చాలెంజ్‌గా తీసుకున్నారో అర్థమైంది. మనసులోనే ఆయనకు నమస్కరించా.
మరుసటి రోజు మళ్లీ పీవీ సార్ ఇంటికి వెళ్లాను. ‘విచారణ నడుస్తున్నది. కానీ, డబ్బులు తిరిగి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు’ అని అన్నారాయన. మూడు నెలలుగా ఇంటి చుట్టూ తిరుగుతుండటంతో ‘పాస్‌పోర్ట్ లేదా సర్టిఫికెట్లు తీసుకురా. ఏదో ఒకటి చేస్తా’ అని చెప్పారు. నా దురదృష్టం ఏమిటంటే, పాస్‌పోర్ట్ ఏజెంట్ వద్ద ఉండిపోయింది. సర్టిఫికెట్లు ఊరిలో ఉండిపోయాయి. మొత్తానికి మోసగాళ్లను జైల్లో పెట్టించానన్న తృప్తితో తిరిగి ఇంటిబాట పట్టాను.
– మంగళారపు లక్ష్మణ్