మానవ హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబా మృతి వ్యక్తిగతంగా బాధాకరమే కాదు, వ్యవస్థను సవాల్ చేసే వ్యక్తులు ఎదుర్కొనే కఠిన వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే ఘటనగా కూడా నిలుస్తుంది. ఆయన ఏండ్ల తరబడి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. మొదట విచారణ ఖైదీగా, ఆ తర్వాత శిక్ష పడిన ఖైదీగా. ఆ సుదీర్ఘ జైలు జీవితం ఆయన ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఇటీవల ఆయనను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసినప్పటికీ, ఆయన శరీరానికి, మనసుకు దీర్ఘకాలిక నిర్బంధం కలిగించిన గాయాలను పూడ్చేందుకు సమయం ఏ మాత్రం సరిపోలేదు.
ఈ ఉదంతం భారతదేశంలో అసమ్మతితో ఎలా వ్యవహరించాలనే విస్తృత స్థాయి అంశాన్ని మరోసారి ముందుకుతెచ్చింది. చట్టవిరుద్ధమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్నవారికి ఆర్థిక పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పులో వెల్లడించడం గమనార్హం. సదరు పరిహారం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ఏండ్లకొద్దిగా కోల్పోయిన జీవితాన్ని అది తిరిగివ్వలేదనేది వాస్తవం. అనుభవించిన వేదనకు, ఆరోగ్యం, సంక్షేమంపై పడిన ప్రభావానికి అది పరిహారం కాజాలదు. ఆర్థిక పరిహారం కన్నా న్యాయనిర్ణయ విధానంలో, మరీ ముఖ్యంగా బెయిల్ మంజూరు విషయంలో వ్యవస్థాగత మార్పులు తీసుకురావడం చాలా ముఖ్యం.
ఏ ప్రజాస్వామిక న్యాయవ్యవస్థకైనా బెయిల్ అనేది హక్కు, జైలు అనేది మినహాయింపుగా గుర్తించే సూత్రం మూలాధారం కావాలి. దురదృష్టవశాత్తు ఈ సూత్రం, విశేషించి ప్రభుత్వం పట్ల అసమ్మతి, వ్యతిరేకత విషయంలో పదే పదే తిరస్కారానికి గురికావడం మనం చూస్తున్నాం. ఈ సూత్రాన్ని తలదాల్చేందుకు బదులుగా పాలకపక్షాలు, తమ రాజకీయ భావజాలంతో నిమిత్తం లేకుండా, అసమ్మతి తెలిపేవారి గొంతు నొక్కేందుకు లేదా ఆధిపత్యాన్ని ప్రశ్నించేవారిని శిక్షించేందుకే తరచుగా తమ అధికారాన్ని వినియోగించుకుంటున్నాయి. ప్రొఫెసర్ సాయిబాబా కేసు ఇందుకు ఒక దృష్టాంతంగా నిలుస్తుంది. ఆయన నిజానికి ఓ ప్రతిపక్ష నేత కాదు. కేవలం మానవ హక్కులు, న్యాయం గురించిన ప్రశ్నలు లేవనెత్తిన ఓ అసమ్మతివాది మాత్రమే. అందుకు ఆయన భారీ మూల్యమే చెల్లించుకున్నారు.
బెయిల్ అనేది మినహాయింపు కాకుండా తప్పనిసరి నిబంధనగా అమలయ్యేలా చూసే బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉన్నది. నేర నిరూపణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో పెట్టడం లేదా విచారణ ఖైదీగా కొనసాగించడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమే కాదు, న్యాయవ్యవస్థ ఔచిత్యంపై ప్రశ్నల నీడలు పరుస్తుంది. న్యాయవ్యవస్థ విచారణ విధానం ప్రజల హక్కులు కాపాడేలా ఉండాలి, వారి గొంతు నొక్కేలా కాదు. దురదృష్టవశాత్తు ప్రొపెసర్ సాయిబాబా లాంటివారు ఎందరో హింసాత్మక ఘటనలకు పాల్పడినందుకు కాదు, కేవలం ప్రభుత్వ వైఖరిని సవాల్ చేసే అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు, వాటిని వ్యక్తపరిచినందుకు జైలులో మగ్గిపోవాల్సి వస్తున్నది.
అసమ్మతి అనేది ఒక ప్రజాస్వామిక హక్కుగా కాపాడే న్యాయవ్యవస్థను నిలబెట్టేందుకు మనమంతా సిద్ధంగా ఉన్నామా అనేది అసలు ప్రశ్న. తప్పుడు నిర్బంధానికి ఆర్థిక పరిహారం అనేది ముఖ్యమైనదే అయినప్పటికీ విశ్వాసాల కారణంగా ఏ వ్యక్తినీ అక్రమ నిర్బంధానికి గురిచేయకుండా బెయిల్ హక్కును న్యాయవ్యవస్థ అమలు చేయడం అంతే ముఖ్యం లేదా అంతకంటే ముఖ్యం. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యంలో కీలక అంశమని, దానిని అణచివేయడం కాకుండా కాపాడటమనేది న్యాయవ్యవస్థ బాధ్యత కావాలని ప్రొఫెసర్ సాయిబాబా జీవితం, పోరాటం మనకు గుర్తుచేస్తున్నాయి.
ఈ దిశగా ఆలోచిస్తే, ప్రొఫెసర్ సాయిబాబా మరణం న్యాయవ్యవస్థ, శాసనకర్తలు సత్వరమే ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నది. న్యాయం అనేది, ముఖ్యంగా అసమ్మతి హక్కును కాపాడే విషయంలో.. సజావుగా, సత్వరమే అందించడం ప్రజాస్వామిక విలువలను నిలబెట్టే విషయంలో అత్యంత కీలకం కావాలి. హేతుబద్ధమైన, విమర్శనాత్మకమైన గొంతులను సుదీర్ఘ నిర్బంధంతో నొక్కేయడాన్ని మనం అనుమతించరాదు. అందుకు భిన్నంగా బెయిల్ అనేది హక్కు, జైలు అనేది మినహాయింపు అనే సూత్రాన్ని అమలయ్యేలా చూసి, వారి అసమ్మతి హక్కును కాపాడేలా వ్యవస్థను పటిష్ఠం చేయడం ఎంతైనా అవసరం. రాజస్థాన్ వర్సెస్ బాలచంద్ కేసులో జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ‘బెయిల్ అనేది అనివార్య నిబంధన. జైలుకు పంపడమనేది మినహాయింపు’ అని ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం.