ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్, బీజేపీ.. ఏ పార్టీ ఉన్నా దేశంలోని ప్రజాస్వామ్యవాదులపై వాటిది ఒకే రకమైన కన్నెర్ర చూపు. ఏ మూలన రాజ్యాంగం, హక్కులు అని నోరెత్తినా ఆ గొంతును శాశ్వతంగా నులిమేసే ప్రయత్నమే చేస్తున్నాయి. అకారణంగా కఠిన చట్టాలను వారిపై ప్రయోగించి జైళ్లలో క్రూర హింసల పాలు చేసి తమ కసిని తీర్చుకుంటున్నాయి. అందుకు నిలువెత్తు సాక్ష్యమే జీఎన్ సాయిబాబా జీవితం.
శారీరకంగా 90 శాతం అంగవైక ల్యం ఉన్న సాయిబాబా గత పదేండ్లుగా దేశంలో సాగుతున్న దుర్మార్గ పాలనకు బలయ్యారు. ఈ నెల 12న హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. జైల్లో అధికారులు ఆయన ఆరోగ్యం పట్ల చూపిన నిర్లక్ష్యమే సాయిబాబా ప్రాణం తీసిం ది. జైలు గోడల మధ్య ‘నేను చావును ఎదిరిస్తున్నాను’ అన్న ఆయన జైలు బయటే మరణించారు. తొమ్మిదేండ్ల పాటు నాగపూర్ జైల్లోని అండా సెల్ తనను వేపుకు తిన్నా మరణంలో తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన వేదనను కవిత్వం ద్వారా, ఉత్తరాల ద్వారా లోకానికి తెలియజేశారు. ‘నేను చనిపోయేలా ఏం చేయాలో వారికి తెలియదు/ ఎందుకంటే నాకు మొలకెత్తే గడ్డి సవ్వడులంటే చాలా ఇష్టం’ అని రాశారు.
పోలియో వ్యాధి వల్ల కాళ్లు చచ్చుబడిపోయినా, సాయిబాబా శరీరాన్ని ఈడ్చుకుంటూ యూనివర్సిటీల మెట్లెక్కి ఉన్నత చదువులు అందుకున్నారు. ఇంగ్లీష్‌లో పీహెచ్డీ చేసి ఢిల్లీలోని కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేశా రు. 2014, మే 9 నాడు కాలేజీ నుం చి ఇంటికి వస్తుండగా పోలీసులు ఆయనను గడ్చిరోలికి తీసుకువెళ్లారు. ఉపా చట్టం కింద కేసు పెట్టి నాగపూర్ సెంట్రల్ జైలుకు పంపి, సర్వదా పోలీసుల నిఘా ఉండే ఎలుకల బోనులాంటి అం డా సెల్లో వేశారు. అంగవైకల్యం కారణంగా ఆయనను నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పించాలని ఎన్ని విన్నపాలు చేసినా ఫలితం రాలేదు. ప్రభుత్వం పన్నిన భారీ కుట్రలో భాగంగా ఒక కోర్టు బెయిల్ ఇవ్వగానే మరో కోర్టు దాన్ని రద్దుచేసేది.
ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో సాయిబాబా భాగమయ్యారని 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనకు జీవితఖైదు శిక్ష వేసింది. ఈ తీర్పును సమీక్షించాలని ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఐదేం డ్ల తర్వాత ఆయన పిటిషన్ బెంచిపైకి వచ్చింది. ఈ కాలం ఆయన అదే జైల్లో దుర్భర జీవితం గడపక తప్పలేదు. 2022లో బాంబే హైకోర్టు.. గడ్చిరోలి సెషన్స్ కోర్టు విధించిన జీవితఖైదు తీర్పును కొట్టివేసి సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. ఆ మర్నాడే పునర్విచారణ పేరిట హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. మళ్లీ విచారణ మొదలైంది. మరో రెండేండ్ల పాటు అండా సెల్ నరకం కొనసాగింది. చివరికి బాంబే హైకోర్టు 2024, మార్చి 5 నాడు సాయిబాబాను మళ్లీ నిర్దోషిగా ప్రకటించింది. ఎట్టకేలకు మార్చి 6 నాడు జైలు జీవితం నుంచి ఆయనకు విముక్తి లభించింది.
పోలీసులు పట్టుకెళ్లిన నాటి నుంచి విడుదలయ్యేదాకా మావోయిస్టులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని సాయిబాబా చెప్తూనే ఉన్నారు. ఆయన మాట నిజమని తేల్చడానికి చట్టానికి పదేండ్లు పట్టింది. చేయని నేరానికి ఎన్ని తిప్పలు పడ్డా బెయిల్ దొరకలేదు. క్యాన్సర్ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న తల్లిని చూడటానికి అనుమతించలేదు. కొడుకును చూడకుండానే 2020 ఆగస్టు 1న ఆ తల్లి కన్నుమూసింది. చివరి చూపు కూడా ఆయనకు దక్కలేదు. తల్లి అంత్యక్రియల హాజరుకు పెట్టుకున్న పెరోల్ మంజూరు కాలేదు.
రాజకీయ పెద్దలైన శరద్ పవార్, సీహెచ్ విద్యాసాగర్‌రావు లాంటి వారి మాటలు కూడా పనిచేయలేదు. ప్రపంచ మానవ హక్కుల సమాజాలు, ఐక్యరాజ్యసమితి అభ్యర్థనలను ప్రభుత్వాలు ఖాతరు చేయలేదు. భారత, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆయన పట్ల కనీస మానవతా దృక్పథం చూపించలేదు. జైల్లో తానెలా ఉండేదీ, తన ఆరోగ్యం ఎలా దెబ్బ తిన్నదీ మొదలైన విషయాలు సాయిబాబా పత్రికల్లో వివరించారు. అండా సెల్లో 14 నెలలు గడిపిన తర్వాత అక్టోబర్ 2015లో రాసిన వ్యాసంలో ఆ సమ యం 14 ఏండ్లుగా అనిపించిందన్నారు. తాను మరో వంద నెలలు అక్కడే ఉండవలసి వస్తుందని అప్పటికి ఊహించి ఉండరు.
8 నెలల తర్వాత వెస్టర్న్ కమోడ్ ఏర్పాటుచేశారు. అది కూడా సరిగ్గా పనిచేసేది కాదు. రోజుకు ఒక బకెట్ నీళ్లు మాత్రమే లభించేవి. తనకు వెన్నుపాములో సమస్య ఉందని తెలిసినా పోలీసులు తన చేతులు పట్టుకొని లాక్కుపోయేవారని, దాని వల్ల ఎడమవైపు శరీరం పనిచేయడం మానేసిందని రాశారు. సరైన వైద్యం చేయించకుండా పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవా రు. దానివల్ల శరీరం మరిన్ని రోగాలకు నిలయమైంది. జైల్లోకి వెళ్లేముందు కాళ్లు పనిచేయకపోవడం తప్ప తన కు ఏ అనారోగ్యం లేదు. ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తే ఆరోగ్యం ఇంతగా దెబ్బతినేది కాదన్నారు.
మార్చి 9న విడుదలైన తర్వాత ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మీ ముందు సజీవంగా కనబడుతున్నాను కానీ, నా శరీరంలోని అవయవాలన్నీ పాడైనాయి’ అన్నారు. ఆ మాటన్న 7 నెలలకే, 57 ఏండ్ల వయసులో సాయిబాబా జీవితం ముగియడం విషాదకరం. తాను కోల్పోయిన జీవితానికి ఫలితం దక్కకుండానే నిష్క్రమించడం బాధాకరం. తెలంగాణవాది అయి న సాయిబాబా మరణం పట్ల నేటి కాం గ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శించింది. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి కోసం ఆయన పార్థివదేహాన్ని ఉంచేందుకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. కనికరం లేని ప్రభుత్వాల పాలనలో ముగిసిపోయే ప్రజాస్వామ్య యోధుల జీవితాలు ప్రజలను తప్పక చైతన్యపరుస్తాయి.
నర్సన్ బద్రి
94401 28169