రాష్ట్రంలోని ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో గత రెండేండ్లుగా వందలాది మంది ఉద్యోగులు పదోన్నతుల కోసం పడిగాపులు కాస్తున్నారు. విద్యుత్తు యాజమాన్యాలు నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. రెండు అంశాలపై అవి ప్రభుత్వాన్ని వివరణ కోరుతున్నాయి. విద్యుత్తు సంస్థల్లో 2014, జూన్ 2 నుంచి ఇచ్చినటువంటి ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి వారి ప్రాతినిధ్యాన్ని లెక్కించకుండా పర్యవసానంగా వచ్చే సీనియారిటీపై పదోన్నతులు కల్పించినట్టయితే ఆ పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలనే అంశం ఒకటైతే, నేరుగా పోటీ పరీక్షల ద్వారా ఎంపికవుతున్న ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన నిర్ధారించి తదుపరి పదోన్నతి కల్పించాలనే అంశం రెండవది.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2003 నుంచి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. 2009లో జీవో నెం 26ను జారీ చేస్తూ.. రిజర్వేషన్ వినియోగించుకొని పదోన్నతి పొందిన క్యాడర్లో కూడా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యం లేనట్టయితే పర్యవసానంగా పొందే సీనియారిటీతో సహా పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలుచేయాలని తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన జీవోలు 21, 5, 2, 26లను తప్పుగా అన్వయించి, ఉండాల్సిన ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పదోన్నతులు కల్పించారు. ఫలితంగా అనేక ఉన్నతస్థాయి పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉండాల్సిన శాతానికి మించి లబ్ధి పొందారు. ఈ అన్యాయాన్ని గ్రహించిన కొందరు ఉద్యోగులు 2011లో జీవో 26ను సవాల్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు.
పిటిషన్ను విచారించిన కోర్టు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో పర్యవసానంగా వచ్చే సీనియారిటీని ప్రాతినిధ్యానికి మించి ఇవ్వకూడదని జీవో 26ను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ 2018లో స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ ఎస్.ప్రకాష్ కేసులో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, జీవో నెంబర్ 26ను సమర్థిస్తూనే సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 2006లో నాగరాజు కేసు, 2018లో జర్నైల్ సింగ్ కేసు తీర్పుల్లో తెలిపిన విధివిధానాలను ప్రతి క్యాడర్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని లెక్కగట్టి ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో 2011 నుంచి కల్పించిన పదోన్నతులను అన్నింటిని సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం 2019లో అన్ని ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వరంగ సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తూ 2014 జూన్ 2 తర్వాత కల్పించిన ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి వారి ప్రాతినిధ్యాన్ని లెక్కించకుండా పర్యవసానంగా వచ్చే సీనియారిటీపై పదోన్నతులు కల్పించినట్టయితే ఆ పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పోలీసు, తదితర శాఖల్లో పదోన్నతులను సమీక్షించారు. కానీ, విద్యుత్తు సంస్థల్లో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న కారణాలన్ని చూపి నేటికీ అమలు చేయలేదు. విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు పదోన్నతుల సమీక్షపై నిరుడు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కూడా తీసుకున్నారు. ప్రస్తుతం విద్యుత్తు సంస్థల సీఎండీలపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు విచారణలో ఉన్నది.
తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడుతున్న ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన నిర్ధారించి ఆయా శాఖలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పటికప్పుడు అభ్యర్థుల సీనియారిటీని నిర్ధారించి పంపిస్తున్నారు. ఆ జాబితా ద్వారా పంపిన ఉద్యోగులకు పదోన్నతులను ఆయా ప్రభుత్వశాఖలు కల్పిస్తున్నాయి. కానీ, విద్యుత్తు సంస్థల్లో అమలుకు నోచుకోవడం లేదు.
2011లో అప్పటి యాజమాన్యాలు జోనల్, జిల్లా క్యాడర్లలో నియామకాలు పొందుతున్న అసిస్టెంట్ ఇంజినీర్లకు సంబంధించిన సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన నిర్ధారించాలని టీఓఓ. నం.13ను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్రాన్స్కో యాజమాన్యం ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటుచేసి కమిటీ నివేదిక ద్వారా 2021లో టీఓఓ నం.954ను జారీచేస్తూ నేరుగా నియామకాలు పొందుతున్న అన్ని క్యాడర్ల ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన నిర్ధారించాలని నిర్ణయం తీసుకున్నది. ఇతర విద్యుత్తు సంస్థలైన జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ యాజమాన్యాలు కూడా ఉత్తర్వులను జారీచేసి పాక్షికంగా అమలుచేశాయి.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వరంగసంస్థల్లో, విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలి. అదేవిధంగా విద్యుత్ సంస్థల్లో మెరిట్ సీనియారిటీపై ఉన్న వివాదాన్ని పరిష్కరించి విద్యుత్ సంస్థల సర్వీస్ రెగ్యులేషన్ పార్టు-2లోని 26(ఏ), తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ రూల్ 33(బి), 36(1)ల ప్రకారం నేరుగా పోటీ పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన అన్ని క్యాడర్ల ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ఆధారంగా నిర్ధారించి వెంటనే పదోన్నతులు కల్పించాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం)
-కోడెపాక కుమారస్వామి
94909 59625