మహారాష్ట్రలో ఐదేండ్లుగా జరుగుతున్న రాజకీయ ట్విస్టులు, టర్నులూ… ఒక సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. చీలికలతో చెల్లాచెదురైన పార్టీల మధ్య త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా అంతే ఉత్కంఠగా సాగనున్నాయని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో కలిసి బీజేపీ ‘మహాయుతి’ కూటమిగా, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ‘మహా వికాస్ అఘాడి’ కూటమిగా ఈ ఎన్నికల్లో ఆరు పార్టీలు రెండు శిబిరాలుగా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగుతున్నాయి. పలు పార్టీలు, ఉప పార్టీల మధ్య పెరిగిన ఈ ఆధిపత్య పోరులో పీఠం దక్కేదెవరికి అన్నదొక సంక్లిష్టమైన ప్రశ్న! దేశంలో భౌగోళికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, చారిత్రకంగా ఎంతో ప్రత్యేకత కలిగిన మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితులను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నపుడు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి.
Maharashtra Elections | మహారాష్ట్రలో ఉన్న భిన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ బలంగా ఉండటంతో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు లేవు. అందుకే, ప్రధాన పార్టీలు కూటములుగా తలపడుతున్నాయి. 1995 తర్వాత ఇక్కడ కాం గ్రెస్ పార్టీ ప్రాబల్యం తగ్గడం ప్రారంభమైంది. 1999 నుంచి 2009 మధ్య జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ కలిసి వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ-శివసేన కూ టమిని ఓడించి అధికారంలోకి వచ్చింది. అ యితే, 2014 ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానా లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. మ రోవైపు తన భాగస్వామి ఎన్సీపీ కూడా పలు సంప్రదాయ సామాజిక వర్గాల్లో మద్దతు కోల్పోవడంతో ఈ కూటమి అధికారానికి దూరమైంది.
బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 42 శాతం ఓట్లు సాధించాయి. అయితే ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా పొత్తు ధర్మం ప్రకారం ముఖ్యమంత్రి పీఠాన్ని రెండున్నరేండ్లు ఇస్తామని చెప్పిన బీజేపీ మాట తప్పుతున్నదని ఆరోపిస్తూ బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకున్నది. అదే క్రమంలో కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో ఉద్ధవ్ ఠాక్రే సిద్ధాంతాలు ఆయన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే కంటే భిన్నమైనవని తేలింది.
2017 బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన తరఫున ముస్లిం అభ్యర్థులను కూడా బరిలోకి దించింది. అందులో ఇద్దరు గెలిచారు కూడా! శివసేన 2019లో కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే సిద్ధాంతాల మీద మరింత స్పష్టత ఏర్పడింది.
ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇద్దరూ బాలాసాహెబ్ శివసేన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ 2022 జూన్‌లో ఆ పార్టీ నాయకుడు ఏక్నాథ్ షిండే రెబెల్ ఎమ్మెల్యేలతో శివసేనను చీల్చి బీజేపీతో చేతులు కలిపారు.
నెల రోజుల తర్వాత అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి బీజేపీ పంచన చేరడంతో మహా వికాస్ అఘాడి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుర్చీ దిగిపోయారు. ఆ సమయంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి కాగా, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఏక్నాథ్ షిండే శివసేన పార్టీని కూడా హస్తగతం చేసుకున్నారు. అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి తమదే అసలు ఎన్సీపీ అని ప్రకటించుకున్నారు.
నాయకులు అధికారం కోసం పార్టీలను చీ ల్చడం ప్రజలకు మాత్రం నచ్చలేదని 2024 లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టమైంది. ఈ ఎన్నికల్లో చీలికలకు కారణమైన బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల మీద తమ అసంతృప్తిని చూపించారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన తమ పార్టీ బలంగా ఉన్న 21 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిం ది. కాంగ్రెస్ పటిష్ఠంగా ఉన్న విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లోని 17 సీట్లలో పోటీ చేసింది. ఉత్తర, పశ్చిమ మహారాష్ట్రల్లో బలంగా ఉన్న 10 స్థానాల్లో శరద్‌పవార్ ఎన్సీపీ పోటీ చేసింది. మహా వికాస్ అఘాడి తమ బలాబలాలకు అ నుగుణంగా పోటీ చేయడంతో వాటి మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరిగింది. మహాయుతి కూటమి ప్రాంతీయ బలాబలాలను పట్టించుకోకుండా సీట్లను పంచుకోవడం, ఎన్నికల్లో ఉద్ధవ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించకుండా షిండే సాధించిన విజయాల ను ప్రచారం చేయడంతో మహాయుతి మూల్యం చెల్లించుకున్నది.
2024 లోక్‌సభ ఎన్నికలను బట్టి అసెంబ్లీ స్థానాల్లో పరిశీలిస్తే రాష్ట్రంలోని 288 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి 151 స్థానాల్లో, బీజేపీ కూట మి 128 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శించాయి. ఇండియా కూటమికి 43.71 శాతం ఓట్లు రాగా, ఎన్డీయే కూటమికి 43.55 శాతం ఓట్లు వచ్చాయి. ఈ స్వల్ప తేడానే, మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు గాను ఇండియా కూటమి 30 స్థానాలు గెలుచుకోగా, ఎన్డీయే కూటమి 17 సీట్లకు పరిమితమైంది. ఇండిపెండెంట్‌గా గెలిచిన ఒక కాంగ్రెస్ రెబెల్ అనంతరం తిరిగి హస్తం గూటికి చేరారు. 2019తో పోలిస్తే ఈసారి ఎన్డీయే కూటమి 8 శాతం ఓట్లు కోల్పో గా, ఇండియా కూటమి 12 శాతం ఓట్లు పెంచుకున్నది. 2019లో బీజేపీకి 28 శాతం ఓట్లు రాగా, 2024లో అది 26 శాతానికి తగ్గింది. సీట్లు పెంచుకున్న కాంగ్రెస్ కూడా గత ఎన్నిక ల్లో 16 శాతం ఓట్లు పొందగా, ఈసారి ఒక్క శాతమే పెంచుకొని 17 శాతానికి పరిమితమైంది. పార్టీలో వచ్చిన చీలిక కారణంగా అధికారం కోల్పోయిన ఉద్ధవ్ పట్ల సానుభూతి, కొవిడ్ సమయంలో ఆయన చేసిన పనులపై ప్రజలు సానుకూలంగా ఉండటం ‘ఇండియా’ కూటమికి ఎన్నికల్లో మేలు చేసింది.
విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, మరఠ్వాడా ప్రాంతాల్లో ఎన్డీయే కూటమి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ప్రాంతంలో మరాఠాలు బీజేపీకి దూరంగా జరిగారు. మహారాష్ట్ర రాజకీయాలు మరాఠాల ఆధిపత్యానికి ప్రసిద్ధి. మహారాష్ట్రలో ఈసారి గెలిచిన ఎంపీల్లో సగం మంది మరాఠా కులం వాళ్లే! మరాఠా రిజర్వేషన్ల ఉద్యమంతో అన్ని పార్టీలూ మరాఠాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే, ఈ రిజర్వేషన్లపై బీజేపీ ధోరణి ఎన్డీయే కూటమికి ప్రతికూలంగా మారింది. మరోవైపు ముంబై, కొంకణ్, ఠాణే ప్రాంతాల్లో షిండే శివసేన ప్రభావం బలంగా ఉండటం వల్ల బీజేపీకి ఓటమి తప్పింది.
మహారాష్ట్ర ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అయితే, నిరుపేదలకు, కింది కులాలకు సరైన న్యాయం జరగలేదని ఆ వర్గాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తీ వ్ర అసంతృప్తిగా ఉన్నాయి. దీంతో లోక్‌సభ ఎ న్నికల్లో భంగపాటు తర్వాత మహాయుతి అ సెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు ఆకర్షణీయ పథకాలను ప్రకటించింది. ఐదు నెలల కింద పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన రాష్ట్ర ఓటర్లు ఈ పథకాలపై ఎలా స్పందిస్తారో? అంతే కాకుండా ఈ ఎన్నికల అనంతరం అసలైన శివసేన ఎవరిదో? అసలైన ఎన్సీపీ ఏదో? తేలడం ఖాయం!
(వ్యాసకర్త: రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ)
-జి.మురళీ కృష్ణ
99668 33329